రాజకీయ ప్రేరణతోనే కేసులు

ABN , First Publish Date - 2021-02-26T08:46:53+05:30 IST

ప్రభుత్వ విధానాలు, అవినీతి, దోపిడీపై ప్రశ్నించకుండా చేయడం కోసమే పౌరహక్కుల నేతలు, న్యాయవాదులు, రచయితలు, మహిళా ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం ఐపీసీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయించిందని...

రాజకీయ ప్రేరణతోనే కేసులు

  • అవినీతి, దోపిడీలపై గొంతెత్తకుండా చేయడానికే
  • హైకోర్టులో పౌరహక్కుల నేతల తరఫు న్యాయవాదుల వాదనలు
  • ప్రభుత్వ వాదనల కోసం విచారణ సోమవారానికి వాయిదా 

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విధానాలు, అవినీతి, దోపిడీపై ప్రశ్నించకుండా చేయడం కోసమే పౌరహక్కుల నేతలు, న్యాయవాదులు, రచయితలు, మహిళా ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం ఐపీసీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజకీయ ప్రేరణతోనే కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారన్నారు. నిరుపేదలు, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై కక్షపూరితంగా కేసులు నమోదు చేయడం సరికాదని ఆక్షేపించారు. పిటిషనర్లపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు వాదనలు గురువారం ముగియడంతో, ప్రభుత్వం తరఫు వాదనలు వినేందుకు న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రరాయ్‌ గురువారం ఆదేశాలిచ్చారు. మావోయిస్టులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే కారణంతో విశాఖ జిల్లా ముంచంగిపట్లు పోలీసులు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీసులు ఉపా చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద తమ మీద నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పౌరహక్కుల సంఘం కార్యదర్శి, న్యాయవాది చిలుకా చంద్రశేఖర్‌, అధ్యక్షుడు చిట్టిబాబు, విరసం సభ్యులు పినాక పాణి, వరలక్ష్మి, కులపోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌, మరికొంతమంది న్యాయవాదులు తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వి.రఘునాథ్‌, ఎన్‌.కృష్ణారావు, సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేవారి గొంతు నొక్కేందుకే కేసులు పెడుతున్నట్టు తెలిపారు. జైళ్లలో ఉన్న వారికి న్యాయసహాయం చేసే వీలు లేకుండా న్యాయవాదులపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆక్షేపించారు. 


Updated Date - 2021-02-26T08:46:53+05:30 IST