నేడు ఉక్కు కార్మికుల మహా ప్రదర్శన

ABN , First Publish Date - 2022-06-26T06:33:09+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమం ఆదివారం నాటికి 500 రోజులకు చేరుకుంటుంది.

నేడు ఉక్కు కార్మికుల మహా ప్రదర్శన
కార్మిక మహా ప్రదర్శనకు సంఘీభావం తెలుపుతున్న పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు

ఉద్యమానికి 500 రోజులు

స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చి వద్ద నున్న దీక్షా శిబిరం నుంచి రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ

అక్కడ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన


ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 25: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమం ఆదివారం నాటికి 500 రోజులకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చి వద్దనున్న దీక్షా శిబిరం నుంచి నగరంలోని డీఆర్‌ఎం కార్యాలయం వరకు వేలాది మందితో బైక్‌ ర్యాలీ, అనంతరం అక్కడ నుంచి జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా వున్న గాంధీ విగ్రహం వరకు కార్మిక మహా ప్రదర్శనను నిర్వహిస్తామని కార్మిక నాయకులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కార్మిక సంఘాలు, అధికారుల సంఘం, వివిధ అసోసియేషన్లు ఏకమై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడి ఉద్యమం చేపట్టాయి. 2021 ఫిబ్రవరి 12న స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చి వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాయి. నాటి నుంచి నేటి వరకు వివిధ రూపాల్లో ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. 


అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చి అఖిలపక్షం ఏర్పాటుచేసి ఢిల్లీ తీసుకువెళ్లాలని కార్మిక నాయకులు కోరుతున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రిని కలిసినప్పుడు స్టీల్‌ప్లాంట్‌ అంశం ప్రస్తావించలేదని, అందువల్ల ఈసారి ప్రత్యేకంగా సమావేశమై ‘ఉక్కు’ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరుతున్నారు. 


కేంద్రంలో చలనం లేకపోవడం దుర్మార్గం

-డి.ఆదినారాయణ, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించరాదని ఏడాది నుంచి ఎన్నో రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేకపోవడం దుర్మార్గమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. ఇప్పటివరకు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేశామని, ఇకపై మరింత ఉధృతం చేస్తామని అన్నారు. 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన ‘ఉక్కు’ను పరిరక్షించుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. 

 

ఎట్టకేలకు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

విశాఖ జిల్లాలో 3,585 మంది రెగ్యులరైజ్‌

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకుని డిపార్టుమెంట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన సచివాలయ ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వారికి కొత్త వేతన స్కేలు మేరకు జీతాలు ఇవ్వాలని ఆదేశించింది. తాజా జీవో మేరకు విశాఖ జిల్లాలో 3,585 మంది అర్హత సాధించారు. విశాఖ జిల్లాలో 607 వార్డు/గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 12 కేటగిరీల్లో 5,648 పోస్టులు ఉండగా 4,861 పోస్టులు భర్తీచేశారు. వీరిలో ఈ నెల 23వ తేదీ నాటికి 4,300 మంది రెండేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్నారు. అయితే డిపార్టుమెంట్‌ పరీక్ష పాసైన 3,585 మంది వివరాలను ఆయా శాఖల అధికారులు జిల్లా యంత్రాంగానికి పంపగా...వారందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయించారు. వీరిలో 25 మంది గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శులు, 52 మంది డిజిటల్‌ అసిస్టెంట్లు, 48 మంది వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, 24 మంది గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లు, 11 మంది ఉద్యానవన అసిస్టెంట్లు, 11 మంది ఫిషరీస్‌ అసిస్టెంట్లు, 22 మంది వెటర్నరీ అసిస్టెంట్లు, 48 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, 243 మంది వీఆర్వో/వార్డు రెవెన్యూ కార్యదర్శులు, 52 మంది గ్రామ సర్వే అసిస్టెంట్లు, 338 మంది శానిటరీ సెక్రటరీలు, 351 మంది ప్లానింగ్‌ కార్యదర్శులు, 446 మంది ఎడ్యుకేషన్‌ కార్యదర్శులు, 319 మంది వెల్ఫేర్‌ కార్యదర్శులు, 349 ఎమినిటీస్‌ కార్యదర్శులు, 296 పాలనా కార్యదర్శులు, 533 మంది మహిళా పోలీసులు, 442 ఎఎన్‌ఎంలు ఉన్నారు. డిపార్టుమెంట్‌ పరీక్షలు ఉత్తీర్ణులు కాకపోవడం, తదితర కారణాలతో మిగిలిన వారిని రెగ్యులర్‌ చేయడం లేదు.

Updated Date - 2022-06-26T06:33:09+05:30 IST