ఇక మొదలు...!

ABN , First Publish Date - 2021-09-01T06:26:48+05:30 IST

అప్ఘానిస్తాన్‌‌ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్న రెండువారాల తరువాత, భారత ప్రభుత్వంతో తాలిబాన్లు దోహాలో అధికారికంగా జరిపిన తొలిసమావేశం కొత్త ఆశలు రేకెత్తిస్తున్నది...

ఇక మొదలు...!

అప్ఘానిస్తాన్‌‌ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్న రెండువారాల తరువాత, భారత ప్రభుత్వంతో తాలిబాన్లు దోహాలో అధికారికంగా జరిపిన తొలిసమావేశం కొత్త ఆశలు రేకెత్తిస్తున్నది. ఖతార్‌లోని భారత రాయబారితో తాలిబాన్‌ సీనియర్‌ నాయకుడు షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెక్జాయ్‌ మంగళవారం జరిపిన భేటీలో భారత్‌ ఆందోళనలపై గట్టిహామీలే దక్కినట్టు చెబుతున్నారు. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా, త్వరితంగా స్వదేశానికి చేర్చే అంశంతో పాటు, అఫ్ఘాన్‌ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు స్థావరం కానివ్వబోమని కూడా స్టానెక్జాయ్‌ హామీ ఇచ్చారట. భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నామని ఆయన గతంలోనూ అన్నప్పటికీ గంటసేపు సాగిన ఈ భేటీకి ఎంతో ప్రత్యేకత ఉంది.


తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న ఆగస్టు పదిహేను కంటే, అఫ్ఘానిస్థాన్‌నుంచి సంపూర్ణ నిష్క్రమణకు అమెరికా పెట్టుకున్న ఆగస్టు 31వతేదీ గడువును చరిత్ర మరింత బాగా గుర్తుపెట్టుకుంటుంది. చిట్టచివరి అమెరికన్‌ సైనికుడు సోమవారం రాత్రి తరలిపోగానే కాబూల్‌ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు గాలిలోకి కాల్చి సంబరాలు చేసుకున్నారు. విదేశీశక్తుల కబంధ హస్తాలనుంచి దేశం సంపూర్ణ స్వేచ్ఛ పొందిందని వ్యాఖ్యానించారు. 2001 సెప్టెంబరు 11న ఆరంభమైన ‘మిషన్‌’ తాలిబాన్‌తో కుదర్చుకున్న ఒప్పందానికి లోబడి 2021ఆగస్టు 31న సంపూర్ణంగా ముగిసింది కానీ, తాను కాలూనిన, మిగతా ప్రపంచం ఆశించిన లక్ష్యాన్ని మాత్రం అమెరికా సాధించలేకపోయింది. మూటాముల్లె సర్దుకొని తరలిపోయే వారంముందు ఇస్లామిక్‌స్టేట్‌–కె దాడిలో ఒకేమారు 13మంది సైనికులను కోల్పోవలసి రావడం విషాదం.


తాలిబాన్‌ ఏలుబడిలోకి పోయిన అఫ్ఘానిస్థాన్‌తో మిగతా ప్రపంచం కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అఫ్ఘానిస్థాన్‌లో ఉనికిలో ఉన్న పలు గ్రూపులతో పోల్చితే తాలిబాన్‌ శక్తిమంతమైనదే కావచ్చును కానీ, ఐసిస్‌, హక్కాని నెట్‌వర్క్‌ ఇత్యాది సంస్థలను అది నియంత్రించగలిగే అవకాశాలు లేవు. ఆగస్టు 26న ఐసిస్‌–కె జరిపిన దాడి నిజానికి అమెరికా మీద కాదనీ, అది తాలిబాన్‌ ఆధిపత్యానికి సవాలని కొందరంటారు. నిష్క్రమణ విషయంలో అమెరికా తన మాటకు గట్టిగా కట్టుబడివుండేట్టుగా ఈ దాడి చేసిందన్న వాదనలూ ఉన్నాయి. ఏదిఏమైనా, గతంతో పోల్చితే కొత్త అవతారంలో తాలిబాన్‌ కాస్తంత సౌమ్యంగానే కనిపిస్తున్నది. పలు లక్ష్యాలు, ఆంక్షలతో కూడిన భద్రతామండలి తీర్మానానికి కూడా తాలిబాన్‌ సానుకూలంగానే స్పందించింది. దేశంలోని అన్నివర్గాలకూ 


పాలనలో భాగస్వామ్యం ఉంటేనే మీ ఏలుబడిని గుర్తిస్తామన్న ప్రపంచదేశాల హెచ్చరికకు అనుగుణంగా హమీద్‌ కర్జాయ్‌, గుల్బుద్దీన్‌ హెక్మతియార్‌ వంటి నాయకులతో తాలిబాన్‌ చర్చలు జరుపుతున్నది. కొద్దిరోజుల్లోనే అన్నీ సర్దుకుంటాయనీ, ఓపికపట్టాలనీ అక్కడక్కడ కనిపిస్తున్న హింసాత్మక ఘటనలకు తాలిబాన్‌ పెద్దలు వివరణ పూర్వకమైన హామీలు ఇస్తున్నారు. ప్రజలను గౌరవించమనీ, ప్రేమించమనీ, సేవించమనీ తమ యోధులకు చెబుతున్నారు. గతకాలంనాటి ఛాందసాన్నీ, మూర్ఖత్వాన్ని వదిలేశారా అన్నట్టుగా పిల్లలను స్కూలుకు పొమ్మంటున్నారు, వేడుకల్లో ఆటాపాటలని వద్దనడం లేదు. తాలిబాన్‌ను కట్టడిచేయడం, మాటకు కట్టుబడేట్టు చూడటం అవసరమే. కానీ, అసలే కష్టాల కొలిమిలోకి జారుకున్న ఆ దేశాన్ని ఆర్థిక ఆంక్షలతో మరింత హింసపెట్టడం సరికాదు. జీడీపీలో నలభైశాతం విదేశీ సహాయనిధులతో జీవిస్తున్న దేశం ఇప్పుడు డబ్బురాక, ఉన్నది కూడా బ్యాంకుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నది. అఫ్ఘాన్‌ గడ్డను ఏ ఉగ్ర గ్రూపులకూ వేదిక కానివ్వబోమన్న హామీని తాలిబాన్‌ నిలబెట్టుకున్నప్పుడే నిధులు తిరిగి ప్రవహించవచ్చు. కానీ, అవి సుదీర్ఘకాలం నిలిచిపోయినపక్షంలో తాలిబాన్‌ బలహీనపడి మిగతా గ్రూపులు రెచ్చిపోయే ప్రమాదమూ లేకపోలేదు. నయానోభయానో తాలిబాన్‌ను దారికి తెచ్చుకోగలిగి, దానికి మద్దతుగా ఉంటూ దానితోనే వ్యవహరించగలిగితే మిగతా ప్రపంచం కనీసం కొంతకాలం కొంతమేరకైనా ప్రశాంతంగా ఉండగలదు.

Updated Date - 2021-09-01T06:26:48+05:30 IST