స్టీలు, సిమెంట్‌ మరింత భారం

ABN , First Publish Date - 2022-03-09T04:50:55+05:30 IST

ఉక్రెయిన-రష్యాల మధ్య యుద్ధ ప్రభావం మెల్లమెల్లగా ఒక్కో రంగంపై పడుతోంది. షేర్‌ మార్కెట్‌ను అతలాకుతలం చేసి, వంట నూనెల ధరలను ఆకాశానికి పెంచేసిన యుద్ధం.. అంతకన్నా ఎక్కువగా నిర్మాణరంగంపై ప్రభావం చూపుతోంది.

స్టీలు, సిమెంట్‌ మరింత భారం

యుద్ధ ప్రభావంతో పెరిగిన ధరలు

పడిపోయిన వ్యాపారాలు

నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావం


నెల్లూరు, మార్చి8(ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన-రష్యాల మధ్య యుద్ధ ప్రభావం మెల్లమెల్లగా ఒక్కో రంగంపై పడుతోంది. షేర్‌ మార్కెట్‌ను అతలాకుతలం చేసి, వంట నూనెల ధరలను ఆకాశానికి పెంచేసిన యుద్ధం.. అంతకన్నా ఎక్కువగా నిర్మాణరంగంపై ప్రభావం చూపుతోంది. స్టీలు, సిమెంట్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాణాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. ఏ రోజు ఏ రేటుకు అమ్మాల్సి వస్తుందో తెలియక వ్యాపారులు సరుకు దించుకో లేక, ఉన్న సరుకును అమ్ముకోలేక అల్లాడిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్టీలు, సిమెంట్‌ అమ్మకాలు పూర్తిగా స్తంభించాయి.


వినియోగదారులపై ధరల సమ్మెట

 

యుద్ధానికి ముందు స్టీలు ధర టన్ను రూ. 60వేల నుంచి రూ. 65వేల వరకు ఉండేది. వైజాగ్‌ స్టీల్‌ రూ. 65వేలు ఉండగా, మిగిలిన రకాలు రూ. 60వేల  వరకు ఉన్నాయి. 15 రోజుల వ్యవధిలోనే స్టీలు ధర టన్నుపై రూ.20వేల వరకు పెరిగింది. మంగళవారం ధరల చూస్తే వైజాగ్‌ స్టీలు టన్ను రూ.85వేలు కాగా, ఇతర రకాల స్టీలు రూ.80వేలకు పెరిగింది. ఉక్కు పరిశ్రమలకు ఆసే్ట్రలియా,ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా బొగ్గు ధరలు విపరీతంగా పెరగడంతో స్టీలు ధరలు పెంచేశారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక సిమెంట్‌ విషయానికి వస్తే 15 రోజుల వ్యవధిలో బస్తాపై రూ. 60 రూపాయల వరకు పెరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో లీడింగ్‌ కంపెనీ సిమెంట్‌ ధర బస్తా రూ.340 నుంచి 350ల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.400 నుంచి రూ.410లకు పెరిగింది. ఇతర రకాల సిమెంట్‌ ధరలు రూ. 300 నుంచి రూ. 360లకు పెరిగాయి. బొగ్గు, ఫ్యూయల్‌ ధరలు పెరిగిన కారణంగానే స్టీలు, సిమెంట్‌ ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.

  

చతికిల పడిన వ్యాపారం


స్టీలు టన్నుపై రూ.20వేలు, సిమెంటు బస్తాపై రూ. 60ల మేర పెరగడంతో వ్యాపారం ఒక్కసారిగా స్తంభించిపో యింది. జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలను ఎక్కడివక్కడే ఆపేశారు. ధరలు సాధారణ స్థితికి వచ్చినప్పుడు మొదలు పెట్టొచ్చనే నిర్ణయానికి వచ్చారు. ఉదాహరణకు నెల్లూరు నగరంలో రోజుకు సగటున 120 టన్నుల స్టీలు అమ్మకాలు జరుగుతాయి. ధరల పెరుగుదల కారణంగా ప్రస్తుతం రోజుకు 40 టన్నుల కంటే ఎక్కువ అమ్మకాలు జరగడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఎక్కువ మోతాదులో అవసరమైన వినియోగదారులు పూర్తిగా కొనుగోళ్లను ఆపేశారని, నిర్మాణాలను ఆపేశారని, తక్కువ మోతాదులో అవసరం ఉన్న వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. సిమెంట్‌ అమ్మకాలు కూడా 40 శాతం మేర తగ్గినట్లు చెబుతున్నారు. జిల్లాలో రోజుకు సగటున 25వేల టన్నుల సిమెంట్‌ కొనుగోళ్లు జరుగుతాయి. రోజు రోజుకు రేట్లు పెరుగుతున్న కారణంగా ఐదు, పది బస్తాలు అవసరం ఉన్న వారు తప్ప పెద్ద మోతాదులో అవసరం ఉన్న వినియోగదారులు పనులను వాయిదా వేసుకున్నారని అంటున్నారు. నిలకడ లేని ధరలతో ఏ రోజు ఏ రేటుకు అమ్మాల్సి వస్తుందోనని వ్యాపారులు  కరవరపాటుకు గురవుతున్నారు. ఉన్నపళంగా ధరలు తగ్గిపోతే ఉన్న స్టాక్‌పై ఆ ప్రభావం పడుతుందనే కలవరపాటు వారిలో వ్యక్తం అవుతోంది. మొత్తంపై ఉక్రెయిన యుద్ధం జిల్లాలో నిర్మాణ రంగాన్ని స్తంభింపజేసింది.   

Updated Date - 2022-03-09T04:50:55+05:30 IST