గర్జించారు...!

ABN , First Publish Date - 2022-01-21T06:15:57+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మూడేళ్లపాటు ప్రభు త్వ ఉద్యోగుల డిమాండ్లు, పీఆర్సీపై నాన్చుతూ వస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు మొదటి నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటించినా, దీనివల్ల జీతాలు పెరగడం మాటే మోగాని తగ్గిపోతున్నాయని ఉద్యోగులు గ్రహించి ఆందోళన బాట పట్టారు.

గర్జించారు...!
తిరోగమన పీఆర్సీని వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్‌వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

  • పీఆర్సీ డిమాండ్‌పై కదంతొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
  • జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌ ముట్టడికి ఆరు వేల మందికిపైగా రాక
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాల హోరు
  • తిరోగమన పీఆర్సీపై ప్రభుత్వం వెనక్కు తగ్గేవరకు ఉద్యమిస్తామని హెచ్చరిక
  • అర్ధరాత్రి జీవోలు, అసంబద్ధ నిర్ణయాలు రద్దుచేయాలని డిమాండు
  • గతంలో 13 రోజుల సమ్మె తరహాలోనే ఈసారీ తడాఖా చూపిస్తామని గర్జన
  • ఆందోళనకు మద్దతు పలికిన సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ ట్రేడ్‌ యూనియన్‌లు, ప్రజా సంఘాలు 
  • ముట్టడికి వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు
  • కాకినాడ చుట్టూ పోలీసుల బారికేడ్లు
  • అయినా ఛేదించి ముట్టడిని విజయవంతం చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అసంబద్ధ పీఆర్సీకి వ్యతిరేకంగా జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా కాకినాడకు తరలి వచ్చి గర్జించారు. తిరోగమన పీఆర్సీకి వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. అర్ధరాత్రి జీవోలు రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కనివినీఎరుగని రీతిలో ఆరువేల మందికిపైగా ఉద్యోగులు హాజరై ఉమ్మడి గళంతో గర్జించారు. దీంతో కాకినాడ కలెక్టరేట్‌ దద్దరిల్లింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు గురువారం వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలుగెత్తారు. న్యాయబద్ధంగా ఉద్యోగులకు రావలసిన ప్రయోజనాల నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటే ఊరుకునేది లేదని వేలాదిమంది ఉద్యోగులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కాగా ముట్టడికి ఎక్కడికక్కడ ఉద్యోగులు రాకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలమైంది. 

