Abn logo
May 22 2020 @ 00:00AM

ఆకలి తీరాకే... అన్నీ!

ప్రపంచంలో ప్రసిద్ధ మతాలు  ఉన్నాయి. వాటికి దేవుళ్ళు ఉన్నారు. వందల, వేల ఏళ్ళ ప్రచారం  ఉంది. కానీ ఈనాడు కరోనా పేరు తెలిసినంతగా దేవుళ్ళ పేర్లు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. 


మనుషులను వ్యాధులు చుట్టుముట్టడం కొత్తేమీ కాదు. చుట్టుముట్టిన వ్యాధులను జయించడం కూడా మనుషులకు కొత్తేమీ కాదు. మానవజాతి కాకుండా మరో జీవజాతి అయితే... ఈపాటికి కరోనా కాటుకు కాలగర్భంలో కలిసిపోయేదే! అయినా కాలాన్ని కూడా భయంతో వణికిస్తున్న వ్యాధి ఈ కరోనా! కరోనా దెబ్బను కాచుకోవడానికి లాక్‌డౌన్‌ ఒక అస్త్రం. ఈ అస్త్రం వల్ల కూలిపోయే బతుకులూ ఉన్నాయి. అవే వలస కూలీల బతుకులు. కరోనా అతి త్వరలోనే ఆకలి దేవత కరాళ నృత్యాన్ని విశ్వవేదిక మీద చూపించనుందా? 


మనుషులకు నయం కాని రోగాల్లో ఆకలి ఒకటి. మనిషికి ఆకలి తీరడం ప్రధానం. ఆ తరువాతే - సభలైనా, చర్చావేదికలైనా, సాహిత్యమైనా, రాజకీయమైనా... చివరకు ఆధ్యాత్మిక ప్రవచనమైనా!


బుద్ధుడు ఒకసారి ఓ గ్రామానికి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం అక్కడ ఆయన ధర్మోపదేశం చేస్తాడని తెలిసి, గ్రామ ప్రజలందరూ పెందలకడనే లేచారు. పనులన్నీ ముగించుకొని, సభా ప్రాంగణానికి చేరారు. కానీ ధనుంజయుడు అనే రైతు మాత్రం వేళకు రాలేకపోయాడు.


అతను ఉదయాన్నే పొలానికి వెళ్ళాడు. నాగలితో పొలం దున్నాడు. పొద్దు వంక చూసి సమయం అయింది అనుకొని, ఎడ్లను విప్పాడు. నాగలిని తీసుకువెళ్ళి, ఒక పొదలో భద్రంగా పెట్టి వచ్చేసరికి ఒక ఎద్దు కనిపించలేదు. పక్కనే ఉన్న అడవిలోకి తప్పుకొని పోయింది. దాన్ని వెతికి పట్టుకొని, ఎడ్లను ఇంటికి తోలుకు వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. ఎడ్లను గబగబా చావిట్లో కట్టేశాడు. వాటి గాదెలో మేత వేశాడు. బుద్ధుని ప్రవచనాలు వినాలని బయలుదేరాడు.


‘‘పొద్దుటి నుంచి ఏమీ ముట్టలేదు. కాస్త ఎంగిలి పడి వెళ్ళు’’ అంది ఇల్లాలు.

‘‘లేదు. సమయం మించిపోయింది. నీవు కూడా త్వరగా రా!’’ అని భార్యకు చెబుతూనే, ఇల్లు దాటిపోయాడు ధనుంజయుడు.

అతను వెళ్ళేసరికి బుద్ధ ప్రబోధం సాగుతోంది. తలగుడ్డ విప్పి, చెమటలు కక్కే ముఖాన్ని తుడుచుకొని, ఒక పక్క కూర్చొని వింటున్నాడు.  బుద్ధుడు అతని వాలకం గమనించాడు. తన ప్రసంగాన్ని ఆపేశాడు. సాధారణంగా బుద్ధుడు ప్రసంగాన్ని ప్రారంభించాక మధ్యలో ఆపడు. అలా ఆపడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 

బుద్ధుడు వెంటనే నగర పాలకుణ్ణి పిలిచి, రైతు ధనుంజయుణ్ణి చూపించి- ‘‘ముందు అతణ్ణి తీసుకువెళ్ళి, అన్నం పెట్టించి, తీసుకురా! అప్పటిదాకా బోధ చేయను’’ అన్నాడు.  అలాగే చేశాడు నగర పాలకుడు. రైతు తిని వచ్చాకే, ప్రబోధాన్ని బుద్ధుడు తిరిగి ప్రారంభించాడు. 

ధర్మోపదేశం ముగిసింది. బుద్ధుడి దగ్గరకు నగర పాలకుడు వెళ్ళి- ‘‘భగవాన్‌! ఈ సభలో నగర పెద్దలు ఉన్నారు. రాచబిడ్డలు ఉన్నారు. గ్రామ పాలకులు ఉన్నారు. ఇన్ని వందల మంది సభలో ఉండగా- ఒక్క వ్యక్తి కోసం ప్రసంగాన్ని ఆపారా?’’ అని అడిగాడు ఆశ్చర్యంగా.

‘‘ఉపాసకా! ఆ రైతు ఆకలితో ఉన్నాడు. ఆకలి ఒక భయంకరమైన వ్యాధి. అది ఉన్నంత కాలం మనిషి తన అధీనంలో తాను ఉండడు. దానికి ఔషధం అన్నం మాత్రమే! నా ప్రసంగాలు ఆకలిని మైమరపింపజేసే వినోద సాధనాలు కావు. నా దృష్టిలో ఆకలి తీరాకే ఆధ్యాత్మికత! జనం ఆకలితో అలమటిస్తూ ఉంటే, వారి కడుపులు నింపకుండా ప్రబోధాల ప్రసంగాలు గుప్పించడం మానవీయత కాదు. ఆకలితో అలమటించే ఏ ఒక్క వ్యక్తి ఉన్నా నేను ధర్మప్రసంగాలు చేయను’’ అన్నాడు బుద్ధుడు.

అవును... నిజం... నిజంగా ఈ రోజున కరోనా వల్ల ఆకలికాటుకు బలి అవుతున్న కూలీలు రోడ్ల మీదా, రైలు పట్టాల మీదా బతుకులు ఈడుస్తున్నంత కాలం ధర్మ ప్రబోధాలు వెగటుగానే ఉంటాయి. మానవీయతను వెక్కిరిస్తూనే ఉంటాయి.

-బొర్రా గోవర్ధన్‌


Advertisement
Advertisement
Advertisement