దేశానికే దిక్సూచి

ABN , First Publish Date - 2020-06-03T09:48:11+05:30 IST

సంక్షేమంపై తెలంగాణ ప్రజలకిచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం

దేశానికే దిక్సూచి

ఆరేళ్లలో అభివృద్ధిలో అగ్రగామిగా అవతరించిన తెలంగాణ

సీఎం కేసీఆర్‌ పోరాట పటిమతోనే స్వరాష్ట్రం సాకారం

సంక్షేమంలో ప్రజలకిచ్చిన ప్రతీ మాటా నిలబెట్టుకున్నాం

ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు నీళ్లు

ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఇక్కడ అమలు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం నీళ్లతో నివాళులు

నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు


సిద్దిపేట టౌన్‌, జూన్‌ 2: సంక్షేమంపై తెలంగాణ ప్రజలకిచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని రంగధాంపల్లి వద్ద అమరవీరుల స్థూపాన్ని కాళేశ్వరం జలాలతో అభిషేకించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున చెప్పినట్లే ఈ ఏడాది గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాను ముద్దాడాయని చెప్పారు. ఇటీవలే అత్యంత ఎత్తుగల ప్రాంతమైన కొండపోచమ్మ ప్రాజెక్టుకు గోదావరి నీటిని సీఎం కేసీఆర్‌ విడుదల చేశారని తెలిపారు. కేసీఆర్‌ దీక్ష ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రకటణ చేసిందన్నారు. దీక్ష వేదిక అయిన రంగాధాంపల్లికి కేసీఆర్‌ వస్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్టు చేసినా, ఆయన పట్టు వదలకుండా దీక్ష కొనసాగించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.


ఆయన దీక్ష ఫలితంగానే డిసెంబరు 9, 2009న కేంద్రాన్ని కదిలించారని వివరించారు. నీళ్లు, నిధులు, నియమాకాల కోసం తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసిందని, నేడు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఆ ఫలాలను ఒక్కొక్కటిగా సాధించుకున్నట్లు వివరించారు. కేసీఆర్‌ అకుంఠిత దీక్ష, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాల ఫలితంగానే రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ పోరాటంలో ప్రొఫెసర్లు, యువకులు పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు కావాలని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులయ్యారని, వారందరికీ జోహర్లు అర్పిస్తునట్లు తెలిపారు. 


అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా సీఎం నాయకత్వం 

ప్రొఫెసర్‌ జయశంకర్‌, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుందని హరీశ్‌రావు చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా, దిక్సూచిలా మారిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తున్నాయని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందిస్తున్నామని, అంతేకాకుండా రైతుబంధు, రూ.5 లక్షల రైతుబీమా అందిస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గ్రామాలను, పట్టణాలను అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమన్ని చేపట్టినట్లు వెల్లడించారు. అందుకు కావాల్సిన నిధులు, సిబ్బంది, వాహనాలను కూడా ప్రభుత్వం సమకూర్చిందని వివరించారు.


కరోనా విపత్తును ఎదుర్కుంటూనే, అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సీపీ జోయల్‌డేవిస్‌, ఇంజనీర్లు, అధికారులు రాత్రింబవళ్లు కృషి చేసి ప్రతి గ్రామంలోని చెరువుకు గోదావరి జలాలను అందించారని పేర్కొన్నారు. రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌, గౌరవెళ్లి, అనంతగిరి ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తికావడంలో కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు నిండు మనస్సుతో భూములిచ్చిన ప్రతి రైతును అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. భూహులిచ్చిన రైతులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సెన్‌, రఘోత్తంరెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్‌, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T09:48:11+05:30 IST