ప్ర‘యోజన’మేదీ?

ABN , First Publish Date - 2021-07-26T04:29:48+05:30 IST

ప్ర‘యోజన’మేదీ?

ప్ర‘యోజన’మేదీ?
గర్భిణులకు పరీక్షిస్తున్న వైద్యాధికారిణి (ఫైల్‌)

- నిలిచిన పీఎంఎంవీవై పథకం.. 

- గర్భిణులు, బాలింతలకు నిర్వేదం

- ఏడు నెలలుగా అందని సాయం

(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం ఆచరణలో విఫలమవుతోంది. పేద గర్భిణులకు పోషకాహారం అందించి,  మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2017లో ప్రారంభించింది. రోజువారీ వేతనంతో పనిచేస్తున్న శ్రామిక మహిళలతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున గర్భిణులు, బాలింతలకు ప్రోత్సాహక నిధులు మంజూరు చేసేవి. మొత్తంగా ఒక్కొక్కరికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవిస్తే రూ.6వేలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి రూ.5వేలు చొప్పున అందజేసేవి. కానీ ఏడు నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో.. బాలింతలు, గర్భిణులు నిరాశ చెందుతున్నారు. 


ఇదీ అమలు తీరు : 

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో గర్భిణిగా నమోదైన వెంటనే ఆ ప్రాంత పరిధిలో వైద్య సిబ్బంది పూర్తి వివరాలు సేకరిస్తారు. అనంతరం వైద్యాధికారితో ధ్రువీకరించిన తరువాత పీఎంఎంవీవై వెబ్‌సైట్లో నమోదు చేస్తారు. తర్వాత వారందరికీ విడతల వారీగా బ్యాంకు ఖాతాల్లో సాయం జమ అవుతుంది. తొలివిడతగా గర్భిణికి రూ.వెయ్యి అందజేస్తారు.  ఏడో నెలలో వైద్య పరీక్షలకు మరో రూ.2వేలు ఇస్తారు. మొదటి కాన్పులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం తీసుకుని, టీకాలు మూడు డోసులు పూర్తయిన తరువాత బాలింతకు ఇంకో రూ.2వేలు అందజేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైతే జననీ సురక్ష యోజనలో భాగంగా అదనంగా రూ.1000 జమ చేస్తారు. పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 1,75,851 మంది గర్భిణులు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 1,48,158 మందికి రూ.24.42 కోట్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబరు నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్రం కూడా వాటా నిలిపివేసింది. దీంతో 24,674 మంది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకం అమలుపై వైద్యాధికారులు కూడా స్పష్టత ఇవ్వకపోవటంతో అసలు సాయం అందుతుందా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. ఏడాదిగా వైద్య సిబ్బంది కరోనా విధుల్లో నిమగ్నమయ్యారు. దీంతో గర్భిణులను గుర్తించి వారికి పీఎంఎంవీవై పథకాన్ని వర్తింపజేయడంలో జాప్యమవుతోంది. ప్రభుత్వం స్పందించి  తమకు ఆర్థిక సాయం విడుదల చేయాలని గర్భిణులు, బాలింతలు  కోరుతున్నారు. 


నిధులు విడుదలైతేనే.. 

పీఎంఎంవీవై పథకంలో లబ్ధిదారులకు నిలిచిపోయిన ఆర్థిక సాయం నిధులు విడుదలైన  వెంటనే వారి ఖాతాల్లో జమ చేస్తాం. లబ్ధిదారుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయి. అర్హుల నమోదు ప్రక్రియ నిరంతరం సాగుతోంది. ఇంకా ఎవరైనా అర్హులుంటే నమోదు చేసుకోవాలి. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. 

- డాక్టర్‌, కె.చంద్రనాయక్‌, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం.

 

Updated Date - 2021-07-26T04:29:48+05:30 IST