ష్‌.. గప్‌చుప్‌!

ABN , First Publish Date - 2022-05-15T07:49:02+05:30 IST

పాత ఆర్థిక సంవత్సరం ముగిసి 45 రోజులైంది. దేశంలో అన్ని రాష్ర్టాల ఆదాయ, వ్యయ నివేదికలను ‘కాగ్‌’ విడుదల చేసింది. ఒక్క ఏపీ నివేదిక మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. ఎందుకంటే... ఈ నివేదిక పూర్తి..

ష్‌.. గప్‌చుప్‌!

ఏజీ కార్యాలయానికి వివరాలివ్వని ఏపీ

పాత ఆర్థిక సంవత్సరం ముగిసి నెలన్నర

అన్ని రాష్ట్రాల నివేదికలు సిద్ధం చేసిన కాగ్‌

దొంగ అప్పుల లెక్కలు చెప్పలేని రాష్ట్రం

బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు 8 వేల కోట్లు మళ్లింపు

ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో 10 వేల కోట్లు సేకరణ

ఆ లెక్కలు చెబితే భవిష్యత్‌ అప్పులకు కోత!?

అందుకే.. వివరాలు ఇవ్వకుండా తాత్సారం


కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై నెలన్నరవుతోంది. రాష్ట్రానికి ఇంకా కొత్త అప్పులకు అనుమతి రాలేదు. కారణం... పాత అప్పులకు సంబంధించిన లెక్కలు చెబితేనే, కొత్త అప్పులకు అనుమతిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్రం తూతూ మంత్రంగా  వివరాలు పంపడం... కేంద్రం దానిని తిరుగు టపాలో పంపేయడం! ఇదీ పరిస్థితి! అయినా సరే... ‘రాజకీయ ఒత్తిడి’తో తాత్కాలిక అనుమతులతో రాష్ట్రం అప్పులు తెచ్చుకుంటోంది.


పాత ఆర్థిక సంవత్సరం 

ముగిసి నెలన్నర అవుతోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌  ఆదాయ, వ్యయ నివేదికను ‘కాగ్‌’ విడుదల చేయలేదు.  కారణం... ఏజీ కార్యాలయం అడుగుతున్న వివరాలను రాష్ట్రం ఇవ్వకపోవడమే!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పాత ఆర్థిక సంవత్సరం ముగిసి 45 రోజులైంది. దేశంలో అన్ని రాష్ర్టాల ఆదాయ, వ్యయ నివేదికలను ‘కాగ్‌’ విడుదల చేసింది. ఒక్క ఏపీ నివేదిక మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. ఎందుకంటే... ఈ నివేదిక పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదు. ఏజీ కార్యాలయం నుంచి ఎన్ని  లేఖలొచ్చినా, ఎన్ని ఫోన్లొచ్చినా ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదు. తప్పుడు లెక్కలు, తప్పుడు మార్గాల్లో తెచ్చిన అప్పుల గురించి చెబితే... భవిష్యత్‌ రుణాలకు కోత పడుతుందనే భయమే దీనికి కారణం! బేవరేజెస్‌ కార్పొరేషన్‌ను అడ్డం పెట్టుకుని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.40,000 కోట్లు అప్పు తెచ్చేందుకు గత ఆర్థిక సంవత్సరంలో జగన్‌ సర్కారు పథకం రచించింది. మద్యంపై వచ్చే ఆదాయంలో కొంత మొత్తానికి ‘స్పెషల్‌ మార్జిన్‌’ అని పేరుపెట్టి... ఆ డబ్బును ఖజానాకు కాకుండా, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఖాతాకు మళ్లిస్తోంది. దానిని కార్పొరేషన్‌ ఆదాయంగా చూపించి... బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చేందుకు అవసరమైన జీవోలు, చట్టాలు చేశారు. అప్పటి అంచనాల ప్రకారం మద్యం అమ్మకాల ద్వారా రూ.23,000 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని...  ఇందులో రూ.6,000 కోట్లు స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించాలని భావించారు.


కానీ, మద్యం ఆదాయం రూ.28,000 కోట్లకు చేరింది. దీంతో రూ.8,000 కోట్లను బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో మళ్లించి, ఎక్కువ అప్పులు తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ని జానికి ఈ వివరాలన్నీ ఏజీ కార్యాలయానికి తెలియజేయాలి. కానీ, అదే జరిగితే రూ.8000 కోట్లను రాష్ట్ర మొత్తం ఆదాయం నుంచి తీసేసి 2021-22 ఆ దాయాన్ని ‘కాగ్‌’ ఖరారు చేస్తుంది. మరోవైపు... ఏ రూపంలో వచ్చిన ఆదాయమైనా అది ఖజానాకే చేరాలి. స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కు మళ్లించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంపై ‘కాగ్‌’ ప్రశ్నిస్తే... సమాధా నం చెప్పలేని పరిస్థితి. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా తెచ్చే అప్పులను కూడా కేంద్రం మినహాయించుకుంటే... కొత్త అప్పుల పరిమితి మరింత తగ్గిపోతుం ది.అందుకే... ఏజీ కార్యాలయానికి వివరాలు పంపకుండా తాత్సారం చేస్తోంది. 


డిపాజిట్ల సంగతేమిటి... 

గత ఆర్థిక సంవత్సరం ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ ద్వారా ప్రభుత్వం యూనివర్సిటీలు, కాలేజీలు, ఇతర సంస్థల నుంచి దాదాపు రూ.10,000 కోట్లు డిపాజిట్ల రూపంలో అప్పు తీసుకుంది. ఆ కార్పొరేషన్‌కు డిపాజిట్లు తీసుకునే అధికారం లేదని తెలిసీ ఆ పని చేసింది. ఈ అప్పులను ఏ ఖాతాలో చూపాలన్న దానిపై జగన్‌ సర్కారుకు స్పష్టత లేదు.  ఎక్కడ చూపించినా దానిని రాష్ట్ర అప్పుగానే భావిస్తామని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. ఇవి చూపిస్తే... కొత్త అప్పుల పరిమితిలో మరో పదివేల కోట్లకు కోత పడుతుంది. అందుకే... ఏజీ కార్యాలయానికి వివరాలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.


రుణ స్థిరత్వం కోసం కేంద్రం...

రాష్ట్రాలు అడ్డగోలుగా అప్పులు చేయకుండా... వాటి రుణ స్థిరత్వం  (డెట్‌ సస్టెయినబులిటీ) పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రాష్ర్టాలు కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చి వాటిని ఖజానా ద్వారా చెల్లిస్తుండడం వల్ల రాష్ర్టాల రుణ స్థిరత్వం తగ్గిపోతోందని, ఇలాగే కొనసాగితే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సి వస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. అందుకే... ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే... ఏపీ విషయంలో ఇప్పటికీ ఉదారత ప్రదర్శిస్తూనే ఉంది. తెలంగాణకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఏపీ కూడా రికార్డు స్థాయిలో  అప్పులు చేసినప్పటికీ.... కొత్త అప్పులకు ఎప్పటికప్పుడు అనుమతి ఇస్తూనే ఉంది. తెలంగాణ విషయంలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. దీనిపై ఆర్థిక నిపుణుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-05-15T07:49:02+05:30 IST