‘బెల్ట్‌’ దందా షురూ

ABN , First Publish Date - 2021-12-09T03:34:40+05:30 IST

మద్యం దుకాణాల లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తై వ్యాపారులు డిసెంబర్‌ 1 నుంచి విక్రయాలు ప్రారంభించారు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈ దఫా మద్యం దుకాణాలకు పోటీ పెరిగింది. గతంలో దుకాణాలు నిర్వహించిన చాలామందికి ఈసారి లక్కీ డ్రాలో దుకాణాలు దక్కలేదు.

‘బెల్ట్‌’ దందా షురూ

- జిల్లాలో 1000కి పైగానే బెల్ట్‌షాపులు

- పలుచోట్లు సిండికేట్‌గా మారిన వ్యాపారులు

- గడ్చిరోలి వైపు స్మగ్లింగ్‌కు అన్ని ఏర్పాట్లు 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

 మద్యం దుకాణాల లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తై వ్యాపారులు డిసెంబర్‌ 1 నుంచి విక్రయాలు ప్రారంభించారు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈ దఫా మద్యం దుకాణాలకు పోటీ పెరిగింది. గతంలో దుకాణాలు నిర్వహించిన చాలామందికి ఈసారి లక్కీ డ్రాలో దుకాణాలు దక్కలేదు. దాంతో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులతో జట్టు కట్టి మద్యం వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో కొందరైతే ఏకంగా కోటి రూపాయలకు పైగా చెల్లించి డ్రాలో దుకాణాలు పొందిన వారినుంచి లైసెన్సులను కొనుగోళు చేసి బినామీ వ్యాపారం ప్రారంభించారు. ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా సిండికేట్‌గా మారి వ్యాపారాలు సాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే అధిక టర్నోవర్‌ సాధించేందుకు కీలకంగా మారిన బెల్ట్‌షాపుల నెట్‌వర్కును పరిధికి మించి విస్తరించేందుకు పావులు కదుపుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మద్యం వ్యాపారుల మధ్య అనారోగ్యకరపోటీ గ్రామాల్లో మద్యం ఏరులై పారేందుకు పరోక్షంగా కారణం కానుంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 32మద్యం దుకాణాలకు ఇటీవల లైసెన్సులు జారీచేశారు. జనాభా ప్రాతిపదికన కేటాయించిన మద్యం దుకాణాలకు అనుబంధంగా ఆయా షాపుల పరిధిలోని గ్రామాలు, ఆవాసాలలో బెల్టు షాపులు నిర్వహించేందుకు ఇప్పటికే నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. అటు టార్గెట్లు పూర్తి చేసుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వస్తోంది. అక్రమ మద్యం వ్యాపారాన్ని నియంత్రించాల్సిన పోలీసులు కూడా వ్యాపారులిచ్చే మామూళ్లకు ఆశపడి కళ్లు మూసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఒక్కో మండలంలో  30-35 ప్రధాన బెల్టుషాపులు, వాటికి అనుబంధంగా మరో రెండు మూడు విక్రయ కేంద్రాలు చొప్పున విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జిల్లాలోని 32దుకాణాల పరిధిలో 1000కి పైగా బెల్టు షాపులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సగటున ఒక్కో మద్యం దుకాణంలో రోజుకు రెండు నుంచి రెండున్నర లక్షల విక్రయాలు జరుగుతున్నల్లు ఎక్సైజ్‌శాఖ చెబుతోంది. ఈలెక్కన ప్రతీనెల 25నుంచి 30కోట్ల మద్యం విక్రయాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కరోనాకు ముందు లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే అప్పట్లో సగటున నెలకు 32కోట్ల వ్యాపారం జరిగేది. ఏడాదికి 122నుంచి 140కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు.

మహారాష్ట్ర పైనే అందరి గురి..

ఆసిఫాబాద్‌ జిల్లాలోని చాలా మండలాలు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండడంతో మద్యం వ్యాపారులు మహారాష్ట్రలోకి రవాణా పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారని చెబుతున్నారు. ఇంతకముందు రెండు డివిజన్లనుంచి మహారాష్ట్రలోకి జోరుగా మద్యం స్మగ్లింగ్‌ జరిగినప్పటికీ ప్రస్తుతం కాగజ్‌నగర్‌ డివిజన్‌ నుంచే అధిక మొత్తం రవాణా జరుగుతోందని చెబుతున్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో మద్యం దుకాణాలను పునరుద్దరించడం ద్వారా ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని వాంకిడి, కెరమెరి, జైనూర్ల నుంచి లిక్కర్‌ విక్రయాలు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు గత త్రైమాసిక  లిక్కర్‌ అమ్మకాలను ఉదాహరణగా చూపుతున్నారు. మహారాష్ట్రలో చంద్రాపూర్‌, గడ్చిరోలి జిల్లాలో మద్యం అమ్మకాలపై నిషేదం అమల్లో ఉండేది. దాంతో వాంకిడి సరిహద్దులోనుంచి చంద్రాపూర్‌ జిల్లాలోకి, కౌటాల, సిర్పూర్‌(టి), రవీంద్రనగర్‌, బెజ్జూర్‌ మద్యం దుకాణాల నుంచి గడ్చిరోలి జిల్లాలోకి పెద్ద ఎత్తున తెలంగాణ మద్యం అక్రమ మార్గాల్లో రవాణా అయ్యేది. ఈకారణంగానే గతంలో జిల్లా మద్యం అమ్మకాల్లో పెరుగుదల కనిపించేదని చెబుతున్నారు. అయితే ఈ దఫా అక్కడి ప్రభుత్వం తెలంగాణ నుంచి మద్యం అమ్మకాలు జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిషేదం నుంచి చంద్రాపూర్‌ జిల్లాను మినహాయించడంతో ఈసారి తెలంగాణ ఎక్సైజ్‌కు అమ్మకాల దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. అయితే గడ్చిరోలి జిల్లాలోకి అక్కడనుండి చత్తీస్‌గఢ్‌లోని పశ్చిమ జిల్లాలకు తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లానుంచే భారీ మొత్తంలో మద్యం రవాణా జరుగుతోంది. ఈ కారణంగానే ఈసారి గడ్చిరోలి జిల్లాకు సరిహద్దుగా ఉన్న చింతలమానేపల్లి మండలం గూడెంగ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా మద్యం దుకాణాన్ని కేటాయించిందని చెబుతున్నారు. ఇటు చంద్రాపూర్‌ జిల్లాలోనూ అక్కడి ప్రభుత్వం నిషేదం ఎత్తివేసినా తెలంగాణ చీప్‌ లిక్కర్‌ కంటే అక్కడి మద్యానికి ధరలు అధికంగా ఉండడంతో బెల్టు నిర్వాహకులు ఆసిఫాబాద్‌ నుంచి ఏకమొత్తంలో అధిక మొత్తాన్ని కొనుగోళు చేసి తీసుకెళ్తున్నారని చెబుతున్నారు.

Updated Date - 2021-12-09T03:34:40+05:30 IST