అన్నింటా అభివృద్ధిలో రాష్ట్రం

ABN , First Publish Date - 2022-01-27T08:26:16+05:30 IST

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో శీఘ్రగతిన అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

అన్నింటా అభివృద్ధిలో రాష్ట్రం

  • రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరణ.. 
  • ఫార్మా, మెడికల్‌, ఐటీ హబ్‌గా హైదరాబాద్‌
  • రాష్ట్రానికి కేంద్రం 8 మెడికల్‌ కాలేజీలిచ్చింది
  • మోదీ నేతృత్వంలో ముందుకెళ్తున్న దేశం
  • గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై 


హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో శీఘ్రగతిన అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రం రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా ఎదిగిందని, రాష్ట్ర రైతాంగం అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు సాధించి, లక్షలాది మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించిందన్నారు. హైదరాబాద్‌.. ఫార్మా హబ్‌, ఐటీ హబ్‌, మెడికల్‌ హబ్‌గా ఎదిగిందని, ఇక్కడ ప్రపంచ స్థాయి కార్పొరేట్‌ సంస్థలు ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం 73వ గణతంత్ర వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లతో రాష్ట్రంలోని వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. కేంద్రం కూడా రాష్ట్రానికి పలు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి 8 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసిందని తెలిపారు. భారత రాజ్యాంగం సమగ్రమైనదని, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించిన బీఆర్‌ అంబేడ్కర్‌ లాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  


రోజురోజుకూ బలోపేతమవుతున్న దేశం 

ఆత్మ నిర్భర్‌ స్ఫూర్తితో ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం వివిధ రంగాల్లో ముందుకు వెళుతోందని, గొప్ప గొప్ప మార్పులు సంభవిస్తున్నాయని గవర్నర్‌ అన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేయడమే కాకుండా, ఉచితంగా పంపిణీ చేయడం దేశ స్వయం సమృద్ధికి తార్కాణమన్నారు. ఇప్పటికే ప్రజలకు 160 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను వేసిందని, త్వరలో 200 కోట్ల డోసులకు చేరబోతుందని వివరించారు. దేశీయంగా తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని 150కి పైగా దేశాలకు సరఫరా చేసిందని గుర్తు చేశారు. ప్రపచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు సహకరించిన దేశ శాస్త్రవేత్తలు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.


దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రోజు రోజుకూ బలోపేతమవుతోందని, ఆత్మ నిర్భర్‌ స్కీమ్‌తో రక్షణ రంగ అవసరాలూ తీరుతున్నాయన్నారు.  ప్రగతి ఫలాలు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అందాలని, అందరికీ సమాన అవకాశాలు దక్కేలా నిరంతరంగా శ్రమించాలని అన్నారు. రాజ్‌భవన్‌ ద్వారా కూడా వివిధ కార్యక్రమాలను ప్రారంభించి అమలు చేస్తున్నామని తెలిపారు. గిరిజన తెగలకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని ఆదిలాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ప్రారంభించామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి వికా్‌సరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు గవర్నర్‌ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండులోని యుద్ధ వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కాగా, రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవం సాదాసీదాగా జరిగింది. ఉదయం 7.07 గంటలకు కార్యక్రమం ప్రారంభమై 7.22 కల్లా  కేవలం 15 నిమిషాల్లోనే ముగించేశారు.  


ప్రగతి భవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

ప్రగతి భవన్‌, బీఆర్కే భవన్‌లో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత  అంబేడ్కర్‌ చిత్రపటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్‌ సోమే్‌షకుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం పరేడ్‌ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర తాతాల్కిక సచివాలయమైన బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  

Updated Date - 2022-01-27T08:26:16+05:30 IST