ఏడాదిలో 5 కోట్ల డోసులు

ABN , First Publish Date - 2022-01-17T08:36:45+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా కార్యక్రమం మరో మైలురాయికి చేరుకుంది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమై జనవరి 15కు ఏడాది పూర్తి అయింది. ఈ ఏడాది కాలంలో మొత్తం 5

ఏడాదిలో 5 కోట్ల డోసులు

రాష్ట్ర టీకా కార్యక్రమంలో మరో మైలురాయి


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ టీకా కార్యక్రమం మరో మైలురాయికి చేరుకుంది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమై జనవరి 15కు ఏడాది పూర్తి అయింది. ఈ ఏడాది కాలంలో మొత్తం 5 కోట్ల డోసులను వైద్య ఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. 2021 జనవరి 16న టీకా కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ.. తొలినాళ్లలో టీకా తీసుకునేందుకు చాలామంది ముందుకు రాలేదు. కానీ, 2021 మార్చి చివరి వారం నుంచి కేసులు పెరగడం మొదలై రెండో వేవ్‌ ఉధృతంగా రావడంతో ప్రజలంతా వ్యాక్సిన్‌ కోసం ఎగబడ్డారు. దీంతో టీకా కార్యక్రమం జోరందుకుంది.  గణాంకాల్లో చెప్పాలంటే.. మన రాష్ట్రంలో తొలి కోటి డోసుల టీకాలు ఇవ్వడానికి పట్టిన సమయం అక్షరాలా నూట అరవైఐదు రోజులు. నిరుడు జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్‌.. జూన్‌ 25న కోటి మైలురాయిని చేరుకుంది.


కానీ, చివరి మూడు కోట్ల డోసులను కేవలం 100 రోజుల్లో  వేశారు. రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు దాటినవారిలో 100ు మంది మొదటి డోసు తీసుకున్నారు. రెండు డోసులూ తీసుకున్నవారు 75ు మంది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-17 మధ్య వయస్కులకు కేంద్రం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ వయసు గ్రూపువారు రాష్ట్రంలో 18 లక్షల మంది ఉండగా, అందులో ఇప్పటివరకు 49 శాతం మంది ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అదే రోజు నుంచి ప్రీకాషనరీ డోసు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 12.88 లక్షల మంది తీసుకున్నారు. ఇక.. సూపర్‌ స్ర్పెడర్స్‌ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా టీకా కార్యక్రమాన్ని నిర్వహించింది.  కాగా.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలై ఏడాది విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్య సిబ్బందిని అభినందించారు. వైద్య సిబ్బంది అంకితభావంతో పాటు ప్రజల స్పూర్తితోనే ఇది సాధ్యమైందన్నారు.  


అంకెల్లో..

2.77 కోట్లు

రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు దాటినవారి సంఖ్య. వీరికి 2 డోసులూ కలిపి 5.54 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి 5 కోట్ల డోసులు పూర్తయ్యాయి. 


3500

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ టీకా కేంద్రాలు

264

రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న టీకా కేంద్రాలు

10,000

దాదాపు పది వేల మంది సిబ్బంది టీకాలు వేస్తున్నారు. మొత్తంగా టీకా కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది 35 వేలు దాకా ఉంటుంది.

Updated Date - 2022-01-17T08:36:45+05:30 IST