Abn logo
Sep 23 2021 @ 00:00AM

ఉక్కు సంకల్పాలు

గనుల్లో, భారీ పరిశ్రమల్లో పురుషులే పనిచేయగలరనే ఆలోచన ఉండేది ఒకప్పుడు. అయితే ఈ స్టీరియోటైప్‌ ఆలోచనల్ని బద్దలు కొడుతూ మహిళలు  దూసుకెళ్తున్నారు. పురుషులతో ధీటుగా నేటితరం మహిళలు రాణిస్తున్నారు. టాటా ఉక్కుపరిశ్రమకు సంబంధించిన జార్ఖండ్‌ గనుల్లో 38 మంది మహిళలు హెవీ ఎర్త్‌ మూవింగ్‌ మెషినరీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వారిలో ఓ ఐదుగురు ఉద్యోగుల విశేషాలివి..


‘‘మా నాన్న టాటా స్టీల్‌లో పనిచేసే ఉద్యోగి. ఆ మాటకొస్తే మూడు తరాల నుంచి ఈ సంస్థలోనే ఉద్యోగులు. నేను మొదటి సారి మైన్‌లోకి వెళ్లినపుడు అండర్‌గ్రౌండ్‌లో ఇబ్బంది అనిపించింది. పెద్ద యంత్రాలను ఆపరేట్‌ చేయడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే.. నేను ఇది వరకెన్నడూ బైక్‌ కూడా నడపలేదు. అలాంటి దాన్ని ఈ శిక్షణతో వచ్చిన కాన్ఫిడెన్స్‌ అద్భుతం. ఈ పని చేయగలని అనుకోలేదు. 

నోముండి గనుల్లో పని శిక్షణ తీసుకుని ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరాలనే కుతూహలంతో ఉన్నా. మా పూర్వీకుల్లా ఒక కంపెనీలో పనిచేయడం అదృష్టం. వర్కింగ్‌ షిఫ్టులను పట్టించుకోను. మహిళలుగా ఏదైనా చేయగలమనే విషయం గర్వంగా ఫీలవుతున్నా. సవాళ్లను స్వీకరించి నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడమే నా ముందుంది.’’

- ప్రియా మిశ్రా‘‘ఉమెన్‌ అట్‌ మైన్స్‌ ప్రోగామ్‌లోకి రాకముందే ఈ పరిస్థితి, వాతావరణం తెల్సు. హెచ్‌ఈమ్‌ఎమ్‌ ఆపరేటర్‌ కంటే ముందు గనుల్లోని కంట్రోల్‌ రూమ్‌లో పని చేశా. నేను డిప్లొమా మెకాట్రానిక్స్‌ చదివా. గనుల్లో పని చేసే అనుభవమున్న నాకు ఈ కొత్త ఉద్యోగం వచ్చింది. అందుకే తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు.

వాస్తవానికి టాటాలో హెఈమ్‌ఎమ్‌ ఆపరేటర్లు ఉద్యోగాలు పడుతూనే పరీక్షకు దరఖాస్తు చేసి అన్నింట్లో పాసయ్యా. నోముండి గనుల్లో ఏడు నెలలు థియరీ, రెండు నెలలు ఫీల్డ్‌లో శిక్షణ ఇచ్చారు. బేసిక్స్‌ నుంచి నేర్చుకున్నా. వెహికల్‌ ఆపరేటర్‌గానే కాకుండా డంపర్‌, షోవెల్‌ డిపార్ట్‌మెంట్స్‌లో శిక్షణ పొందాను. మేం ఇంకా తొలి దశలోనే ఉన్నాం. కాన్ఫిడెంట్‌గా ఉన్నా. శిక్షణ బావుంది. సంస్థలో మంచి స్థాయికి ఎదగాలి. చదువునూ కొనసాగించాలన్నదే నా ఆలోచన. ‘కొందరు నీ చేత కాదు. ఏమీ చేయలేవు అన్నప్పుడు కచ్చితంగా మనం ఆ సవాల్‌ను స్వీకరించాలి. పని చేసి మనమేంటో నిరూపించుకోవాలి. నేనదే చేశా’’.                                        

- కిరణ్‌ మండరి‘వైద్యరంగంలోకి అడుగెట్టాలనే కలగనేదాన్ని. అయితే విధి ఇంకో విధంగా ఉంది. ‘బిడిఎస్‌’లో సీట్‌ వస్తూనే మెడికల్‌ డ్రీమ్స్‌ చెదిరిపోయాయి. మళ్లీ చదివి సీట్‌ కొట్టాలంటే ఏడాది ఎదురు చూడాలి. సరిగ్గా అదే సమయంలో టాటా సంస్థలో ‘హెవీ ఎర్త్‌ మూవింగ్‌ మిషినరీ (హెచ్‌ఈమ్‌ఎమ్‌)’ సంస్థలో ఉద్యోగాలున్నాయని తెల్సింది. దరఖాస్తు చేశా. పరీక్ష పాసయ్యా. ఇంటర్వ్యూను తేలికగానే పూర్తి చేశా. ఆ తర్వాత ఉద్యోగంలో శిక్షణ పొందడానికి పశ్చిమ బొకరో గనుల్లోకి వెళ్లా. కొత్తగా ఫీలయ్యా. ఎప్పుడూ వినని, తెలియని ఉద్యోగంలోకి వెళ్తున్నానే థ్రిల్‌ గొప్పది. 

