రాష్ట్రంలోకి కృష్ణా జలాలు!

ABN , First Publish Date - 2020-07-13T08:48:00+05:30 IST

రాష్ట్రానికి కృష్ణా జలాల రాక మోదలైంది. కర్ణాటకలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం దిగువకు చేరుకుంటోంది. మరోవైపు మన రాష్ట్రంలోని జూరాల

రాష్ట్రంలోకి కృష్ణా జలాలు!

  • కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల
  • నిండు దశకు చేరుకున్న జూరాల
  • ఒకట్రెండు రోజుల్లో శ్రీశైలానికి వరద


హైదరాబాద్‌/గద్వాల, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి కృష్ణా జలాల రాక మోదలైంది. కర్ణాటకలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం దిగువకు చేరుకుంటోంది. మరోవైపు మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు కూడా నిండు దశకు చేరుకోవడంతో ఒకట్రెండు రోజుల్లో శ్రీశైలానికి వరద నీరు వచ్చే అవకాశం ఉంది.  ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆల్మట్టిలోకి 75 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ఆదివారం 70 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు. ఆదివారం ఉదయానికి 95 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వర్షాల సీజన్‌ ఇంకా చాలా మిగిలి ఉండడంతో ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఆదివారం 930 క్యూసెక్కుల నీటిని కాల్వల ద్వారా, మరో 35,000 క్యూసెక్కుల నీటిని పవర్‌ హౌజ్‌ ద్వారా దిగువకు విడుదల చేశారు. ఈ నీరు నేరుగా దిగువలోని నారాయణపూర్‌లోకి వస్తోంది. నారాయణపూర్‌ ప్రాజెక్టు గేట్లను ఆదివారం ఉదయం ఎత్తి.. 11,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా నేరుగా జూరాల ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో జూరాల కూడా నిండే దశకు చేరుకుంది. 9.66 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 8 టీఎంసీల నీరు ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1400 క్యూసెక్కుల నీటిని కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు కూడా వరద వస్తోంది. ఇందులో ఆదివారం 24,497 టీఎంసీల వరద నమోదైంది. శ్రీశైలానికి ఆదివారం 2,557 క్యూసెక్కుల వరద నమోదైంది. ర మరోవైపు గోదావరిలోనూ ఆదివారం వరద నమోదైంది. ఎగువలోని శ్రీరాంసాగర్‌లోకి 11,102 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.55 టీఎంసీల నీటి నిల్వ ఉంది.  గోదావరి బేసిన్‌లోని నిజాంసాగర్‌, సింగూరు, కడెం, ఎల్లంపల్లిల్లోకి పెద్దగా వరద రావడం లేదు. అయితే దిగువలో ప్రాణహిత కలిసిన తర్వాత అంటే.. మేడిగడ్డ వద్ద భారీ వరద ప్రవాహం నమోదవుతోంది. ఆదివారం 75 వేల క్యూసెక్కులకు పైగా వరద నమోదైంది.

Updated Date - 2020-07-13T08:48:00+05:30 IST