రాజ్యమేలుతున్న విద్వేషం

ABN , First Publish Date - 2022-04-16T08:23:41+05:30 IST

హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలు కర్ణాటకను కుదేలుపరుస్తున్నాయి. ఒక పథకం ప్రకారం ఆ వివాదాలను సృష్టించి కన్నడ ప్రజల్లో మత విభేదాలను రెచ్చగొడుతున్నారు...

రాజ్యమేలుతున్న విద్వేషం

హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలు కర్ణాటకను కుదేలుపరుస్తున్నాయి. ఒక పథకం ప్రకారం ఆ వివాదాలను సృష్టించి కన్నడ ప్రజల్లో మత విభేదాలను రెచ్చగొడుతున్నారు. 2023లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి కదా.


ముస్లిం మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తమ తల, మెడను ఏదైనా వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. దీన్నే హిజాబ్ అంటారు. ఉత్తర భారతావనిలో హిందూ స్త్రీలు, సిఖ్ మహిళలు, క్రైస్తవ సన్యాసినులు, (సిఖ్‌ పురుషులతో సహా) ఇతరులు కూడా తమ తలను వస్త్రంతో కప్పి వేసుకుంటారు. పశువుల, కోళ్ల, ఇతర పక్షుల మాంసం హలాల్. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఈ మాంసం కోసం జంతువుల కంఠ సిరలు, శ్వాసనాళాలను కోసివేస్తారు. రక్తాన్ని పూర్తిగా పిండివేస్తారు. ఆహార తయారీలో ఇతర మతాల వారు కూడా నిర్దిష్ట నియమాలను అనుసరిస్తారు. హిందూ మతంలోని వివిధ వర్గాల వారూ ఇందుకు మినహాయింపు కాదు. అల్లాను ప్రార్థించేందుకు పిలుపే ఆజాన్. మస్జీదుల నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా రోజుకు ఐదుసార్లు ఈ పిలుపునిస్తారు. హిందూ, క్రైస్తవ ఆరాధనా మందిరాలలో గంటలు మోగించడం ఆనవాయితీ. హిందూ మత వేడుకలలో సాధారణంగా మత గ్రంథాలను పఠిస్తారు లేదా భక్తి గీతాలను ఆలాపిస్తారు. ఈ పఠనాలు, ఆలాపనలను లౌడ్ స్పీకర్ల ద్వారా దూర ప్రదేశాలకూ విన్పించేలా చేస్తారు.


హిజాబ్, హలాల్, ఆజాన్ కొత్త ఆచరణలు ఏమీ కావు. భారత్‌లోకి ఇస్లాం ప్రవేశించిన నాటి నుంచీ అవి ముస్లింల జీవన శైలిలో అంతర్భాగంగా ఉన్నాయి. (పాత మైసూరు సంస్థాన జనులతో సహా) కర్ణాటక ప్రజలు శతాబ్దాలుగా ఆ ఆచారాలను పాటిస్తున్నారు. ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ముస్లింలు ఎవ్వరూ హిందూ మతాచారాల పట్ల ఎటువంటి ఆక్షేపణ తెలుపలేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంకా ఇతర మతాల వారు పరస్పరం శాంతియుతంగా సహజీనవం చేస్తూ వస్తున్నారు.


కర్ణాటక పాలనా వ్యవహారాలలో భారతీయ జనతా పార్టీ ప్రవేశించేంతవరకు మత సామరస్యం వర్థిల్లింది. ఈ పార్టీ కొన్నిసార్లు సంకీర్ణ భాగస్వామిగాను లేదా సొంతంగానూ పరిపాలించింది. ఇటీవలి సంవత్సరాలలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి వారు పార్టీ మారేలా చేయడం ద్వారా పాలిస్తోంది. ఈ ప్రయత్నాలు ఆపరేషన్ లోటస్‌గా సుప్రసిద్ధమయ్యాయి. 2023లో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ పార్టీ ప్రభుత్వాలు సమర్థ పాలననందించినవి కావు. కర్ణాటకలో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి దుర్బలంగా ఉంది. ప్రతిపక్షాలు తమను తాము ఆపరేషన్ లోటస్ నుంచి సమర్థంగా కాపాడుకుంటున్నాయి. దీంతో ఓటర్లలో చీలికలు సృష్టించేందుకు, అధిక సంఖ్యాకులైన హిందువులను ఆకట్టుకునేందుకు ఒక భిన్నవ్యూహాన్ని అనుసరించాల్సిన అగత్యం బీజేపీకి ఏర్పడింది. ఆయా రాష్ట్రాల రాజకీయాలకు అనుగుణమైన వ్యూహాన్ని రూపొందించగల నేర్పు బీజేపీకి అపారంగా ఉంది. ఆహారం, వస్త్రధారణ, ప్రార్థనా సంప్రదాయాలపై వివాదాలను సృష్టించడం ఆ వ్యూహంలో భాగమే.


కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది. ప్రభుత్వాదేశాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు. కర్ణాటక హైకోర్టు ఈ వివాదంపై విచారణలో భాగంగా ఒక ప్రశ్న వేసింది: ‘హిజాబ్‌ను ధరించడం ఆవశ్యక ఇస్లామిక్ మతాచరణా?’ కాదు అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అసలు ఈ ప్రశ్న అసంగతమైనది. హిజాబ్‌ను నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అనేది సబబైన, ఉపయుక్తమైన ప్రశ్న. హిజాబ్‌ను నిషేధించడం ముస్లిం విద్యార్థినుల గోప్యతా హక్కు, విద్యాహక్కును ఉల్లంఘించడం కాదా? ఈ వాదనతో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. హిజాబ్ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానంలో సముచితమైన, సహేతుకమైన పరిష్కారం లభించగలదని ఆశిద్దాం.


ఇటువంటి వివాదాలు విద్వేష ప్రసంగాలకు తావిస్తున్నాయి. ఈ విద్వేష ప్రసంగాలు చేస్తున్న మతోన్మాదులు ఉభయ మతాలలోనూ ఉన్నారు. అయితే చాలా సందర్భాలలో ద్వేషపూరిత వ్యాఖ్యలతో తొలుత రెచ్చగొట్టిన వారు హిందూ మత దురభిమానులేనని నిర్ధారణ అయింది. చరిత్రకారుడు రామచంద్ర గుహ. పారిశ్రామికవేత్త శ్రీమతి కిరణ్ మజుందార్ షా ఆ విద్వేష ప్రసంగాల పట్ల తీవ్ర ఆక్షేపణ తెలిపారు. సహజంగానే మతోన్మాదులు ఆ ఇరువురిపై తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.


కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో విద్వేష ప్రసంగాలు అన్ని హద్దులూ మీరాయి. ఇటువంటి ప్రసంగాలు పదే పదే చేసే వారిలో అగ్రగణ్యుడు నరసింగానంద్ (దస్నాదేవి ఆలయ పూజారి) ఒకరు. గత ఏడాది హరిద్వార్‌లో ఒక హిందూ మత కార్యక్రమంలో ముస్లిం మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కొన్ని వారాల తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ నెల 3న ఢిల్లీలో ‘ హిందూ మహాపంచాయత్’ పేరిట జరిగిన ఒక సభలో అతడు ప్రసంగించాడు. ‘మీ అక్క చెల్లెళ్లు, కుమార్తెలను కాపాడుకునేందుకు ఆయుధాలు చేపట్టండి’ అని పిలుపునిచ్చాడు! 2029 లేదా 2034 లేదా 2039లో భారత్‌కు ఒక ముస్లిం నేత ప్రధానమంత్రి అవుతాడని, కనుక మిమ్ములను మీరు రక్షించుకునేందుకు ముందుగా మేల్కోవాలని అతడన్నాడు. పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్ట్ చేయలేదు. బెయిల్ రద్దుకై కోర్టుకు వెళ్లలేదు. 


మహంత్ బజ్‌రంగ్ మునిది మరొక భయానక ఉదాహరణ. తనను తాను మతనాయకుడుగా ప్రకటించుకున్న ఈ మహంత్ ఇటీవల ఒక సభలో హిందీలో ప్రసంగిస్తూ ఈ క్రింది వ్యాఖ్యలు చేశాడు: ‘మీ మతానికి చెందిన వారెవరైనా తమ ప్రాంతంలోని ఏ యువతినైనా వేధింపులకు గురి చేస్తే, నేను మీ ఇంటి నుంచి మీ కుమార్తెలను అపహరించి అత్యాచారం చేస్తాను’. ఏ మతస్థుల నుద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మహంత్‌ను అరెస్ట్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. పదకొండు రోజుల అనంతరం అతన్ని అరెస్ట్ చేశారు.


ధర్మబద్ధతకు ప్రతీక, మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రుని పుట్టిన రోజు కూడా హింసాత్మక చర్యలు చోటుచేసుకున్నాయి. అసహనం వెల్లువెత్తింది. విద్వేష ప్రసంగాలు హోరెత్తాయి. వీటిని ఎవరో కొంత మంది మత దురభిమానుల ఉన్మాద పూరిత కార్యకలాపాలు, అసంబద్ధ ప్రలాపాలుగా కొట్టివేయలేము. వాటికి బీజేపీ, ఆరెస్సెస్ మద్దతు ఉంది. హిందీ భాషా రాష్ట్రాలలోని హిందూ ఓటర్ల మద్దతును మరింతగా కూడగట్టుకునేందుకు హిందూత్వ శక్తులు కృతనిశ్చయంతో ఉన్నాయి.


‘ఫారిన్ ఎఫైర్స్’ అనే ప్రభావశీల పత్రికలో హర్తోష్‌సింగ్ బల్ ఇలా వ్యాఖ్యానించాడు: ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చెప్పే హిందూ ధర్మంతో 40 కోట్ల మందికి పైగా ప్రజలు ఏకీభవించరు. ఆ రీతి హిందూ ధర్మాన్ని ఆచరించరు. అయినప్పటికీ యావత్ హిందూ జనాభాను అంతిమంగా ఏకరీతిలో రూపొందించే పథకంలో వారినీ భాగస్వాములను చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేసమయంలో భారతీయ ముస్లింలు, క్రైస్తవులను ద్వితీయశ్రేణి పౌరులుగా తగ్గించివేస్తున్నారు’. అసహనం పెరిగిపోతోంది. అయినా దేశ పాలకులు ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తున్నారు. ఈ మౌనం కేవలం పరిపాలనాపరమైన లోపం కానేకాదు.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-04-16T08:23:41+05:30 IST