‘పేట’ మార్కెట్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

ABN , First Publish Date - 2022-07-07T06:11:59+05:30 IST

ఈ-నామ్‌ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు లభించిందని వరంగల్‌ రీజియన్‌ మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మల్లేశం తెలిపారు.

‘పేట’ మార్కెట్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
ఈ-నామ్‌ విధానం అమలు తీరు వివరిస్తున్న అధికారులు

 ‘ఈ-నామ్‌’ అమలులో రెండో ర్యాంకు

 వరంగల్‌ రీజియన్‌ మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మల్లేశం  వెల్లడి

సూర్యాపేట సిటీ, జూలై 6: ఈ-నామ్‌ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు లభించిందని వరంగల్‌ రీజియన్‌ మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మల్లేశం తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.డి ఇఫ్తేకార్‌ నజీర్‌తో కలిసి ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ-నామ్‌ విధానం అమలు తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 57వ్యవసాయ మార్కెట్లలో ఈ-నామ్‌ విధానం అమలవుతోందన్నారు. కేస ముద్రం మార్కెట్‌ జాతీయ స్థాయికి ఎంపికకాగా, నిజామాబాద్‌ మార్కెట్‌కు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు, సూర్యాపేట మార్కెట్‌కు రెండో ర్యాంకు లభించిందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లు ఈ-నామ్‌ విధానంలో జాతీయస్థాయి అవార్డుకు పోటీ పడ్డాయన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ జాతీయస్థాయి అవార్డు దక్కిందన్నారు. ఆన్‌లైన్‌లో రైతులకు నగదు చెల్లింపులను కేసముద్రం మార్కెట్‌ అధికారులు సమర్థంగా అమలు చేస్తుండటంతో ఉత్తమ ఈ-నామ్‌ విధానం కేటగిరిలో జాతీయ స్థాయి అవార్డు దక్కిందన్నారు. 


మార్కెట్‌ను సందర్శించిన మార్కెటింగ్‌ శాఖ అధికారులు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.డి ఇఫ్తేకార్‌ నజీర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ వై.జే పద్మ హర్ష  సందర్శించారు. మార్కెట్‌లో అమలవుతున్న ఈ- నామ్‌ విధానాన్ని ఈ- నామ్‌ పర్యవేక్షకురాలు పుష్పలత, మార్కెట్‌ కార్యదర్శి ఎండీ ఫసియోద్ధీన్‌ వారికి వివరించారు. రైతులు మార్కెట్‌కు తీసుకొస్తున్న ప్రతి వ్యవసాయ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ చేస్తున్నట్లు తెలిపారు. గేట్‌ ఎంట్రీ, ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌, తేమశాతం, వ్యవసాయ ఉత్పత్తులకు బార్‌కోడ్‌ కేటాయింపులు ప్రతిదీ ఆన్‌లైన్‌ ద్వారానే క్రయవిక్రయాలు సాగుతాయన్నారు. మార్కెట్‌ చైౖర్‌పర్సన్‌ ఉప్పల లలిత మాట్లాడుతూ ఈ- నామ్‌ విధానం ద్వారా రైతులకు మార్కెట్‌ లో మంచి ధరలు వస్తున్నాయని అన్నారు. మార్కెట్‌ లో ఈ- నామ్‌ విధానం ను సమర్థవంతంగా అమలు చేయడంలో మార్కెట్‌ అధికారుల పాత్ర కీలకమైయిందని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు అవార్డు కోసం మార్కెట్‌ అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు.

Updated Date - 2022-07-07T06:11:59+05:30 IST