రాష్ట్ర జనాభా 3.77 కోట్లు

ABN , First Publish Date - 2022-02-24T08:07:37+05:30 IST

2021 సంవత్సరపు అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3,77,25,000 ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అదే 2031 నాటికి ఈ జనాభా 3,92,07,000 వరకు ఉండొచ్చని తెలిపింది. ఇది వరుసగా దేశ జనాభాలో 2.77 శాతం

రాష్ట్ర జనాభా 3.77 కోట్లు

  • ఇదీ రాష్ట్ర జనాభా.. 2031కి 3.92 కోట్లు
  • బాలబాలికల లింగ నిష్పత్తి 932
  • మహబూబాబాద్‌, వనపర్తిలో అత్యల్పం 903
  • ములుగులో అత్యధికం 971.. అక్షరాస్యత 
  • 66.54%.. ‘స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌’ నివేదిక

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): 2021 సంవత్సరపు అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 3,77,25,000 ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అదే 2031 నాటికి ఈ జనాభా 3,92,07,000 వరకు ఉండొచ్చని తెలిపింది. ఇది వరుసగా దేశ జనాభాలో 2.77 శాతం, 2.66% శాతమని తెలిపింది. 2011 నుంచి 2031 వరకు దేశ జనాభాలో రాష్ట్ర జనాభా 0.23 పాయింట్లు తగ్గుతుందని అంచనా. వివిధ రంగాలకు సంబంధించి ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌’ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ను బుధవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం, భౌగోళిక పరిస్థితులు, జనాభా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, పాఠశాల విద్య, వ్యవసాయం, సాగునీటి పారుదల, రైతు బంధు, రైతు బీమా, ఆరోగ్యం, గ్రామీణ తాగు నీటి వ్యవస్థ-పారిశుద్ధ్యం, పల్లె ప్రగతి-పట్టణ ప్రగతి, సామాజిక భద్రత వంటి 13 అంశాలపై గణాంకాలతో కూడిన ఈ నివేదికను రూపొందించారు. 


నివేదికలోని ముఖ్యాంశాలు:

  • 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో  మహిళలు 1,73,92,041(49.69%) మంది, పురుషులు 1,76,11,633 (50.31%)మంది ఉన్నారు.
  • రాష్ట్రంలో సెక్స్‌ రేషియో 988(ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)గా ఉంది.. రంగారెడ్డి జిల్లాలో అతి తక్కువగా 950, అతి ఎక్కువగా నిర్మల్‌ జిల్లాలో 1046గా స్త్రీ పురుష నిష్పత్తి ఉంది. 
  • రాష్ట్రంలో 0- 6 సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారుల సంఖ్య 38,99,166. ఇందులో బాలుర సంఖ్య 20,17,935 కాగా బాలికల సంఖ్య 18,81,231 ఈ వయస్సు గ్రూపు బాల బాలికల సెక్స్‌ రేషియో రాష్ట్రంలో 932 గా ఉంది. అత్యధికంగా  ములుగుజిల్లాలో 971గా ఉండగా.. వనపర్తి, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్పంగా 903గా నమోదైంది.
  • పట్టణ ప్రాంతాల్లో 1,36,08,665 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 2,13,95,009 మంది నివసిస్తున్నారు.హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలు అత్యధిక పట్టణ జనాభా కలిగి ఉండగా, అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన జిల్లాలు ములుగు, నారాయణపేట. 
  • 15 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు యువత 2011 లెక్కల ప్రకారం 13,034 ఉండగా, 2021లో 13,284 మంది ఉన్నారు. 
  • రాష్ట్రంలో ఎస్సీలు 54,08,800(15.45%) మంది, ఎస్టీలు 31,77,940(9.08%) మంది ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధిక ఎస్సీ జనాభా ఉండగా, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు. 
  • రాష్ట్ర అక్షరాస్యత శాతం 66.54 కాగా, మహిళల్లో 57.99%, పురుషుల్లో 75.04% మేర ఉంది.
  • జన సాంద్రత 312 కాగా, అత్యధిక జనసాంధ్రత హైదరాబాద్‌ జిల్లా(18,161)లో, అత్యల్ప జన సాంద్రత ములుగు జిల్లా(71)లో ఉంది. మొత్తం జనాభాలో 1,63,41,942 మంది వర్కర్స్‌ ఉండగా, ఇందులో ప్రధాన వర్కర్స్‌ 1,37,19,879 మంది ఉన్నారు. నాన్‌ వర్కర్స్‌ 1,86,61,732 మంది ఉన్నారు. వ్యవసాయదారులు 31,51,389 మంది ఉండగా, వ్యవసాయ కూలీల కింద 59,15,151 మంది నమోదయ్యారు. 
  • 2020-21లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ) రూ.9,80,407 కోట్లుగా ఉంది. 2019-2020 లో ఇది 9,52,907 కోట్లుగా ఉంది.
  • తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 3,910 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉంటే అందులో అత్యధికంగా 273 కిలోమీటర్ల నిడివితో నల్లగొండ జిల్లాలోనే జాతీయ రహదారులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో అసలు జాతీయ రహదారి ఒక్క కిలోమీటర్‌ కూడా లేదు. రాష్ట్రంలో గత ఏడాది కరోనా కారణంగా మోటారు వాహనాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయి. 2020-21లో 8,22,416 మోటారు వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయి. 2019-20లో 12,38,778వాహనాలు రిజిస్టరయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,38,11,466 వాహనాలున్నాయి. 
  • రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే 1.24 కోట్ల ఎకరాలకు సాగునీటి వసతి లభించనుంది. 


హైస్కూల్‌ స్థాయిలో డ్రాపౌట్స్‌!

బడులను మానేసే వారిలో ఎక్కువగా హైస్కూల్‌ స్థాయి విద్యార్థులే ఉన్నారు. ప్రైమరీ పాఠశాల స్థాయిలో డ్రాపౌట్‌ లేకపోవడం విశేషం. హైస్కూల్‌ స్థాయిలో మాత్రం 12.29 శాతం మంది విద్యార్థులు బడులు మానేస్తున్నారు. జయశంకర్‌ జిల్లాలో  అత్యధికంగా హైస్కూల్‌ స్థాయిల్లో డ్రాపౌట్‌ 29.49 శాతంగా ఉంది.  రాష్ట్రంలో  ప్రాథమిక(1-5వ తరగతి) విద్యలో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ అందుబాటులో ఉన్నారు. విద్యా హక్కు చట్ట ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు  కనీసం ఒక్క ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండాలి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మొత్తం 40,898 పాఠశాలలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 2,902 స్కూళ్లు ఉన్నాయి. జయశంకర్‌ జిల్లాలో అత్యల్పంగా 537 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి.

Updated Date - 2022-02-24T08:07:37+05:30 IST