వేతన బకాయిలు ఒకేసారి చెల్లించలేం!

ABN , First Publish Date - 2020-09-16T09:26:34+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి వాయిదా వేసిన సొమ్మును తిరిగి చెల్లించే అంశం సీఎం కేసీఆర్‌ ..

వేతన బకాయిలు  ఒకేసారి  చెల్లించలేం!

ఎలా అన్నదానిపై నెలాఖరులోగా నిర్ణయం

సీఎం పరిశీలనలో వాయిదాలుగా చెల్లింపు 

5 నెలల్లో 49,131 కోట్ల రాబడే వచ్చింది

ఐజీఎస్‌టీ, ఆర్థిక సంఘం నిధులు రాలేదు

కేంద్రం నుంచి 10,095 కోట్లు రావాలి

శాసనమండలిలో మంత్రి హరీశ్‌

‘తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ 

ఎమర్జెన్సీ బిల్లు-2020’కు ఆమోదం


హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి వాయిదా వేసిన సొమ్మును తిరిగి చెల్లించే అంశం సీఎం కేసీఆర్‌ పరిశీలనలో ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ నెల 30లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకేసారి ఈ సొమ్మును చెల్లించడం సాధ్యం కాదని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర రాబడులు తగ్గడం, కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎ్‌సటీ, ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో కొంత సొమ్మును వాయిదా(డిఫర్‌మెంట్‌) వేశామని వివరించారు. అప్పట్లో శాసనసభ జరగనందున బిల్లును ప్రవేశపెట్టలేకపోయామని, దాని స్థానంలో ఆర్డినెన్స్‌ను తెచ్చామని, ఇప్పుడు సభలో స్పెషల్‌ ప్రొవిజన్‌ బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. ఉద్యోగుల వేతనాలు, రిటైర్డు ఉద్యోగుల పింఛన్లను వాయిదా వేస్తూ తీసుకొచ్చిన ‘తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ (స్పెషల్‌ప్రొవిజన్‌) బిల్లు-2020’ను మంగళవారం హరీశ్‌రావు శాసనమండలిలో ప్రవేశపెట్టారు.


దీన్ని మండలి ఆమోదించింది. కరోనా నేపథ్యంలో ప్రజలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించాయని హరీశ్‌ చెప్పారు. దీంతో ఆదాయాలు తగ్గిపోయాయని, ఏప్రిల్‌లో కేవలం రూ.962 కోట్లు మాత్రమే రాబడి వచ్చిందని తెలిపారు. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఈ ఐదు నెలల్లో రూ.75,125 కోట్లు రావాల్సి ఉంటే, రూ.49,131 కోట్లే వచ్చాయని చెప్పారు. ఇదే కాలానికి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఈసారి రూ.7851 కోట్ల రాబడి తగ్గిందన్నారు. వాస్తవానికి 15 శాతం వృద్ధి రేటు ఉండాలని చెప్పారు. కానీ, రాబడి గణనీయంగా తగ్గిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం చొప్పున చెల్లింపులను వాయిదా వేశామని హరీశ్‌ తెలిపారు. ఈ వాయిదా సొమ్మును ఎప్పుడు చెల్లిస్తారన్న సందేహాలు సభ్యులకు రావడం సహజమేనన్నారు. ‘‘ఈ నెలాఖరులోగా వాయిదా సొమ్మును చెల్లించాల్సి ఉంది. ఏ పద్ధతిలో చెల్లిస్తామన్నది కూడా చెప్పాల్సి ఉంది. ఎవరెవరికి ఎలా చెల్లించాలనేది చూస్తాం.


ఒక్క నెలలో మొత్తం సొమ్మును చెల్లించాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాదు. దాన్ని ఎలా చెల్లించాలనే అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉంది. ఈ నెల 30లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇది వాయిదా మాత్రమే తప్ప కోత కాదు’’ అని హరీశ్‌ వివరించారు. ‘‘ఇది మన రాష్ట్రంలోనే కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా వేతనాలను వాయిదా వేసింది. ఇతర రాష్ట్రాల్లోనూ వాయిదా వేశారు. వీలైనంత త్వరగా ఈ వాయిదాలను చెల్లించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇంకా స్పష్టత లేదు.’’ అని చెప్పారు.


కేంద్రం నుంచి రూ.6016 కోట్ల జీఎస్టీ రావాలి

కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన జీఎ్‌సటీ సొమ్ము రూ.6016 కోట్లు అని హరీశ్‌ తెలిపారు. ఇవి ఇప్పటివరకు రాలేదని, ఎప్పుడు వస్తాయో కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. మొత్తం కలిపి కేంద్రం నుంచి రూ.10,095 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.  మరోవైపు ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని, ఈ ఐదు నెలల్లో కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిదానికంటే అదనంగా రూ.5000 కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘దేశ జీడీపీ చివరి 8 త్రైమాసికాల్లో గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం మైనస్‌ 23.9కి పడిపోయింది. కానీ, తెలంగాణ మాత్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండంకెల వృద్ధి రేటు సాధించింది. ప్రస్తుతం 12.06 వృద్ధిరేటు ఉంది’’ అని హరీశ్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తప్పకుండా పెంచుతామని తెలిపారు.


పరిమితికిలోపే అప్పులు ’

కేంద్రప్రభుత్వ అనుమతితో, పరిమితిలోపే అప్పులు తెచ్చామని హరీశ్‌ తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం లక్షల్లో అప్పులున్నాయని అంకెల గారడీలు చేస్తున్నాయని విమర్శించారు. శాసనసభలో వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా హరీశ్‌ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.1,54,557 కోట్ల అప్పు ఉందన్నారు.


గత ఐదేళ్లలో రూ.34,296 కోట్లను తిరిగి చెల్లించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, అప్పులను వేర్వేరుగా చూడొద్దని, కలిపి చూడాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు జీఎ్‌సడీపీ రూ.4.52 లక్షల కోట్లు మాత్రమేనని, ప్రస్తుతం అది 11,05,349 కోట్లకు పెరిగిందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేయడం తప్పు కాదన్నారు. తమకు మంచి పేరు రావడం లేదని, ప్రతిపక్ష హోదా పోయిందనే బాధలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ చివరి నుంచి రెండోస్థానంలో ఉందన్నారు.’

Updated Date - 2020-09-16T09:26:34+05:30 IST