టీచర్ల పదోన్నతులు, బదిలీలకు కసరత్తు.. ముందుగా మోడల్‌ స్కూళ్లలో..!

ABN , First Publish Date - 2022-05-18T17:16:33+05:30 IST

రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ముందుగా మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల...

టీచర్ల పదోన్నతులు, బదిలీలకు కసరత్తు.. ముందుగా మోడల్‌ స్కూళ్లలో..!

న్యాయపరమైన అవరోధాలపై దృష్టి పెట్టాం

న్యాయ సలహాలు తీసుకుంటాం: మంత్రి సబిత


హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(State Education Minister Sabita Indrareddy) ప్రకటించారు. ఇందులో భాగంగా ముందుగా మోడల్‌ స్కూళ్లు( Model schools), కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపడతామని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  టీచర్ల బదిలీ(Transfer of teachers)లపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, వివిధ సంఘాల ప్రతినిధులతోనూ పలుసార్లు చర్చించామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి న్యాయపరమైన అవరోధాలను పరిగణనలోకి తీసుకుని, న్యాయ శాఖ ఇచ్చే సలహాలను పాటిస్తూ ముందుకువెళతామని చెప్పారు. కాగా, తెలుగు అకాడమీ ముద్రించిన పోటీ పరీక్షలకు అవసరమైన 42 రకాల పుస్తకాలను మంత్రి సబిత ఆవిష్కరించారు. ఈ పుస్తకాలను అనుభవజ్ఞులైన నిపుణులతో రూపొందించామని చెప్పారు. బుధవారం నుంచి ఈ పుస్తకాలు అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రంథాలయాల పనితీరుపై మంగళవారం తన కార్యాలయంలో సబిత సమీక్షించారు. పోటీ పరీక్షలకు సమాయత్తం అవుతున్న నిరుద్యోగులకు అండగా గ్రంథాలయాలు ఉండాలని ఆమె సూచించారు. పోటీ పరీక్షలు పూర్తయ్యేవరకు రాష్ట్రంలోని గ్రంథాలయాలన్నీ ప్రతిరోజు పనిచేయాలని చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు.


జూన్‌లో ‘మోడల్‌’ టీచర్ల బదిలీలు: పీఆర్టీయూ

మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను జూన్‌లో చేపట్టడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ప్రొగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, తదితరులతో రఘోత్తంరెడ్డి మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఉపాధ్యాయుల బదిలీలను, పదోన్నతులను వెంటనే చేపట్టాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.  


ఇంటర్‌ పరీక్షల్లో 15 మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు

రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఇంటర్‌ పరీక్షల్లో మొత్తం 15 మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో వికారాబాద్‌ జిల్లాలో 6, ఖమ్మం జిల్లాలో 7, సిద్దిపేట, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో భాగంగా మంగళవారం ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలో పరీక్షల విధు లు, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది పారితోషకాన్ని పెంచినందుకు మంత్రి సబితకు ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-05-18T17:16:33+05:30 IST