నడిమధ్యనే నిలిచే!

ABN , First Publish Date - 2022-08-19T05:20:49+05:30 IST

ప్రధానమంత్రి కలల ప్రాజక్టులో నడికుడి-శ్రీకాళహస్తి ఒకటి. ఆయన ఆశీస్సులతో రైల్వేలైన్‌ పనులు పట్టాలెక్కాయి. 2015లో రైల్వే లైన్‌ కోసం సర్వే జరుగగా పనులు ప్రారంభం కావడానికి మూడేళ్లు పట్టింది. ఎలాగోలా పనులు ప్రారంభం అయినా నిర్మాణం మాత్రం ఆలస్యం అవుతోంది. రైల్వే లైన్‌ కోసం అవసరమైన భూసేకరణలో రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం అలసత్వం ప్రధానంగా కనపడుతోంది.

నడిమధ్యనే నిలిచే!
కొనకనమిట్ల వద్ద మధ్యలో ఆగిన బిడ్జి పనులు

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనుల్లో నిరవధిక జాప్యం

రైల్వేలైన్‌ నిర్మాణం సర్వేతోనే సరిపెట్టారు

భూమి అప్పగింతే ప్రధాన అడ్డంకి

నిధులివ్వని రాష్ట్రప్రభుత్వం

చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

2022కి పూర్తికావడం అసాధ్యమే

కురిచేడు, ఆగస్టు 18:

 

-పామూరు మండలంలో రావిగుంటపల్లి, వగ్గంపల్లి, పామూరు, చిలంకూరు, తిరగళదిన్నె, నుచ్చుపొద మీదుగా 45 కిలోమీటర్ల పొడవున నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణం కోసం భూసేకరణ కోసం సర్వే చేశారు. రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయాయి. కేవలం సిమెంట్‌ దిమ్మెలు మాత్రమే తోలి ఉన్నారు. నిర్వాసిత రైతులకు ఎంత పరిహారం ఇవ్వబోతున్నారో ఇంతవరకు ప్రకటించలేదు. పామూరు పక్కనున్న తిరగలదిన్నె, నుచ్చుపొదలకు పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వాటిని పక్కనపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

-కొనకనమిట్ల మండలం చినారికట్ల, పెదారికట్ల మధ్య కనిగిరి మండలం యడవల్లి వరకు 12 కిలోమీటర్లు నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను మట్టికట్ట, మధ్యలో చిన్న చిన్న రైల్వే బ్రిడ్జ్‌ల నిర్మాణం చాలావరకు పూర్తిచేశారు. పెద్ద బ్రిడ్జిలు మధ్యలోనే ఆగిపోయాయి. కరోనాలో ఆగిన పనుల గురించి ఇప్పటివరకు కాంట్రాక్టర్లు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 

-నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనుల్లో నిరవధిక జాప్యం జరుగుతోంది. వేగంగా జరగాల్సిన పనులు ఆగిపోవడానికిరాష్ట్రప్రభుత్వ అలసత్వమే కారణంగా కనిపిస్తోంది. భూమిని సేకరించి రైల్వేకు అప్పగించాల్సి ఉండగా చాలావరకు అది పూర్తికాలేదు. భూసేకరణ జరుగకపోవడం, చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు క్యాంపులు ఎత్తేసి వెళ్లిపోయారు. 2022కి పనులు పూర్తిచేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నా పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఇప్పట్లో  రైళ్లు పట్టాలెక్కడం కష్టమని తేలిపోయింది.


 ప్రధానమంత్రి కలల ప్రాజక్టులో నడికుడి-శ్రీకాళహస్తి ఒకటి. ఆయన ఆశీస్సులతో రైల్వేలైన్‌ పనులు పట్టాలెక్కాయి. 2015లో రైల్వే లైన్‌ కోసం సర్వే జరుగగా పనులు ప్రారంభం కావడానికి మూడేళ్లు పట్టింది. ఎలాగోలా పనులు ప్రారంభం అయినా నిర్మాణం మాత్రం ఆలస్యం అవుతోంది. రైల్వే లైన్‌ కోసం అవసరమైన భూసేకరణలో రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం అలసత్వం ప్రధానంగా కనపడుతోంది. రైతుల నుంచి భూసేకరణ జరిపి రైల్వే శాఖకు అప్పగించడం కూడా ఇంకా పూర్తికాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కేంద్రప్రభుత్వం మొత్తం నిధులు ఇవ్వడం లేదు. ఏడాది నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తమకు బిల్లులు రాలేదని భూములు అప్పగించలేదని కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 


