పొరపాటు పునరావృతం కాకూడదు

ABN , First Publish Date - 2020-12-05T06:23:20+05:30 IST

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 4: సభ్యసమాజం సిగ్గుపడేలా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో బాలబాలికలు చేసిన పొరపాటు మళ్లీ పునరావృతం కాకుండా

పొరపాటు పునరావృతం కాకూడదు
జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న రాజ్యలక్ష్మి

రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి

రాజమహేంద్రవరం జూనియర్‌ కాలేజీలో 

తాళి కట్టిన ఘటనపై విచారణ

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 4: సభ్యసమాజం సిగ్గుపడేలా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో బాలబాలికలు చేసిన పొరపాటు మళ్లీ పునరావృతం కాకుండా విద్యార్థులు జాగ్రత్తగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి సూచించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఒక విద్యార్థి తన తోటి విద్యార్థినికి పసుపు కొమ్ముతో తాళి కట్టిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించి విచారణ చేపట్టింది. శుక్రవారం కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి కాలేజీని పరిశీలించారు. కాలేజీ డీవీఈవో టి.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ మేరీ సుజాతతో ఆమె మాట్లాడారు. జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రతి విద్యార్థిపైనా వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని కష్టపడి చదివిస్తున్నారనే విషయాన్ని మరచిపోకూడదన్నారు. చదువును పక్కన పెట్టి పెళ్లిని బొమ్మలాటగా భావించి ఇద్దరు విద్యార్థులు చేసిన తప్పు వల్ల వారి భవిష్యత్‌లో ఎన్నికష్టాలు పడతారో వివరించారు. అనంతరం రాజ్యలక్ష్మి విలేకర్లతో మాట్లాడారు. గతనెల 17న ఉదయం 8:30కే ఆ ఇద్దరు విద్యార్థులతో పాటు బాలికకు అక్క అయ్యే మరొక విద్యార్థిని కాలేజీలోకి ప్రవేశించారని చెప్పారు. ఎవ్వరూ లేని సమయంలో ఆ విద్యార్థి తన తోటి విద్యార్థినికి పసుపు కొమ్ముతో కూడిన తాళి కట్టాడని, ఆ దృశ్యాన్ని మరొక విద్యార్థిని వీడియో తీసిందని తెలిపారు. విషయం బయట వైరల్‌ అయ్యేవరకు ఎవ్వరికీ తెలిసిన పరిస్థితి లేదన్నారు. తెలిసిన వెంటనే ఆ విద్యార్థులకు టీసీలు ఇచ్చారన్నారు. ఇక్కడ విద్యార్థులను నిరంతరం గమనించాల్సిన పరిస్థితి ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కాలేజీ ప్రాంగణంలో ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌కి సూచించినట్టు తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, దీనిపై నివేదిక రూపొందించి మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మకు అందిస్తామని చెప్పారు. ఆ విద్యార్థులు ఇద్దరూ మైనర్‌లు కావడంతో వారిని హోమ్‌కు తరలిస్తామని, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామని రాజ్యలక్ష్మి తెలిపారు.

Updated Date - 2020-12-05T06:23:20+05:30 IST