బాలకార్మికుల కేసుల్లో రాష్ట్రం టాప్‌

ABN , First Publish Date - 2020-10-02T08:12:07+05:30 IST

బాలకార్మికుల కేసుల్లో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నట్లు జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక

బాలకార్మికుల కేసుల్లో రాష్ట్రం టాప్‌

తెలంగాణలో 314 కేసులు.. 459 మందికి విముక్తి

2,011 మంది బాలికలపై లైంగిక వేధింపులు

చీటింగ్‌ కేసుల్లో మూడోస్థానం

80% కల్తీ కేసులు ఏపీ, తెలంగాణల్లో

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి


హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): బాలకార్మికుల కేసుల్లో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నట్లు జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించింది. 2019లో దేశవ్యాప్తంగా బాలకార్మిక నిరోధక చట్టం-1986 కింద 770 కేసులు నమోదు కాగా, అందులో ఒక్క తెలంగాణ వాటానే 314 కావడం గమనార్హం. రాష్ట్రంలో 459 మందికి బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించారు. ఈ కేసుల్లో తెలంగాణ తర్వాతి స్థానాల్లో 83 కేసులతో కర్ణాటక, 68 కేసులతో అసోం, 64 కేసులతో గుజరాత్‌ ఉన్నాయి.


‘క్రైమ్‌ ఇన్‌ ఇండియా-2019’ నివేదికను ఎన్‌సీఆర్‌బీ బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో బాలల సంబంధిత కేసులు 2,560 నమోదయ్యాయి. మొత్తం 2,787 మంది బాధితులున్నారు.  2019లో 35 బాల్యవివాహాలను అడ్డుకుని, కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో 21 బాలకార్మిక కేసులు నమోదయ్యాయి.


2,011 మంది బాలికలపై  లైంగిక వేధింపులు

రాష్ట్రంలో బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. 2,011 బాలికలు వేధింపులకు గురయ్యారు. ఫొక్సో చట్టం కింద 1,998 కేసులను పోలీసులు నమోదు చేశారు. వరకట్న నిరోధక చట్టం కింద గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 472 కేసులు నమోదైతే.. తెలంగాణలో కేవలం 6 కేసులు నమోదుచేసినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. అసహజ లైంగిక వేధింపులకు సంబంధించి 10 కేసులు నమోదయ్యాయి.


పెళ్లిచేసుకోవాలంటూ యువతులను కిడ్నాప్‌ చేసిన ఘటనలు 393 జరిగాయి. రోడ్ల మీద, కార్యాలయాల్లో, సోషల్‌మీడియా ద్వారా ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను వేధించడం తెలంగాణలో పెరిగిందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. మహారాష్ట్ర 2,161 స్టాకింగ్‌ కేసులతో మొదటిస్థానంలో ఉంటే.. 1,204 కేసులతో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. కాగా, రాష్ట్రంలో.. పనిప్రదేశాల్లో 24 మంది, బస్సులు, రైళ్లలో 14 మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు.


గత ఏడాది ఇంటర్‌నెట్‌ ద్వారా 4,208 మంది మహిళలు వేధింపులకు గురైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. అత్యధికంగా 3,823 వరకట్న కేసులతో ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉండగా.. 3,289 కేసులతో బిహార్‌ రెండో స్థానంలో ఉంది. పొరుగురాష్ట్రం కర్ణాటకలో 1,745 వరకట్న కేసులు నమోదయ్యాయి. ట్రెస్‌పాస్‌ కేసుల విషయంలో ఉత్తరప్రదేశ్‌(6,604) తర్వాత తెలంగాణ(5,559) ఉంది.


తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినందుకు తెలంగాణలో 47 కేసులు నమోదు చేసి 60 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో 419 ఇళ్లను గుర్తుతెలియని వ్యక్తులు కాలబెట్టారు. గత ఏడాది 67 మతపరమైన కేసులను పోలీసులు నమోదుచేశారు. 


కల్తీ.. చీటింగ్‌ కేసుల్లో. 

ఏపీ, తెలంగాణల్లో కల్తీ పాలు, కల్తీ ఆహారపదార్థాలపై ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. దేశంలోనే 1,490 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంగా ఉండగా.. 1,186 కేసులతో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. కల్తీపై దేశవ్యాప్తంగా 2,959 కేసులు నమోదైతే.. అందులో 80 శాతానికిపైగా వాటా తెలుగు రాష్ట్రాలవే ఉన్నాయి. చీటింగ్‌ కేసుల నమోదులో తెలంగాణ(9,233) మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా రాజస్థాన్‌లో 17,160, మహారాష్ట్రలో 10,236 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి.


చిన్న కారణాలకే హత్య!

గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 839 హత్యలు జరిగాయి. వాటిలో 386 హత్యలకు వివాదాలే కారణం. భూవివాదాల వల్ల 73 మంది, కుటుంబ వివాదాలతో 186 మంది, చిన్న కారణాలతో 104 మంది, ఆర్థిక వివాదాలతో 21 మంది, వివాహేతర సంబంధాల వల్ల 36 మంది, వరకట్న వేధింపుల్లో భాగంగా 49 మంది హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో 26 మంది ఆరేళ్లల్లోపు చిన్నారులు దారుణంగా హత్యకు గురయ్యారు. గత ఏడాది వైద్యుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 19 మంది మరణించారు.


Updated Date - 2020-10-02T08:12:07+05:30 IST