రాష్ర్టానికి లాస్ట్‌ చాన్స్‌!

ABN , First Publish Date - 2021-11-17T08:06:04+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాలా నాలుగు వేల కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన గ్రామీణ విద్యుదీకరణ సంస్థ..

రాష్ర్టానికి లాస్ట్‌ చాన్స్‌!

అప్పు కట్టకపోతే డిఫాల్టే.. ఇక ఎవరూ రుణమివ్వరు

బకాయిల వసూలుకు బృందం

విజయవాడ వచ్చిన ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ సీఎండీలు

కనీస గౌరవమివ్వని సర్కారు

ప్రొటోకాల్‌ నిబంధనలు తుంగలోకి

స్వాగతం పలికేందుకు ఇంజనీర్‌ను పంపిన వైనం

బృందంతో అంటీముట్టనట్లుగా ఉన్నతాధికారులు

కేంద్ర మంత్రికీ దొరకని సీఎం అపాయింట్‌మెంట్‌

మంగళవారం అప్పులకూ బ్రేక్‌  

కొంత కట్టి బయటపడుతుందా?

గడువు ఇవ్వాలని కోరుతుందా?

అప్పు కట్టాలంటే ఇంకా ఓడీలోనే!

ప్రభుత్వ సంస్థలకు ఇలాంటి 

పరిస్థితి ఎదురవడం తొలిసారి


ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాలా నాలుగు వేల కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ)లకు రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి మొత్తమిది. గడువు దాటి మూడు నెలలైనా కడుతుందో లేదో చెప్పడం లేదు. లేఖలు రాసినా స్పందించదు. ఎంతో కొంత కట్టడానికి కూడా సిద్ధంగా లేదు. దీంతో ఆ సంస్థల ఉన్నతాధికారులే స్వయంగా రాష్ట్రానికి వచ్చారు. వారి హోదాకు తగినట్లు స్వాగత సత్కారాలు చేపట్టకుండా సీఎం, రాష్ట్ర అధికారులు అవమానకర రీతిలో వ్యవహరించారు. వారు కరుణించకపోతే డిఫాల్టర్లుగా ప్రకటిస్తారని తెలిసినా రాష్ట్ర సర్కారు ఇలా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రప్రభుత్వం డీఫాల్ట్‌ ముప్పు ముంగిట నిలిచింది. ‘రూ.4,000 కోట్లు బకాయిపడ్డారు. గడువు దాటిపోయింది. 100 శాతం రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్లను డిఫాల్టర్లుగా ప్రకటించాలనుకుంటున్నాం. దీనిపై స్పందించండి’ అని ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ లేఖ రాసి 15 రోజులు దాటింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎంతో కొంత కడతామని గానీ, ఇంకొంత గడువు ఇవ్వాలని గానీ కోరి సర్దుబాటు చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఏదో రకంగా రాష్ట్రప్రభుత్వంతో మాట్లాడి సెటిల్‌ చేసుకుందామని ఆ సంస్థలే ప్రయత్నిస్తుంటే పట్టించుకోవడం లేదు. ‘మా సంస్థల సీఎండీలతో కలిసి వచ్చి బకాయిపడిన అప్పుల గురించి మాట్లాడుకుందాం’ అని 10 రోజులుగా ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ రాష్ట్రప్రభుత్వాన్ని అడుగుతున్నాయి.


