జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా?

ABN , First Publish Date - 2021-06-20T08:40:38+05:30 IST

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంతోపాటు, ఇతర కీలకమైన అంశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో,

జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా?

24న ప్రధాని నివాసంలో అఖిలపక్ష భేటీ

కశ్మీర్‌ నుంచి 14 మందికి ఆహ్వానాలు

ఆహ్వానితుల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు

నేడు పీడీపీ నేతలతో ముఫ్తీ సమావేశం

పార్టీ నేతలతో చర్చించనున్న ఫరూక్‌


న్యూఢిల్లీ, జూన్‌ 19: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విషయంతోపాటు, ఇతర కీలకమైన అంశాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారన్న వార్తల నేపథ్యంలో, ఆ ఆహ్వానాలు తమకూ అందినట్టు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ(పీడీపీ), ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌) నిర్ధారించారు. ఈనెల 24న ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత అక్కడ ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్రం చేపట్టిన అత్యంత కీలకమైన చర్య ఇది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, నలుగురు మాజీ ఉప ముఖ్యమంత్రులు సహా జమ్మూకశ్మీర్‌లోని 14 మంది నేతలను సమావేశానికి ఆహ్వానించినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. వారందరినీ ఆహ్వానించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా స్వయంగా వెళ్లినట్టు తెలిపారు.


ఆహ్వానితుల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌), మెహబూబా ముఫ్తీ(పీడీపీ), గులాం నబీ ఆజాద్‌(కాంగ్రెస్‌), నలుగురు మాజీ ఉపముఖ్యమంత్రులు తారా చంద్‌(కాంగ్రెస్‌), ముజఫర్‌ హుస్సేన్‌(పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌), నిర్మల్‌ సింగ్‌, కవిందర్‌ గుప్తా(బీజేపీ) ఉన్నారు. తనకు ఆహ్వానం అందిందని, అయితే, పార్టీ అధినేత ఆదేశం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. దీనిపై పార్టీ నేతలతో ఫరూక్‌ అబ్దులా సంప్రదింపులు జరపనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆహ్వానం తనకూ అందిందని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తెలిపారు. సమావేశానికి హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ముఫ్తీ ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా, ఈ ఏడాది నవంబరు, లేదా వచ్చే ఏడాది మొదట్లో జమ్మూకశ్మీర్‌కు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో కేం ద్రం అక్కడి పార్టీలతో వచ్చే వారం సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితిపై అమిత్‌షా శుక్రవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దొభాల్‌తో చర్చించారు.   

Updated Date - 2021-06-20T08:40:38+05:30 IST