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మూడేళ్లపాటు ప్రభు త్వ ఉద్యోగుల డిమాండ్లు, పీఆర్సీపై నాన్చుతూ వస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు మొదటి నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటించినా, దీనివల్ల జీతాలు పెరగడం మాటే మోగాని తగ్గిపోతున్నాయని ఉద్యోగులు గ్రహించి ఆందోళన బాట పట్టారు. డీఏ బకాయి పెరగడంతోపాటు, డీఏ మొత్తాన్ని కూడా ప్రభుత్వం తగ్గించడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపట్టా యి. అందులోభాగంగా తిరోగమన పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో పిలుపుమేరకు గురువారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులంతా కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆరు వేల మందికిపైగా జిల్లానలుమూలల నుంచి తరలివచ్చారు. దీంతో ఉదయం ఎనిమిది గంటలకే కాకినాడ హోరెత్తింది. ఎక్కడి కక్కడ ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడే గేటు ఎదుట గంటల తరబడి బైఠాయించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి జీవోలు మాకొద్దు, అసంబద్ధ పీఆర్సీని రద్దు చేయాలం టూ ఉద్యోగులంతా నినాదాలు చేశారు. మూడేళ్లు సాగదీసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన పీఆర్సీ అత్యం త దారుణంగా ఉందని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు మం డిపడ్డాయి. నిరంకుశంగా ప్రకటించిన తిరోగమన పీఆర్సీపై ప్రభు త్వం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్‌ చేశాయి. తమ న్యాయ మైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళనబాట వీడమని స్పష్టంచేశాయి. ఈ ముట్టడి కార్యక్రమానికి జిల్లాలోని యూటీఎఫ్‌, బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌, సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర ట్రేడ్‌ యూనియన్‌లు, వివిఽధ ప్రజా సంఘాలు మద్దతు  తెలిపాయి. ఈ సందర్భంగా ముట్టడికి తరలివచ్చిన వేలాది మంది ఉద్యోగులను ఉద్దేశించి ఎమ్మెల్సీ ఇళ్ల వెంక టేశ్వరరావు ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్య పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని మండిపడ్డారు. మూడేళ్లు ఊరించిన తర్వాత తాజాగా ప్రకటించిన తిరోగమన పీఆర్సీ పై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రకటించిన పీఆర్సీ ఉత్తమ పీఆర్సీగా జగన్మోహన్‌రెడ్డి పూజారిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం అత్యంత బాధాకరమన్నారు. అనంతరం ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ చెవ్వూరి రవి, కార్యదర్శి బొజ్జ శరత్‌, ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ గత 43 శాతం పీఆర్సీ తగ్గకుండా ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తదితర ప్రయోజనాలు రాబట్టేలా జేఏసీ నాయకులు ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం దిగిరాకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ విషయంలో ఏపీ సర్కారు చేసే అన్యాయంపై ఉద్యోగులంతా కలిసికట్టు గా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఉద్యోగుల నిరసనలతో ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్‌లో ఉద్యోగులంతా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్టీయూ రాష్ట్ర కోశాధికారి పి.సుబ్బరాజు, యూ టీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌వర్మ, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ రాఘ వులు మాట్లాడుతూ వేల మంది ఉపాధ్యాయలు జిల్లా నలుమూలల నుంచి వచ్చి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేశారన్నారు. భయంకరమైన కొవిడ్‌ను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని కొనియాడారు. గతంలో ఇచ్చినవిధంగా హెచ్‌ఆర్‌ఏ శ్లాబును యథావిధిగా కొనసాగించి, 30 శాతం ఫిట్మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీఐటీ యూ రాష్ట్ర నాయకు రాలు జి. బేబిరాణి మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహ రిస్తున్న తీరు దుర్మార్గమన్నారు. పీఆర్సీ విషయంలో అన్యాయం చేస్తుంటే సహించేది  లేదన్నారు. ఒక పక్క ప్రజలపై భారాలు మోపుతూ మరో వైపు ఉద్యోగుల ప్రయోజనాలను తగ్గించడం సరికాదన్నారు. తమ హక్కు ల్ని సాధించుకోవడం కోసం పోరాడుతున్న ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. సీపీఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజ శేఖర్‌ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పునరాలోచించుకో వాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్‌ ఉద్యోగులకు మద్దతు తెలిపి అనంతరం ప్రసంగించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యో గులు తమ ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా  విరమించారు. కార్య క్రమంలో సీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, కో చైర్మన్లు నాగి రెడ్డి శివప్రసాద్‌, కె. సుబ్రహ్మణ్యం, టి. వెంకట్రావు, ఎస్టీయూ కోశాధికారి పి. సుబ్బారావు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్త శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి కూర్మారావు, పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లంక జార్జ్‌, ఏపీటీఎఫ్‌ (257)జిల్లా అధ్యక్షుడు ఫిలిప్‌రాజు, సీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మునిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ముట్టడి  సందర్భంగా జడ్పీ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ ఉద్యోగులను అడ్డుకునేందుకు బారికేడ్లు అడ్డుగా ఉంచారు. మరోపక్క కలెక్టరేట్‌ ముట్టడికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది ఉద్యోగులు తరలిరావడంతో కాకినాడ- సామర్లకోట రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఇతర మార్గాల ద్వారా ట్రాఫిక్‌ మళ్లించారు. ఇక కలెక్టరేట్‌ ముట్టడికి రాకుండా తుని సహా అనేక మండలాల్లో ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే ఆయా సంఘాల నేతల ఇళ్లకు నోటీసులు అందించారు. అయినా లెక్కచేయకుండా వేలాదిమంది కలెక్టరేట్‌కు తరలివచ్చారు.

Updated Date - 2022-01-21T06:15:57+05:30 IST