చర్చలకు సిద్ధంగా లేమంటూ ప్రభుత్వం పది రోజులు సాగదీసింది. ఎట్టకేలకు బుధవారం వచ్చేందుకు అనుమతిచ్చింది. జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్లను డిఫాల్టర్లుగా ప్రకటించేముందు ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్న చివరి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే డిఫాల్టర్‌ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలున్నాయని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అర్జెంటుగా కట్టాల్సిన రూ.4,000 కోట్లలో కొంత కట్టి మరికొంత మొత్తానికి సమయం అడుగుతారా? లేక మొత్తం రూ.4,000 కోట్లూ కట్టడానికి ఇంకా గడువు కోరతారా? అసలు సమయం అడుగుతారా.. లేక వదిలేసుకుంటారా అనేది వేచిచూడాలి. అయితే ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే బుధవారం భేటీలో ఏం జరుగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం తర్వాత ఆ సంస్థలు తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్‌కు అత్యంత కీలకంగా మారాయు. ఈ రెండు సంస్థలు పూర్తిగా ఆర్‌బీఐ నియంత్రణలో ఉంటాయి. ప్రతి నెలా ఇవి తమ అప్పులు, వసూళ్లను దానికి వెల్లడించాలి. రాష్ట్రప్రభుత్వం కట్టాల్సిన అప్పు చెల్లింపు గడువు దాటిపోయి.. 90 రోజులు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం.. ఆ రెండు సంస్థలు జెన్‌ కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ను డిఫాల్టర్లుగా ప్రకటిస్తూ ఆర్‌బీఐకి సమాచారం పంపాలి. లేదంటే ఏం చర్యలు తీసుకున్నారు.. ఎలా సెటిల్‌ చేసుకున్నారన్న వివరాలివ్వాలి. లేకుంటే ఈ సంస్థల నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ లైసెన్సులను ఆర్‌బీఐ రద్దు చేస్తుంది. అందుకే ప్రభుత్వంతో సమావేశమై తదుపరి నిర్ణ యం తీసుకోవడం ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలకు అతి ముఖ్యం. అం దుకే ప్రభుత్వం స్పందించకున్నా బతిమలాడి మరీ వచ్చారు.


మీటింగ్‌ విఫలమైతే..

ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ బృందానికి రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా, సర్కారు వాదనతో అవి సంతృప్తి చెందకపోయినా.. జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లను డిఫాల్టర్లుగా ప్రకటించడం ఖాయమని తెలుస్తోంది. ఈ రెండు కార్పొరేషన్లలో 100 శాతం వాటా రాష్ట్రప్రభుత్వానిదే కాబట్టి.. అవి డిఫాల్ట్‌ అయితే అవే నిబంధనలు దానికీ వర్తిస్తాయని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు అంటున్నారు. ఇంతవరకు ప్రైవేటు రంగంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, ప్రభుత్వ రంగ సంస్థకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. డిఫాల్ట్‌ అయితే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు అప్పులివ్వవు. ఆ రెండు కార్పొరేషన్ల యజమాని ప్రభుత్వం గనుక దానికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని.. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలే గాకుండా ప్రభుత్వం ప్రతి మంగళవారం ఆర్‌బీఐ నుంచి సెక్యూరిటీలు వేలం వేసి తెచ్చుకునే అప్పులకు కూడా బ్రేక్‌ పడుతుందని అంటున్నారు. ఒకవేళ జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్లను డిఫాల్టర్‌గా ప్రకటిస్తే.. దివాలా చట్టం ప్రకారం ఈ సమస్యను ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) దృష్టికి తీసుకెళ్తాయి. ఆ తర్వాత జెన్‌కో, పీడీసీల పూర్తి బాధ్యతలు వాటి చేతికి వెళ్లిపోతాయని, ఆ సంస్థల ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బులను అప్పు కింద జమ చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.


ఇంకా ఓడీలోనే..: అత్యవసరంగా కట్టాల్సిన రూ.4,000 కోట్లలో ఎంతో కొంత కట్టేందుకైనా ఖజానాలో చిల్లిగవ్వ లేదు. ఇక, ప్రభుత్వం ఓడీ అప్పులో ఉంది. ఖజానాకు ఏదైనా ఆదాయం వస్తే దానిని ఆర్‌బీఐ ఓడీ అప్పు కింద జమ చేసుకుంటుంది. ప్రతి నెలా కేంద్రం రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద దాదాపు రూ.1,450 కోట్ల వరకు ఇస్తుంది. ఈ నెల ఇంకా ఆ డబ్బులు రాలేదు. అంటే ఇప్పుడు ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీల అప్పులో కొంతైనా చెల్లించాలంటే ఇంకో చోట అప్పు తేవాల్సిందే. ఏపీఎ్‌సడీసీ వ్యవహారంతో బ్యాంకులు ముఖం చాటేశాయి. అన్ని శాఖల వద్ద ఉన్న చిల్లరనూ కార్యదర్శులు, ఉన్నతాధికారులను బెదిరించి, భయపెట్టి లాగేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీల అప్పు ఎలా చెల్లిస్తుంది? ఇటీవల తెరపైకి తెచ్చిన బెవరేజెస్‌ కార్పొరేషన్‌పై ప్రభుత్వం కన్నేసింది. మద్యం అమ్మకాలపై స్పెషల్‌ మార్జిన్‌ను చట్టవిరుద్ధంగా ఆ కార్పొరేషన్‌ ఆదాయంగా చూపించి రూ.25 వేల కోట్లు అప్పు తేవాలని ప్రయత్నిస్తోంది. ఈ అప్పులు వస్తే తప్ప పాత రుణాలు తీరే దారే కనిపించడం లేదు.


