Abn logo
Feb 27 2020 @ 01:08AM

రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీ తక్షణావసరం

రాష్ట్రానికి చెందిన ప్రవాసీలు, ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలోని వలస కార్మికులు, వారి కుటుంబాలు ఎంతో కాలంగా కోరుతున్న ‘సమగ్ర ఎన్నారై పాలసీ’ని తెస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ యువత బ్రతకాలంటే ‘బొగ్గుబాయి–బొంబాయి–దుబాయ్‌’ లా ఉండేది పరిస్థితి. పొట్టకూటి కోసం ఉన్న ఊరు, కన్న తల్లిని వదలి వందలు, వేల కిలోమీటర్లు వలస పోయి ఏండ్లకొద్దీ కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన దుస్థితి. దుబాయ్‌లో ఉద్యోగాలు చేసి తమ కుటుంబాలను బాగు చేసుకోవాలని ఉన్నదంతా అమ్ముకుని అప్పు చేసి తీరా అక్కడికి వెళ్ళాక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నానా అవస్థలు పడుతున్న తెలంగాణ అభాగ్యులెందరో... దురదృష్టవశాత్తు చనిపోతే మృతదేహాలు తీసుకొచ్చేందుకు సైతం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. ఇలాంటి దీనవాస్థలో ఉన్న కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఈ పాలసీ సమగ్ర చర్యలను ప్రకటించాలి. 2012 వికారాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఈ అంశంపై తీర్మానం చేశారు. 2014 పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ప్రవాసుల సంక్షేమం పేరిట తమ ప్రవాసీ విధానాన్ని ప్రకటించింది. 2016 జూలై 27న ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన హైదరాబాదులో ఎన్నారై పాలసీపై విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అంతేకాదు, మంత్రులు, అధికారులతో స్వయంగా గల్ఫ్‌ దేశాల్లో పర్యటించి తెలంగాణ ప్రజలతో మాట్లాడతానన్న ప్రకటన గల్ఫ్‌ ఎన్నారైల్లో భరోసా కల్పిస్తున్నది. గల్ఫ్‌ వలస కార్మికుల్లో బ్లూ కాలర్‌ వర్కర్స్‌ (అల్పాదాయ కార్మికుల)ను ఆదుకోవడానికి ‘తెలంగాణ స్టేట్‌ ఎన్‌ఆర్‌ఐ ఫండ్‌’ పేరిట ఒక నిధిని ఏర్పాటు చేసి కార్మికులను, పేద గల్ఫ్‌ కార్మికులను ఆదుకోవడానికి ఉపయోగించాలి. విదేశాల్లో మరణించిన వారిని శవపేటికలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు, అక్కడినుంచి వారి స్వగ్రామాలకు చేర్చడానికి ఉచిత అంబులెన్సు సర్వీసులను ఏర్పాటు చేయాలి. జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం, గల్ఫ్‌ నుండి తిరిగివచ్చిన వారు జీవితంలో స్థిరపడడానికి తగిన సహకారం అందించాలి. హైదరాబాదులో ఎన్‌ఆర్‌ఐ భవన్‌ నిర్మించాలి. వివిధ దేశాల్లో స్థిరపడి తెంగాణ సంస్కృతిని కాపాడుతున్న సంఘాలు, సంస్థలను సమన్వయం చేస్తూ తెలంగాణ ప్రవాస భారతీయుల కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలి. ఈ విధంగా తెలంగాణ ప్రవాసుల స్థితిగతులు, ఇక్కడి వారి కుటుంబాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనితెలంగాణ ప్రవాస భారతీయుల విధాన కల్పన జరుగుతుందని ఆశిద్దాం. 

సురేశ్‌ కాలేరు

Advertisement
Advertisement