పేదలకు అందని ‘కేంద్ర’ రేషన్‌!

ABN , First Publish Date - 2022-05-21T06:18:48+05:30 IST

‘దేవుడు వరమిచ్చినా..’ సామెత పేదలకు రేషన్‌ పంపిణీలో నిజమవుతోంది.

పేదలకు అందని ‘కేంద్ర’ రేషన్‌!

రెండు నెలలుగా పట్టించుకోని రాష్ట్రం 

 కేటాయింపులు లేవంటున్న అధికారులు

మచిలీపట్నం టౌన్‌, మే 20 : ‘దేవుడు వరమిచ్చినా..’ సామెత పేదలకు రేషన్‌ పంపిణీలో నిజమవుతోంది. కరోనా కష్టకాలం నుంచి దేశవ్యాప్తంగా పేదలకు తమ వంతుగా కేంద్ర ప్రభుత్వం ఒక్కక్కరికీ ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీన ఇంటింటికీ రేషన్‌ ఇస్తుంటే, కేంద్ర ప్రభుత్వం కోటా 15వ తేదీ నుంచి రేషన్‌ షాపుల ద్వారా అందిస్తోంది. ఇలా 2020 ఏప్రిల్‌ నుంచి పీఎంజీకేవై కింద కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తూ వస్తోంది. దీనికి కావాల్సిన బియ్యాన్ని ఫుడ్‌ కార్పొరేషన్‌ సమకూర్చాల్సి ఉంది. ఫుడ్‌ కార్పొరేషన్‌ సకాలంలో బియ్యాన్ని రైస్‌ మిల్లర్ల ద్వారా సేకరించకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నెల బియ్యం పేదలకు అందలేదు. మే నెలలో ఏప్రిల్‌ బియ్యం కూడా కలిపి ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో ఈ నెల 15వ తేదీ నుంచే పేదలు రేషన్‌ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేదలకు ఈ రేషన్‌ బియ్యం బాసటగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యానికి ఇస్తున్న ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోటాకి ఇవ్వడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యాన్ని కొంచెం పాలిష్‌ చేసి ఇస్తున్నారు. దీన్ని సార్టెక్స్‌ బియ్యంగా పిలుస్తారు. కేంద్రం ఇచ్చేది నాన్‌ సార్టెక్స్‌ బియ్యం. ఇవి కొంచెం ముతకగా ఉంటాయి. ప్రస్తుత సమయంలో పేదలు ఈ బియ్యాన్ని తీసుకునేందుకు సైతం వెనుకాడడం లేదు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కోటాలో ఉచితంగా పంపిణీ చేసే బియ్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దానికి కేటాయింపులు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

  కేటాయింపులు లేకపోవడం వల్లే..

పీఎంజీకేవై పథకం కింద పేదలకు ఇచ్చే బియ్యం ఇంకా కేటాయింపులు జరపక పోవడం వల్ల రేషన్‌ ఇవ్వలేక పోతున్నాం. నాన్‌ సార్ట్‌క్స్‌ బియ్యం సేకరణ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల పేదలకు ఏప్రిల్‌, మే నెలల కోటా ఇవ్వలేక పోయాం. కృష్ణా జిల్లాలో 5,23,801 కార్డులకు 14,31,000 క్వింటాళ్ల బియ్యం అందించాల్సి ఉంది. ఫుడ్‌ కార్పొరేషన్‌ కేటాయించిన వెంటనే పేదలకు బియ్యం అందిస్తాం.

- పార్వతి, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి 



Updated Date - 2022-05-21T06:18:48+05:30 IST