వచ్చే ఏడాదే బరిలోకి..

ABN , First Publish Date - 2020-10-17T08:53:43+05:30 IST

ఈ ఏడాది జరిగే పోటీల బరిలోకి దిగకూడదని స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు నిర్ణయించుకుంది. అయితే కరోనాతో ...

వచ్చే ఏడాదే బరిలోకి..

బెంగళూరు: ఈ ఏడాది జరిగే పోటీల బరిలోకి దిగకూడదని స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు నిర్ణయించుకుంది. అయితే కరోనాతో బ్యాడ్మింటన్‌కు సుదీర్ఘంగా దూరంగా ఉండడం ఒలింపిక్స్‌ సన్నాహకాలకు ప్రతిబంధకం కాబోదని ఆమె చెప్పింది. ఏడు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలు ప్రస్తుతం జరుగుతున్న డెన్మార్క్‌ ఓపెన్‌తో పునఃప్రారంభమయ్యాయి. కానీ రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత సింధు ఆ టోర్నమెంట్‌లో పాల్గొనలేదు. ఇక కొత్త సంవత్సరంలో జరిగే ఆసియా ఓపెన్‌ (జనవరి 12-17), ఆసియా ఓపెన్‌-2 (జనవరి 19-24)లో 25 ఏళ్ల సింధు తలపడనుంది. ‘టోర్నీల్లో ఆడడాన్ని మిస్సవుతున్నా. కానీ ఇంట్లో ప్రతిరోజూ సాధన చేస్తున్నా. విరామం అనంతరం తిరిగి ఆడడం ప్రారంభించాక.. గాడిలో పడేందుకు ఒకటి రెండు వారాలు పట్టింది. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న నేను టోర్నమెంట్ల బరిలోకి దిగేందుకు ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. ‘పోటీలలో పాల్గొనక నెలలు అవుతోంది. మహిళల్లో టాప్‌ పదిమందికి తగినంత విశ్రాంతి లభించింది. తదుపరి కోర్టులో అడుగుపెడితే అంతా విభిన్నంగా ఉంటుంది. క్రీడాకారిణులంతా తమ ఆటతీరు మెరుగుపరుచుకొని ఉంటారు. కనుక అది సవాలుతో కూడినదే’ అని వివరించింది. చివరిగా గత మార్చిలో జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో పీవీ ఆడింది. ఇక కరోనా సమయంలో పెయింటింగ్‌లు వేయడంతోపాటు తన వంటింటి నైపుణ్యాలను ఆమె మెరుగుపర్చుకుంది. ‘అంతకాలం ఇంటికే పరిమితం కావడం విచారకరమైన విషయం. ప్రపంచం మొత్తం స్తంభించింది. అయినా మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. జీవితానికే ప్రథమ ప్రాధాన్యం కదా’ అని సింధు పేర్కొంది. 


Updated Date - 2020-10-17T08:53:43+05:30 IST