షెడ్యూల్‌ ఇదీ..

డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని లేఖ రాసినా స్పందన లేకపోవడంతో నేరుగా పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ సీఎండీలు, ఇతర అధికారులు కలిసి 10 మందితో కూడిన బృందం మంగళవారం ముంబై, ఢిల్లీ నుంచి వచ్చింది. బుధవారం విద్యుత్‌ సౌధలో ఇంధన శాఖ కార్యదర్శితో, డిస్కమ్‌ల అధికారులతో వారు సమావేశమవుతారు. మధ్యాహ్నం సీఎస్‌ సమీర్‌శర్మను కలుస్తారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌ కూడా పాల్గొంటారు. మూడున్నర గంటలకు సీఎంవో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌తో సమావేశమవుతారు. తర్వాత రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ ఎండీతో సమావేశమవుతారు. 


5 కార్పొరేషన్ల అప్పులు 87 వేల కోట్లు

విద్యుత్‌ శాఖ పరిధిలోని 5ఎనర్జీ కార్పొరేషన్ల అప్పులు దాదాపు రూ.87,000 కోట్లు. ఇందులో ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ ఇచ్చిన అప్పులే 65,000-70,000 కోట్ల వరకు ఉన్నాయి. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగంలో పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ దేశంలోనే అతి పెద్ద వ్యవస్థలు. రాష్ట్రంలో ఎనర్జీ కార్పొరేషన్లతోపాటు ఇరిగేషన్‌ కార్పొరేషన్‌, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌కు ఈ రెండు సంస్థలు వేల కోట్ల రూపాయల అప్పులిచ్చాయి.


ఇంత అవమానమా?

సీఎండీల బృందం 10 రోజుల నుంచి వస్తామని అడుగుతున్నా తాము సిద్ధంగా లేమంటూ రాష్ట్ర సర్కారు వాయి దా వేస్తూ ఎట్టకేలకు బుధవారం అవకాశం ఇచ్చింది. పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ సీఎండీల హోదా రాష్ట్ర సీఎస్‌ హోదాకు సమానం. ఈ సంస్థల సీఎండీలు వస్తే ప్రభుత్వం తరపున సీనియర్‌ అధికారులు సాదరంగా స్వాగతం పలుకుతారు. గౌరవ మర్యాదలు నెరపుతారు. కానీ జగన్‌ సర్కారు వారి విషయంలో ఈ ప్రొటోకాల్‌ పాటించలేదు. స్వాగతం పలకడానికి ఏపీ జెన్‌కోకు చెందిన ఓ ఇంజనీర్‌ను పంపింది. ఇది చాలా అవమానకరంగా ఉందని సీఎండీలు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రవీణ్‌ ప్రకాశ్‌ సమయం ఇచ్చారని అంటున్నా అదీ సందిగ్ధంలోనే ఉన్నట్లు సమాచారం. దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన సీఎస్‌ ఎప్పుడో మధ్యాహ్నం కలుస్తాననడంపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని.. వేల కోట్లు అప్పులిచ్చినవాళ్లు వస్తుంటే.. కనీస మర్యాదైనా పాటించకుండా నిర్లక్ష్యంగా, అంటీముట్టనట్లుగా వ్యవహరించడమేంటని ఆశ్చర్య ం వ్యక్తమవుతోంది. ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ ఇంతవరకు రాష్ట్రానికి రూ.వేల కోట్ల అప్పులిచ్చాయి. ఇకపై ఇచ్చే సంకేతాలు లేకపోవడంతో ఇక వాళ్లతో అవసరం ఏముందిలేనని భావించి సీఎం నుంచి అధికారుల వరకు ఇలా వ్యవహరిస్తున్నారని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2021-11-17T08:06:04+05:30 IST