ఆక్వా రైతులకు షాక్‌!

ABN , First Publish Date - 2022-05-03T05:57:20+05:30 IST

ఆక్వా రైతులకు షాక్‌!

ఆక్వా రైతులకు షాక్‌!
రొయ్యల చెరువులో విద్యుత్‌తో నడిచే ఏరియేటర్లు

మత్స్య పరిశ్రమపై విద్యుత్‌ బిల్లుల పిడుగు

ఐదెకరాల వరకే సబ్సిడీ వర్తింపు

‘ఏపీ సడా’ యాక్ట్‌లో నమోదైతేనే అమలు

3 నెలల పంటపై 18 వేల అదనపు భారం

ఇప్పటికే కోతలతో డీజిల్‌కు రూ.20 వేల ఖర్చు

విదేశీ మారకద్రవ్యం ఆర్జించే రైతన్నలపై జగనన్న సర్కారు కొరడా


గుడివాడ, మే 2 : గత ప్రభుత్వం ఆక్వా చెరువుల కనెక్షన్లకు విద్యుత్‌ బిల్లులో రాయితీ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం సాగుదారులను చాలావరకు ఒడ్డున పడేస్తే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నిండా ముంచేస్తోంది. ఆక్వా చెరువుల సాగుదారులకు ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్‌ రాయితీలో కోత విధించి షాక్‌ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా కల్చర్‌ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సడా) కింద నమోదు చేసుకున్న చెరువులకే.. అది కూడా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకే విద్యుత్‌ రాయితీ దక్కుతుందని జీవో విడుదలైంది. మే నెలలోనే నూతన విద్యుత్‌ సబ్సిడీ పథకం అమల్లోకి రానుంది. అసలే ఉత్పత్తులకు ధరలు పడిపోయి, విద్యుత్‌ కోతలతో అల్లాడుతున్న ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వారిని తిరోగమన పథంలోకి నెడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏపీ సడా యాక్ట్‌లో నమోదుకు ప్రతిబంధకాలెన్నో..

ఒక్క కృష్ణాజిల్లాలో 85 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. రిజిస్టర్‌ చేసుకోవడానికి ఏప్రిల్‌తో గడువు పూర్తికాగా, ప్రస్తుతానికి జిల్లావ్యాప్తంగా కేవలం 6,326 ఎకరాల సాగుదారులు మాత్రమే రిజిస్టర్‌ చేసుకోవడం గమనార్హం. ఆక్వా రంగంలో నూటికి తొంభై శాతం మంది రైతులు కౌలుదారులే ఉంటారు. కౌలు తీసుకున్న రైతులు రిజిస్టర్‌ చేసుకున్న ఒప్పంద పత్రం తీసుకొస్తే విద్యుత్‌ రాయితీకి పేర్లు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ బిల్లులో రాయితీ పొందాలంటే ఏపీ సడా యాక్ట్‌ కింద రిజిస్టర్‌ కావాలనే నిబంధన తప్పనిసరి చేయడంతో మే నెల నుంచి విద్యుత్‌ రాయితీ ఏ మేరకు అందుతుందో అంతుపట్టడం లేదు. విద్యుత్‌ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 8,002 ఆక్వా విద్యుత్‌ కనెక్షన్లకు రాయితీ ఇస్తున్నారు.  

90 శాతం రైతులకు సబ్సిడీ అందని ద్రాక్షే

ఏపీ సడా యాక్ట్‌ కింద నమోదైన చెరువులకే విద్యుత్‌ సబ్సిడీ ఇస్తే ఒక్క కృష్ణాజిల్లాలోనే 90 శాతం మంది రైతులు దాని ప్రతిఫలం పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాయితీపై యూనిట్‌ రూ.1.50కు సరఫరా చేస్తున్నారు. ఆక్వాజోన్‌ పరిధిలో లేని చెరువులకు యూనిట్‌ ధర రూ.3.85 పడు తుంది. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో సాగు చేసినా రాయితీ విద్యుత్‌ ఇస్తున్నారు. ఇక నుంచి ఒక రైతుకు గరిష్ఠంగా ఐదు ఎకరాలకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది.  ఏ రైతు పేరిట ఎంత విస్తీర్ణం చెరువులు నమోదయ్యాయో మత్స్యశాఖ సర్వే చేసి విద్యుత్‌ శాఖకు అందజేస్తుంది.

ఎకరాకు రూ.18వేలు అదనపు భారం 

రొయ్యల చెరువులో ఆక్సిజన్‌ శాతం తగ్గకుండా ఉంచడానికి నిరంతరాయంగా ఏరియేటర్లు ఆడించాల్సి ఉంటుంది. విద్యుత్‌ రాయితీని ఐదు ఎకరాలకే పరిమితం చేయడంతో యూనిట్‌ రూ.3.85 చెల్లించి సాగు చేయా లంటే తలకుమించిన భారమవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్‌ రాయితీని అనుసరించి ఎకరా చెరువుకు వినియోగం ఆధారంగా రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేల వరకు నెలకు విద్యుత్‌ బిల్లు వస్తోంది. రాయితీ లేకపోతే ఎకరాకు విద్యుత్‌ బిల్లు రెండు రెట్లు పెరిగి రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల వరకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మూడున్నర నెలల రొయ్యల సాగు కాలంలో విద్యుత్‌ బిల్లుల రూపేణ ఎకరాకు రూ.18 వేల వరకు రైతులపై అదనపు భారం పడుతుంది. ఐదు ఎకరాలు సాగుచేసే రైతు కేవలం విద్యుత్‌ బిల్లుకే నెలనెలా రూ.50 వేలు చెల్లించాల్సి వస్తుంది. రాష్ట్రానికి విదేశీ మారకద్రవ్యం ఆర్జించే మత్స్య పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహించాల్సింది పోయి తిరోగమనంలోకి తీసుకెళ్లడంపై రైతులు మండిపడుతున్నారు. మేత, రసాయనాలకు ఇప్పటికే పెట్టుబడి 30 శాతం పెరిగిపోయిందని వాపోతున్నారు. విద్యుత్‌ కోతలతో ఏరియేటర్లు తిప్పడానికి డీజిల్‌ ఖర్చులకు నెలకు రూ.20 వేలు ఖర్చవుతోందని ఆవేదన చెందుతున్నారు. విద్యుత్‌ సబ్సిడీ కత్తిరిస్తే నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని రొయ్యల సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. షరతులు లేకుండా అన్ని రకాల చెరువులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. 



Read more