విజయవాడలో వద్దే వద్దు!

ABN , First Publish Date - 2020-10-01T08:18:41+05:30 IST

రాష్ట్రాలు అడిగి మరీ కేంద్ర కార్యాలయాలను తెచ్చుకుంటాయి.

విజయవాడలో వద్దే వద్దు!

  • ఏపీకి అటవీ శాఖ ఐఆర్‌ఓ మంజూరు
  • విజయవాడలో ఏర్పాటుకు ఆదేశాలు
  • చర్యలు తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం 
  • విశాఖపట్నం వైపే మొగ్గు 

రాష్ట్రాలు అడిగి మరీ కేంద్ర కార్యాలయాలను తెచ్చుకుంటాయి. అలాంటిది కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఏపీకి అటవీశాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని మంజూరు చేసింది. విజయవాడలో ఏర్పాటు చేసి, అక్టోబరు 2 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించింది. ఎగిరి గంతేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకు విముఖత ప్రదర్శిస్తోంది. విశాఖకు తరలించడానికి పైరవీలు చేస్తోంది. ఈ విషయాన్ని తాను కేంద్రానికి చెప్పకుండా... ‘విజయవాడలో వద్దు. విశాఖలోనే కార్యాలయం ఏర్పాటు చేయండి’ అని లేఖ రాయాలంటూ  రాష్ట్ర అటవీ శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం!   కేంద్రానికి చెప్పలేక, రాష్ట్రం ఒత్తిడి తట్టుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లో సమగ్ర ప్రాంతీయ కార్యాలయాలను (ఐఆర్‌ఓ) ఏర్పాటు చేయాలని కేంద్రం తలపెట్టింది. ఈ కార్యాలయాలు అక్టోబరు 2 నుంచి పని చేయాలని నిర్దేశించింది. ఏపీకి కూడా ఈ కార్యాలయాన్ని మంజూరు చేసింది. విజయవాడలో కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించంది.  అయితే కేంద్రం నిర్ణయించిన విధంగా విజయవాడలో కాకుండా, విశాఖపట్నంలో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ను విశాఖకు తరలించే యోచనలో ఉన్న ప్రభుత్వం సదరు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి విముఖత వ్యక్తం చేస్తోంది. కేంద్రం చెప్పిన ప్రకారం శుక్రవారమే ఈ కార్యాలయం ప్రారంభించాల్సి ఉంది. అయినా... ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడలో వద్దు, విశాఖలోనే ఐఆర్‌వో ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 


రాజధాని తరలింపు కోసమే..!

అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విజయవాడలో ఈ కార్యాలయం ఎందుకన్న ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అమరావతిలోని కార్యాలయాల తరలింపును ఆపిన ప్రభుత్వం.. ఎప్పటికైనా విశాఖలోనే పరిపాలన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకే కేంద్రం విజయవాడకు మంజూరు చేసిన ఐఆర్‌ఓ విషయంలో సానుకూలత చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధికారులు విజయవాడలో కనీసం అద్దె భవనాలను కూడా తీసుకోలేదని అంటున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా, ఏపీలో మాత్రం దాని ఊసే లేదు. ప్రస్తుతానికి చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి ఏపీని పర్యవేక్షిస్తారని సమాచారం. 


ఉత్తమ ఫలితాల కోసమే ఐఆర్‌ఓల ఏర్పాటు

ప్రజలతో మమేకమవుతూ, వివిధ ప్రభుత్వాంగాలను సమన్వయం చేసుకొంటూ సమర్థవంతమైన పలితాలు సాధించాలన్న లక్ష్యంతో సమగ్ర ప్రాంతీయ కార్యాలయాలను కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌వోహెచ్‌క్యూ డివిజన్‌  10 ప్రాంతీయ కార్యాలయలు, భారత అటవీ సర్వే(ఎ్‌ఫఎ్‌సఐ)కు చెందిన 4 ప్రాంతీయ కార్యాలయాలు, జాతీయ పులి సంరక్షణ అఽథారిటీకి చెందిన 3 ప్రాంతీయ కార్యాలయాలు, కేంద్ర జూ అథారిటీకి చెందిన 4 ప్రాంతీయ కార్యాలయాలు, వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరోకు చెందిన 5 ప్రాంతీయ, 3 ఉపప్రాంతీయ కార్యాలయాలను ఐఆర్‌ఓలకు అనుసంధానం చేస్తారు. దీంతో సమగ్ర, సమర్థ విధానాలు సాధ్యమవుతాయని అటవీశాఖ భావించింది. 


Updated Date - 2020-10-01T08:18:41+05:30 IST