ఇరవై రెండేళ్ల వయసులో.. గనుల్లో ఉద్యోగమేంటని ఇంట్లోవాళ్లు ఈ ఉద్యోగానికి వెళ్లొద్దొన్నారు. ‘డాక్టర్‌ మాత్రమే చదవ’మని ప్రోత్సహించారు. అయితే ఈ కొత్త ఉద్యోగం చేయాలనిపించింది. రకరకాల యంత్రాలను ఫీల్డ్‌లో ఎలా ఆపరేట్‌ చేయాలో నేర్చుకున్నా. శారీరంగా ఇబ్బంది ఉంటుందనే విషయాన్ని మర్చిపోయా. ఈ శిక్షణా తరగతుల్లో గ్రౌండ్‌లెవల్‌నుంచి మేం తెలుసుకున్నాం. ఏదేమైనా మగవారు మాత్రమే ఈ ఉద్యోగం చేస్తారనేది భ్రమ. అమ్మాయిలం  కూడా కఠినమైన ఫీల్డ్‌ వర్క్‌ను చేస్తాం’.               

- దీపికా కుమారి‘‘రసాయనశాస్త్రంలో మాస్టర్స్‌ చదివా. అయితే ఈ హెచ్‌ఈమ్‌ఎమ్‌ ఆపరేటర్‌ ఉద్యోగంలోకి వద్దామనుకున్నా. ఎందుకంటే అందరిలా మందలో ఒకదానిలా ఉండాలనుకోలేదు. కొత్తగా ఏదైనా చేద్దామనే ఇటొచ్చా. ఆ మాటకొస్తే నేను ప్రత్యేకం. అమ్మాయిలు భయపడతారు, పనిచేయడం కష్టమనే పురుషాధిక్య ప్రపంచంలో.. నా లాంటి వాళ్లు ఉంటారనేది చెప్పాలనే ఉద్దేశ్యం. అయితే ఇక్కడికి రావటానికి అంత సులువు కాలేదు. మా ఇంట్లోనే వద్దన్నారు. బంధువులు, స్నేహితులూ నా నిర్ణయం సరైనది కాదన్నారు. 

పశ్చిమ బొకోరో గనుల్లో శిక్షణ బావుంది. ఉద్యోగం సులువు లేదా కష్టమనే అభిప్రాయాల్లేవు. ఏకాగ్రత ఉండాలి. నైపుణ్యం సంపాదించుకోవాలి. కష్టమైన సందర్భంలో ప్రెజెన్స్‌ ఆఫ్‌ మైండ్‌ ముఖ్యం ఇక్కడ. శారీరకంగా ఇబ్బందే అనే విషయం తెలుసు. అయితే బాధ్యతల్ని స్వీకరించి సామర్థ్యాన్ని నిరూపించుకుని ఉద్యోగంలో పైస్థాయికి వెళ్లాలి. ఇతరులు ఏమైనా అననీ మనకు మనం మోటివేట్‌ చేసుకోవాలి. సవాళ్లను స్వీకరించి స్టీరియోటైప్‌ను బ్రేక్‌ చేసి ముందుకెళ్లాలన్నదే నా ఆలోచన.’’

   - పూనమ్‌ ప్రీతి సింగ్‌‘‘మా నాన్న ఉక్కు పరిశ్రమలో పని చేస్తున్నారు. పదో తరగతి చదివాక ఓ ఉద్యోగానికి టాటా ఉక్కు పరిశ్రమలో దరఖాస్తు చేశా. పరీక్షలో ఉత్తీర్ణత సంపాదించలేకపోయా. దీంతో బీకామ్‌ చదివా. ఆ తర్వాత హెచ్‌ఆర్‌లో మాస్టర్స్‌ చేశా. బీఈడీ చదివా. భారీ యంత్రాల ఆపరేటర్ల ఉద్యోగాలు పడ్డాయని తెలియగానే దరఖాస్తు చేశా. చుట్టు పక్కన ఉండే వాళ్లంతా ‘ఆడపిల్లకు ఆ కష్టమైన ఉద్యోగమేంటీ? అంత సులువు కాదు. ఆ ఉద్యోగంలోకి నీ బిడ్డను ఎలా పంపుతున్నావు?’ అన్నారు. ‘ఆడపిల్లలు బస్సులు నడుపుతున్నారు. రైళ్లు, విమానాలను నడపడానికి భయపడట్లేదు. ఇలాంటి రోజల్లో నా కూతురు ఈ ఉద్యోగం ఎందుకు చేయకూడదు?’ అని నాన్న వారిని తిరిగి ప్రశ్నించారు. అలా నాన్న సహకారంతోనే పశ్చిమ బొకోరో గనుల్లో ఉద్యోగం సంపాదించా. శిక్షణ విజయవంతంగా పూర్తి చేశా. సరైన దారిలో వెళ్లటమే కావాల్సింది. ఆకాశమే నా హద్దు. ఆగేది లేదు ఏ పొద్దు.                                         

-సుస్మిత