గ్రంథాలయ చైర్మన్ల నియామకాలపై ‘స్టేటస్‌ కో’

ABN , First Publish Date - 2021-07-25T07:58:17+05:30 IST

రాష్ట్ర, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ల నియామకంపై హైకోర్టు యథాతథ స్థితి(స్టేటస్‌ కో)ని విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, విచారణను గురువారానికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌యు

గ్రంథాలయ చైర్మన్ల నియామకాలపై ‘స్టేటస్‌ కో’

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

గడువు ముగియక ముందే చైర్మన్ల తొలగింపుపై పిటిషన్‌

కొత్త చైర్మన్ల నియామకాలకు బ్రేక్‌ 

పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌కు నోటీసులు 

‘ధిక్కారం’పై అప్పుడే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’


అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ల నియామకంపై హైకోర్టు యథాతథ స్థితి(స్టేటస్‌ కో)ని విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, విచారణను గురువారానికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తమను జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లుగా, ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా విధులు నిర్వర్తించేందుకు అనుమతించడం లేదని పేర్కొంటూ ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ దాసరి రాజా మాస్టారుతో పాటు పలు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. తమ స్థానంలో కొత్తవారిని నియమించినట్లు ఓ పత్రిక ఈ నెల 18న కథనాన్ని ప్రచురించిందని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించకుండా నిలువరించాలని కోరారు. వీరి పిటిషన్లను విచారించిన హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పౌర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.


ఏం జరిగిందంటే!

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లోనే.. టీడీపీ హయాంలో నియమితులైన ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌తో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లను తొలగించారు. వెంటనే ఆయా సంస్థలకు పర్సన్‌ ఇన్‌చార్జులను నియమించారు. ఈ మేరకు 2019 సెప్టెంబరులో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ దాసరి రాజా మాష్టారు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు 10 మంది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన న్యాయస్థానం ఈ ఏడాది మే 4న, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ జీవోలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది. నామినేటెడ్‌ చైర్మన్లుగా పిటిషనర్లను పదవుల్లో కొనసాగనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినప్పటికీ.. ప్రభుత్వం ఈ నెల 17న ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల జాబితాలో రాష్ట్ర, జిల్లా గ్రంథాలయ సంస్థలకు కొత్త చైర్మన్ల పేర్లను పేర్కొంది. దీంతో ఇప్పటికే కొనసాగుతున్న చైర్మన్‌లు మరోసారి కోర్టును ఆశ్రయించారు. 


ముందే హెచ్చరించినా..

రాష్ట్ర, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ల నియామకం విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ‘ధిక్కారం’పై ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లోనే హెచ్చరించింది. ‘కోర్టు వద్దన్నా.. వేసేశారు’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. కోర్టు ఉత్తర్వులు కొనసాగుతున్నాయని.. అయినప్పటికీ ప్రభు త్వం చైర్మన్ల నియామకానికి సిద్ధమైందని, ఇది కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. కోర్టు తాజా ఉత్తర్వులతో కొత్త చైర్మన్ల నియామక ఉత్తర్వులకు బ్రేక్‌ పడనుంది.

Updated Date - 2021-07-25T07:58:17+05:30 IST