అక్కడే ఉంటా..!

ABN , First Publish Date - 2022-06-09T06:23:09+05:30 IST

ఆయన ప్రభుత్వ ఇంజనీరు. ప్రతి నెలా రూ.లక్ష వరకూ జీతం వస్తుంది. అయినా విధుల పట్ల చిత్తశుద్ధి చూపడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి

అక్కడే ఉంటా..!
కడప కార్పొరేషనకు బదిలీ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు

ఇక్కడ జీతం తీసుకుంటా

బదిలీపై వెళ్లని ఓ ఇంజనీరు

ఆరు నెలల క్రితమే ఉత్తర్వులు


అనంతపురం క్రైం, జూన 8: ఆయన ప్రభుత్వ ఇంజనీరు. ప్రతి నెలా రూ.లక్ష వరకూ జీతం వస్తుంది. అయినా విధుల పట్ల చిత్తశుద్ధి చూపడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన చోట పనిచేయకుండా.. మరో చోటుకు డెప్యుటేషనపై వెళ్లారు. అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. పోనీ.. అక్కడికైనా వెళ్లారా.. అంటే.. అదీ లేదు. డెప్యుటేషనకు వెళ్లిన చోటే పనిచేస్తూ.. ఎక్కడి నుంచో జీతం పుచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారం వెనుక ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారికి ఆయన రిలీవ్‌ ఫైల్‌ను పంపకుండా సిబ్బందిలో కొందరు తతంగాన్ని నడిపినట్లు తెలుస్తోంది. 


నగరపాలికలో..

అనంతపురం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ విభాగంలో ఆయన వ్యవహారం చర్చనీయాంశం అయింది. మూడేళ్ల క్రితం అనంతపురం నగరపాలక సంస్థకు ఆయన వచ్చారు. ఆరునెలల పాటు పనిచేసిన తరువాత కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి డెప్యుటేషన మీద వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబరు 22న అనంతపురం కార్పొరేషన నుంచి కడప నగరపాలక సంస్థకు ఆయన బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. 


నిబంధనలు వర్తించవా..?

ప్రభుత్వ అధికారులు బదిలీ ఉత్తర్వులు అందిన తరువాత 14 రోజుల్లోగా బదిలీ అయిన ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించాలి. కానీ ప్రొద్దుటూరుకు డెప్యుటేషనపై వెళ్లిన ఆ ఇంజనీరు ఇప్పటికీ కడప కార్పొరేషనకు వెళ్లలేదు. బదిలీ ఉత్తర్వులు రాగానే అనంతపురం నగరపాలక సంస్థ నుంచి ఆయన రిలీవ్‌ కావాలి. కానీ ఆ ఆలోచనే లేనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం కార్పొరేషన నుంచే వేతనం అందుకుంటున్నారు.  ఆయన ఇప్పటికే ఉద్యోగ విరమణ చేయాలి. కానీ ప్రభుత్వం రిటైర్మెంట్‌ వయసును రెండేళ్లు పెంచింది. దీంతో కొనసాగుతున్నారు. 


ధిక్కారమా..? ముడుపులా..?

రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలను ఆ ఇంజనీరు బేఖాతరు చేశారు. ఆరు నెలల క్రితమే బదిలీ ఉత్తర్వులు అందినా, ఇప్పటికీ రిలీవ్‌ కాలేదు. అనంతపురం నగరపాలక సంస్థ నుంచి ఆయనను రిలీవ్‌ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ విభాగం సిబ్బందిలో కొందరు ముడుపులు తీసుకుని సహకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రిలీవ్‌ ఫైల్‌ను కమిషనర్‌ వద్దకు పంపకుండా వారే తొక్కిపెడుతున్నారని సమాచారం. 

Updated Date - 2022-06-09T06:23:09+05:30 IST