రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వ్యాక్సిన్‌ దీక్షలు

ABN , First Publish Date - 2021-05-09T09:10:30+05:30 IST

తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ దీక్షలు చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సత్వరం వ్యాక్సిన్‌ సమకూర్చాలని కోరుతూ తమ ఇళ్లు, కార్యాలయాల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ దీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వ్యాక్సిన్‌ దీక్షలు

ఇళ్లలో, కార్యాలయాల్లో దీక్షలు చేసిన ‘దేశం’ నేతలు


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ దీక్షలు చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సత్వరం వ్యాక్సిన్‌ సమకూర్చాలని కోరుతూ తమ ఇళ్లు, కార్యాలయాల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ దీక్షలు నిర్వహించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఈ దీక్షలు జరిగాయి. ఈ దీక్షల్లో పాల్గొన్న వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు తదితరులు ఉన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు తమ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల వారు మాట్లాడారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్‌ను సమకూర్చుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేంద్రంపై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు కోటికి పైగా డోసులకు ఆర్డర్‌ ఇస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం 13 లక్షల డోసులకు ఆర్డర్‌ ఇచ్చిందని, ఇంత తక్కువ డోసులు తెప్పించి ఎవరికి ఇస్తారని వారు ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపులకు ఇచ్చే ప్రాధాన్యాన్ని ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఇవ్వడం లేదని, వ్యాక్సిన్‌ వల్ల మాత్రమే ప్రజల ప్రాణాలు కాపాడటం వీలవుతుందని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘‘మొత్తం ప్రభుత్వ శాఖలన్నింటిని టీడీపీ నేతలపై కేసులు పెట్టడానికి వాడుతున్నారు. ప్రతి రోజూ ముఖ్యమంత్రి సమయం అంతా ఎవరిపై ఏ కేసు పెట్టాలన్నదానిపై చర్చకు సరిపోతోంది. పడకలు సరిపోక... వైద్యం అందక... ఆక్సిజన్‌ అందక సామాన్య ప్రజలు ఘోరమైన పరిస్థితులను చవి చూస్తున్నా ముఖ్యమంత్రికి అవి పట్టడం లేదు. ప్రజల ప్రాణాలు కాపడటానికి ఏ శ్రద్ధా చూపడం లేదు’ అని వారు విమర్శించారు.  

Updated Date - 2021-05-09T09:10:30+05:30 IST