రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-27T06:44:29+05:30 IST

రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్‌ రెడిడెన్షియల్‌ పాఠశాలల క్రీడా పోటీల్లో విద్యార్థులు సత్తా చాటాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కొండలరావు పిలుపునిచ్చారు.

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
ఆర్చరీ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

28 ఏకలవ్య మోడల్‌ రెడిడెన్షియల్‌ పాఠశాలల నుంచి విద్యార్థుల హాజరు


అరకులోయ, సెప్టెంబరు 26: రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్‌ రెడిడెన్షియల్‌ పాఠశాలల క్రీడా పోటీల్లో విద్యార్థులు సత్తా చాటాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కొండలరావు పిలుపునిచ్చారు. సోమవారం అరకులోయలోని క్రీడా పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో విజయ పతాకం ఎగురవేయాలన్నారు. ట్రైబల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ఎస్‌.శ్యాంసుందర్‌ మాట్లాడుతూ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(నెస్ట్‌), మినిస్ట్రీ ఆఫ్‌ ట్రైబల్‌ ఎఫైర్స్‌(మోటా) సంయుక్తంగా ఈ రాష్ట్ర స్థాయి ఏకలవ్య మోడల్‌ రెడిడెన్షియల్‌ పాఠశాల క్రీడా పోటీలు- 2022ను అరకులోయలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 వ్యక్తిగత పోటీలు, ఏడు బృందాల వారీ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఏకలవ్య మోడల్‌ రెడిడెన్షియల్‌ పాఠశాల నుంచి సుమారు 700 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. వీరిలో 487 మందిని ఎంపిక చేసి జాతీయ పోటీలకు చక్కని శిక్షణ ఇస్తామన్నారు. ఈసారి జాతీయ స్థాయి పోటీలకు ఏపీ ఆతిథ్యమిస్తున్నదని తెలిపారు. అనంతరం ఆర్చరీ, హ్యాండ్‌బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో మానెటరింగ్‌ ఆఫీసర్‌ రఘునాథ్‌, డీఈవో భారతీరత్నం, సీఐ జీడీ బాబు, పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు, పలు ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాల్స్‌, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T06:44:29+05:30 IST