స్టేషన్‌ బెయిల్‌ కోసం లంచం డిమాండ్‌

ABN , First Publish Date - 2022-08-19T06:11:33+05:30 IST

ఇరువర్గాల మధ్య జరిగిన ఓ గొడవలో స్టేషన్‌ బెయిల్‌ కోసం నిందితుడి వద్ద ఆరు వేల రూపాయల లంచం తీసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు గురువారం చిక్కాడు.

స్టేషన్‌ బెయిల్‌ కోసం లంచం డిమాండ్‌
హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుంటున్న ఏసీబీ అధికారులు

- రూ. 6,000 తీసుకుంటూ పట్టుబడ్డ హెడ్‌కానిస్టేబుల్‌

వేములవాడ, ఆగస్టు 18: ఇరువర్గాల మధ్య జరిగిన ఓ గొడవలో స్టేషన్‌ బెయిల్‌ కోసం నిందితుడి వద్ద ఆరు వేల రూపాయల లంచం తీసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు గురువారం చిక్కాడు. వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ ఆలయం సమీపంలో చికెన్‌ సెంటర్‌ నిర్వహించే వేముల భరత్‌ అనే యువకుడికి ఈ నెల 8వ తేదీన పొరుగునే ఉన్న మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఈ ఘటనపై ఇరువర్గాల పరస్పర ఫిర్యాదు మేరకు వేములవాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులోని నిందితులలో ఒకరైన వేముల భరత్‌కు కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ ఈ నెల 9వ తేదీన సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసు ఇస్తూ స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించినందున పదివేల రూపాయలు ఇవ్వాలంటూ భరత్‌ను చంద్రప్రకాశ్‌ ఒత్తిడి చేయడంతో ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి భరత్‌ ఒప్పుకున్నాడు. అనంతరం భరత్‌ ఈ విషయంపై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఓ పండ్ల దుకాణంలో భరత్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌కు ఆరు వేల రూపాయలను అందజేశాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలోని అధికారుల బృందం వెంటనే హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని సదరు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించి లంచం తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించినందుకు ఆరు వేల రూపాయల లంచం తీసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రప్రకాశ్‌ను అదుపులోకి తీసుని ఆరు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు. ఏసీబీ సీఐలు రాము, రవీందర్‌, తిరుపతి, జాన్‌రెడ్డి, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T06:11:33+05:30 IST