కళాకారుల కన్నీళ్లు..!

ABN , First Publish Date - 2020-10-24T08:55:31+05:30 IST

విగ్రహాల తయారీ కళాకారులు కన్నీళ్లు పెడుతున్నారు. ఉత్సవాల సమయంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే వారి ఆశలను కరోనా, వరదలు వమ్ము చేశాయి.

కళాకారుల కన్నీళ్లు..!

వర్షం మిగిల్చిన విషాదం

తడిసిపోయిన విగ్రహాలు

అమ్మకాలు లేక నష్టాలు

నాడు కరోనాతో గణేశ్‌ విగ్రహాలు

నేడు వరదల్లో అమ్మవారి విగ్రహాలు 


మంగళ్‌హాట్‌, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): విగ్రహాల తయారీ కళాకారులు కన్నీళ్లు పెడుతున్నారు. ఉత్సవాల సమయంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే వారి ఆశలను కరోనా, వరదలు వమ్ము చేశాయి. వ్యాపారం లేక, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక తీవ్ర నష్టాలతో సాయం కోసం వేచిచూస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా గణేశ్‌, నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహాల తయారీకి ధూల్‌పేట కళాకారులు పెట్టింది పేరు. ఈ ఏడాది వీరిపై కోలుకోలేని దెబ్బ పడింది. 

దసరా పండగ సందర్భంగా నిర్వహించే దేవీ నవర్రాతి ఉత్సవాల్లో గ్రేటర్‌ పరిధితో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ధూల్‌పేట నుంచి పెద్ద ఎత్తున దుర్గామాత విగ్రహాలు తరలివెళ్తుంటాయి. ఈ విగ్రహాలను తయారు చేసేందుకు ధూల్‌పేట్‌ కళాకారులతోపాటు బెంగాల్‌ నుంచి ప్రత్యేకంగా కళాకారులను రప్పించి, అద్భుతంగా తీర్చిదిద్దుతారు. దీంతో ధూల్‌పేట విగ్రహాలు యేటా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయేవి. అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా లాక్‌డౌన్‌ రావడంతో గణేష్‌ విగ్రహాల అమ్మకాలపై ప్రభావం పడింది. గణేష్‌ ఉత్సవాల సమయంలోనే ఇక్కడి కళాకారులు సుమారు రూ. కోట్లు నష్టపోయారు. 


వర్షం దెబ్బ

నవరాత్రి ఉత్సవాల కోసం ధూల్‌పేట కళాకారులు అమ్మవారి విగ్రహాలు పెద్ద ఎత్తున తయారు చేసి ఉంచారు. అయితే, పండగ సమయంలో భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వరదలు ముంచెత్తాయి. మరోపక్క కొవిడ్‌ నిబంధనలూ అ మలులో ఉన్నాయి. వర్షాల కారణంగా విగ్రహాలను ధూల్‌పేట మార్కెట్‌ ప్రాంతానికి తీసుకువచ్చేందుకు వీలు లేకుండా వర్షం పడటంతో వందలాది విగ్రహాలు తడిసి పోయాయి. ఓ ప్రముఖ కళాకారుడు మొత్తం 400 విగ్రహాలను తయారు చేస్తే, కేవలం 40 విగ్రహాలు మాత్రమే అమ్ముడు పోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా దాదాపు రూ. 3 కోట్ల మేరకు జరిగే వ్యాపారం ఈసారి లక్షల్లో కూడా జరగలేదని, దీంతో సంవత్సరంపాటు పనిచేసిన బెంగాల్‌ కళాకారులకు వేతనం చెల్లించే పరిస్థితిలో కూడా లేదని ధూల్‌పేట్‌వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల ముందు పెట్టిన భారీ విగ్రహాలు పూర్తిగా వర్షపు నీటికి తడిసిపోయి పనికిరాకుండా పోయాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 


అప్పు చేసి పెట్టుబడి పెట్టా.. 

బెంగాల్‌ నుంచి కళాకారులను రప్పించి సంవత్సరం పాటు కష్టపడి 400 అమ్మవారి విగ్రహాలు తయారు చేస్తే, వర్షం కారణంగా  40 విగ్రహాలు కూడా అమ్ముడు పోలేదు. రూ. లక్షలు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాను. చివరకు నష్టాలే మిగిలాయి. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ధూల్‌పేట్‌ కళాకారులను ఆదుకోవాలి. 

సుందర్‌, ధూల్‌పేట్‌

Updated Date - 2020-10-24T08:55:31+05:30 IST