ఐషా అనే పేరుకు బదులు ఐఎస్ఐఎస్ అని రాసిన స్టార్‌బక్స్.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-07-10T01:24:20+05:30 IST

స్టార్‌బక్స్ సిబ్బంది కారణంగా అమెరికాలో ఓ ముస్లిం యువతి వివక్షకు గురైంది.

ఐషా అనే పేరుకు బదులు ఐఎస్ఐఎస్ అని రాసిన స్టార్‌బక్స్.. అమెరికాలో..

సెయింట్ పాల్: స్టార్‌బక్స్ సిబ్బంది కారణంగా అమెరికాలో ఓ ముస్లిం యువతి వివక్షకు గురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐషా అనే ముస్లిం యువతి జులై 1న మిన్నెసొటా రాష్ట్రంలోని సెయింట్ పాల్ నగరంలో ఉన్న స్టార్‌బక్స్ కేఫ్‌కు వెళ్లి కాఫీ ఆర్డర్ చేసింది. స్టార్‌బక్స్‌ సిబ్బంది సహజంగా ఆర్డర్‌పై కస్టమర్ పేరు రాసి ఇస్తారు. అయితే ఐషాకు ఇచ్చిన ఆర్డర్‌పై సిబ్బంది ‘ఐఎస్ఐఎస్’ అని రాసిచ్చారు. ఐఎస్ఐఎస్ అనేది ఉగ్రవాది సంస్థ అని అందరికి తెలిసిందే. ఈ పేరును చూసిన ఐషా వెంటనే షాకయ్యింది. తాను ముస్లిం అయినందుకే ఈ రకంగా వివిక్ష చూపించారని ఆమె భావించింది. తన పేరు స్పష్టంగా ఐషా అని చెప్పానని.. అందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదని వాపోయింది. ఐఎస్ఐఎస్ అని చూసిన నిమిషం తాను భావోద్వేగానికి, అవమానానికి గురయ్యానంటూ ఐషా ఆవేదన వెల్లగక్కింది. ఇదేంటంటూ తాను సిబ్బందిని ప్రశ్నించగా.. వేరే ఆర్డర్‌తో పాటు జరిగిన పొరపాటుకు 25 డాలర్ల గిఫ్ట్ కార్డ్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఐషా చెప్పింది. 


దీంతో ఐషా మిన్నెసొటా మానవ హక్కుల శాఖను సంప్రదించింది. తాను వివక్షకు గురయ్యానంటూ స్టార్‌బక్స్‌ కేఫ్‌పై కేసు ఫైల్ చేసింది. మరోపక్క స్టార్‌బక్స్ కేఫ్‌ను నడుపుతున్న టార్గెట్ అనే సంస్థ ఈ ఘటనపై స్పందించింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని చెప్పుకొచ్చింది. ఇలా జరగడం దురదృష్టకరమని.. జరిగిన పొరపాటుకు ఐషాకు క్షమాపణలు తెలిపింది. ఈ ఘటనకు కారణమైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని.. మళ్లీ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా.. అమెరికాలో ఇటీవల నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ తెల్ల పోలీసు అధికారి చేతిలో మరణించిన విషయం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత అమెరికా అట్టుడికిపోయింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా అత్యధిక నిరసనలు మిన్నెసొటాలోనే చోటుచేసుకున్నాయి. ఇప్పుడు అదే రాష్ట్రంలో ఓ ముస్లిం యువతి వివక్షకు గురవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Updated Date - 2020-07-10T01:24:20+05:30 IST