స్వరాజ్యంలో స్మృతివనం

ABN , First Publish Date - 2020-07-09T08:33:58+05:30 IST

‘బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయనను గౌరవిస్తూ ఎలాంటిచోట ఎలాంటి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని

స్వరాజ్యంలో స్మృతివనం

  • అంబేడ్కర్‌125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సీఎం జగన్‌ శంకుస్థాపన

అమరావతి, విజయవాడ, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయనను గౌరవిస్తూ ఎలాంటిచోట ఎలాంటి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన చేయగా.. విజయవాడ నడిబొడ్డున ఏడెకరాల స్థలం ఉందన్నారు. అక్కడ ఒక మంచి పార్కు వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ పార్కులో నలుగురూ కూర్చొని ఆహ్లాదంగా గడపొచ్చు. ఆ పార్కు అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడుతుంది’ అని సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ ‘విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌లాంటి గొప్పవ్యక్తి విగ్రహం ఉంటే ఆయన చేసిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.


రాష్ట్రంలో ఇదో చూడదగ్గ ప్రదేశంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని చెప్పారు. కాగా, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వర్చువల్‌గా శిలాఫలకాన్ని ఆవిష్కరించగా, స్వరాజ్య మైదానంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేకతోటి సుచరిత జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ చారిత్రాత్మక కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని కొనియాడారు. స్వరాజ్‌ మైదాన్‌ను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌గా మార్పు చేయడం శుభపరిణామమన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా అంబేడ్కర్‌ 125 అడుగుల కాంశ్య విగ్రహానికి స్వరాజ్‌ మైదాన్‌ వేదికగా నిలుస్తుందన్నారు. విగ్రహం ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, 2022 ఏప్రిల్‌ 14న సీఎం జగన్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కొడాలి నాని, ఆదిమూలపు సురేశ్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T08:33:58+05:30 IST