మాట నిలబెట్టుకున్న ఎలాన్ మస్క్.. ధన్యవాదాలు తెలిపిన ఉక్రెయిన్!

ABN , First Publish Date - 2022-03-02T01:34:54+05:30 IST

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు.

మాట నిలబెట్టుకున్న ఎలాన్ మస్క్..  ధన్యవాదాలు తెలిపిన ఉక్రెయిన్!

ఇంటర్నెట్ డెస్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. రష్యా దాడుల కారణంగా అంతర్జాల సేవల్లో తీవ్ర అంతరాయాలు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు ఆయన స్టార్ లింక్ పరికరాలను(టర్మినల్స్)‌ను పంపించారు. స్పేస్ ఎక్స్ సంస్థ వీటిని ఉక్రెయిన్‌కు చేరవేసింది. స్టార్ లింక్.. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్న విషయం తెలిసిందే. దీంతో..  సంప్రదాయక మౌలిక వసతులు లేని ప్రాంతాల్లో అత్యంత సులువుగా  ఇంటర్నెట్ సేవలు. ఇక ఉక్రెయిన్‌లో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి తెస్తానని ఇటీవల మాటిచ్చిన మస్క్..  తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.


స్టార్ లింక్ పరికరాలు ఉక్రెయిన్‌కు చేరిన విషయాన్ని ఆదేశ ఉపాధ్యక్షుడు మంగళవారం ధృవీకరించారు. టర్మినల్స్‌తో ఉన్న ఓ ట్రక్కు ఫొటోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘స్టార్ లింక్ వచ్చేసింది. చాలా థ్యాంక్యూ మస్క్’’ అంటూ ట్వీట్ చేశారు. ఇక.. సునామీ కారణంగా ఇటీవల అతలాకుతలమైన టోంగా ద్వీపంలో మస్క్.. శాటిలైట్ అంతర్జాల సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.  ప్రపంచంలో ఏ మూల అయినా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండేలా చేయడమే స్టార్ లింక్ వ్యవస్థ లక్ష్యం. ఇందులో భాగంగా..  మొత్తం 1700 ఉపగ్రహాలను ఏర్పాటు చేశారు. స్టార్‌లింక్‌ ప్రస్తుతం ప్రపంచమంతటా వ్యాపించినప్పటికీ.. కొన్ని దేశాలు మాత్రమే ఈ సేవలను అనుమతించాయి. 150 నుంచి 500 ఎంబీపీఎస్ వేగం గల ఇంటర్నెట్ సేవలు స్టార్‌లింక్‌ అందిస్తుందని స్పేస్ ఎక్స్ సంస్థ చెబుతోంది.  ఇక భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్‌లింక్‌కు ఇంకా అనుమతులు లభించలేదు.

Updated Date - 2022-03-02T01:34:54+05:30 IST