ఉన్మాద పాలన

ABN , First Publish Date - 2020-02-20T10:06:40+05:30 IST

ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, తప్పుడు కేసులు బనాయించడం, పేదల కడుపు కొట్టడం వంటి చర్యలతో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్మాద పాలన సాగిస్తున్నారని...

ఉన్మాద పాలన

  • పేదల కడుపు కొడుతున్నారు
  • ప్రత్యర్థులపై తప్పుడు కేసులు
  • ఆర్థిక మూలాలపై దాడులు
  • స్థానిక ఎన్నికల్లో వైసీపీని 
  • చిత్తుచిత్తుగా ఓడించండి
  • ‘వేదిక’ కూల్చిననాడే తిరగబడితే
  • ఇంత బరితెగించేవారు కాదు
  • జే-ట్యాక్స్‌ కడితేనే మంచి మద్యం 
  • ఇక జుట్టుకు, చొక్కాకూ పన్ను
  • చైతన్య యాత్రలో బాబు ధ్వజం


ఒంగోలు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, తప్పుడు కేసులు బనాయించడం, పేదల కడుపు కొట్టడం వంటి చర్యలతో ముఖ్యమంత్రి జగన్‌ ఉన్మాద పాలన సాగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయన దూకుడు తగ్గాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపిచ్చారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీడీపీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలను ప్రారంభించింది.


చంద్రబాబు దీనికి ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు బొప్పూడి నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ వారు పోటీచేసేందుకు భయపడే విధంగా పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేశారని విమర్శించారు. ‘పేదల కడుపుకొట్టే విధంగా పింఛన్ల రద్దు, చంద్రన్న బీమాలాంటి ప్రజోపయోగ పథకాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అమరావతిని చంపేశారు. పోలవరాన్ని ముందుకు సాగనివ్వడం లేదు. ప్రజలు చైతన్యవంతులై పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించకపోతే జగన్‌ ఉన్మాద చర్యలకు అడ్డూఅదుపూ లేకుండాపోతుంది’ అని సూచించారు.


‘అమరావతిలో ప్రజావేదిక కూల్చినప్పుడే జనం తిరగబడి రోడ్డుపైకి వచ్చి తీవ్ర నిరసన తెలిపి ఉంటే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగేది కాదు. వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు ఈ 9నెలల పాలనపై మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. వైసీపీకి చెందిన దొంగలు ఇసుక అమ్మకాల నుంచి అన్నింటిలోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. సాక్షాత్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా ఇసుక అమ్ముకుంటున్నారు. పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి ఒక కాంట్రాక్టర్‌. ఆయన వ్యవహారశైలి చూస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు ఉంది. జె(జగన్‌)ట్యాక్స్‌ కడితేనే మంచి మద్యం మార్కెట్‌లోకి వస్తోంది. లేకపోతే నాసిరకం మద్యం ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా గ్రానైట్‌ వ్యాపారులపై రూ.1900 కోట్ల జరిమానా విధించారు. రాజకీయ కక్ష, జిల్లాపై కోపంతోనే టీడీపీకి చెం దిన శిద్దా రాఘవరావు, గొట్టిపాటి రవికుమార్‌లకు భారీ గా ఫైన్‌ వేశారు’ అని మండిపడ్డారు.


ఇంకా ఏమన్నారంటే.. నా జీవితం తెరిచిన పుస్తకం

‘నన్ను ఇబ్బందిపెట్టేందుకు లేనిపోని ఆరోపణలతో అవినీతి మకిలీ అంటించేందుకు యత్నిస్తున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టాలని చూసినా ఎలుక తోక బొచ్చు కూడా దొరకలేదు. నా జీవితం తెరిచిన పుస్తకం. నా భద్రతను తొలగిస్తారట. తొలగిస్తే చూస్తా. ప్రజలే కాపాడుకుంటారు. అమరావతి కోసం వీరోచితంగా పోరాడిన శాసనమండలి చైర్మన్‌ షరీ్‌ఫను, టీడీపీ ఎమ్మెల్సీలను లోబరచుకునేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. మీరిచ్చే శక్తితో రౌడీరాజ్యాన్ని అంతమొందించేందుకు ఈ ప్రజాచైతన్య యాత్రను రాష్ట్రమంతా కొనసాగిస్తా.’


అడుగడుగునా ఘనస్వాగతం 
చంద్రబాబు జిల్లాలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర తొలి రోజు ప్రకాశం జిల్లాలో విజయవంతంగా 60 కిలోమీటర్ల మేర సాగింది. మార్టూరు నుంచి ఒంగోలు వరకు దారిపొడవునా ప్రజలు ఘనస్వాగతం పలికారు.   


బొప్పూడిలో శంఖారావం
చిలకలూరిపేట: ప్రకాశం జిల్లా బయల్దేరిన చంద్రబాబుకు.. మార్గమధ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు ఏఎంజీ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను రద్దు చేయాలని నిరసన ప్రదర్శన చేసి.. చంద్రబాబుకు వినతిపత్రం అందించారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కూడా విజ్ఞాపన అందజేశారు. తర్వాత బొప్పూడి  పరిధిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో బాబు పూజలు నిర్వహించారు. గుడి వద్ద ప్రత్యేక వాహనంపై శంఖం పూరించి ఆయన మార్టూరు బయల్దేరారు.

‘పాల’వృద్ధి మా ప్రభుత్వ ఘనతే
నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు గణాంకాల ప్రకారం 55ు పాల దిగుబడితో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే పాల ఉత్పత్తిలో 4వ స్థానాన్ని పొందడం సంతోషాన్నిచ్చిందని ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. ‘2014జూన్‌కు ముందు పాల ఉత్పత్తిలో 24ు వృద్ధి ఉంటే, టీడీపీ ఐదేళ్ల పాలనలో దాన్ని 2019నాటికి రెట్టింపు చేశాం. దేశంలో సగటున ఏడాదికి 6ు వృద్ధి ఉంటే, ఏపీలో 11.72ుగా ఉందంటే ఐదేళ్లలో మేం చేసిన కృషికి నిదర్శన’మని వివరించారు. కానీ గత 9నెలల్లో అవన్నీ ఆపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనురెప్పల్ని సైతం మాయ చేయగల వైసీపీ నేతలు, కంటి వెలుగు పథకం అంటే ఏదో కొత్త పథకం అన్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-02-20T10:06:40+05:30 IST