96 గ్రామాలు, 336.302 కి.మీ రైల్వే లైన్‌

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా వెళుతుంది. ఈ లైన్‌లో గుంటూరు జిల్లాలో 18 గ్రామాల మీదుగా 53.605కి.మీ ట్రాక్‌ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం పూర్తయి సీఆర్‌ఎస్‌ కూడా ఇచ్చి గూడ్స్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో 32 గ్రామాల మీదుగా 107.2 కి.మీ మేర ట్రాక్‌ నిర్మాణం చేపట్టేలా డిజైన్‌ చేశారు. అందుకుగాను 2,237.958 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. మన జిల్లాలో 6.505 ఎకరాల అటవీ భూమిని సేకరించనున్నారు. సంవత్సర కాలం పాటు పనులు జరిగితే కురిచేడు మండలంలో బయ్యవరం, దేకనకొండ గ్రామాల మీదుగా రైల్వేలైన్‌ వెళుతుంది. ఈ గ్రామాల్లో సైతం రైల్వేలైన్‌ కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందాల్సిన వారు ఇంకా ఉన్నారు. 


రైల్వే రూటు ఇది...

నడికుడి నుంచి పిడుగురాళ్ల వరకు ప్రస్తుతం ఉన్న మార్గంలోనే రైళ్లు నడుస్తాయి. పిడుగురాళ్ల నుంచి గుంటూరు జిల్లాలో కోనంకి, నెమలిపురి, నకరికల్లు, విప్పర్ల, రొంపిచర్ల, వేల్పూరు మీదుగా శావల్యాపురం వద్ద గుంటూరు - గుంతకల్‌ రైల్వే లైన్‌లో కలుపుతారు. శావల్యాపురం నుంచి వినుకొండ మీదుగా గుండ్లకమ్మ స్టేషన్‌ వరకు పాత లైన్‌నే వినియోగిస్తారు. గుండ్లకమ్మ వద్ద నుంచి రైల్వేలైన్‌ నూతనంగా నిర్మాణం చేపడతారు. గుండ్లకమ్మ, చింతలచెరువు, ముక్కెళ్లపాడు మీదుగా ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మన జిల్లాలో కురిచేడు మండలంలో బయ్యవరం, దేకనకొండల మీదుగా ముండ్లమూరు మండలం పులిపాడు, దర్శి మండలం దర్శి, రాజంపల్లి అన్నవరం మీదుగా పొదిలి మండలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ మల్లవరం, పొదిలి, కొనకనమిట్ల మండలం పెదారికట్ల కనిగిరి మండలం పునుగోడు, చిన్న ఇర్లపాడు, చిలకంపాడు, పామూరు మీదుగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ చాకలికొండ, రావిపాడు, వింజమూరు, దూబగుంట, ఆత్మకూరు, రాపూరు మీదుగా వెంకటగిరి, శ్రీకాళహస్తి వరకు రైల్వేలైన్‌ నిర్మించనున్నారు. మొత్తం 336.302 కి.మీ రైల్వే ట్రాక్‌పై నడికుడి-శ్రీ కాళహస్తి రైల్వే లైన్‌లో రైళ్లు నడవనున్నాయి.


2022కి నిర్మాణం అసాధ్యమే

ఈ రైల్వే లైన్‌ నిర్మాణం 2022కి పూర్తవుతుందని రైల్వే అధికారులు అంటున్నారు. అయితే భూసేకరణలోనే జాప్యం జరిగి భూమిని రైల్వే శాఖకు అప్పగించకపోతే పనులు ఎలా పూర్తవుతాయనేది ప్రధాన ప్రశ్న. ప్రస్తుతం కురిచేడు మండలంలో దేకనకొండ  వద్ద ట్రాక్‌ నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం మధ్యలోనే ఆగింది. రాష్ట్రప్రభుత్వం తమ వాటా ప్రకారం 50శాతం నిధులు ఇవ్వకపోవడంతో కేంద్రప్రభుత్వం ఇప్పటికి వరకు జరిగిన పనులకు 60 శాతం బిల్లులు ఇచ్చారు. ఇంకా రూ.270కోట్లు రావాల్సి ఉందని ఆ మొత్తం ఇవ్వాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. ఇప్పటికే వారు పలుమార్లు జిల్లా అధికారులను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వారంటున్నారు. తాము చేసిన పనులకు  బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపి తమ క్యాంపులు ఎత్తేసి వెళ్లిపోయారు. 


మళ్లీ మొదటికి

పాత కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదని పనులు ఆపి వెళ్లిపోవడంతో మిగిలిన పనులకు మళ్లీ టెండర్‌ పిలవాల్సిన అవసరం వచ్చింది. టెండర్లు పిలిచి మరలా పనులు ప్రారంభం కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లైన్‌లో ఎపుడు మరలా పనులు ప్రారంభమై రైళ్లు పరుగులు పెడతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ రైల్వే రూటు పూర్తయితే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 





Updated Date - 2022-08-19T05:20:49+05:30 IST