రుణం..అందని దూరం!

ABN , First Publish Date - 2021-10-06T05:29:16+05:30 IST

-కార్పొరేషన్ల ద్వారా మంజూరయ్యే రాయితీ రుణ పథకాలు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్తబ్ధత ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో 16 కార్పొరేషన్లు ఉండగా..వైసీపీ ప్రభుత్వం 80కి పెంచింది. సామాజికవర్గానికి ఒకటి చొప్పున కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ సామాజికవర్గాల సంక్షేమానికి..నిరుద్యోగ యువత ఉపాధికి పథకాలు ప్రకటించడం లేదు. గతంలో సంక్షేమ శాఖలు ప్రకటించే వార్షిక ప్రణాళికల కోసం నిరుద్యోగ యువత ఎరుదుచూసేవారు.

రుణం..అందని దూరం!
కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న నిరుద్యోగ యువత (ఫైల్‌)


జాడలేని ఉపాధి కల్పన

నిలిచిన రాయితీ రుణాలు

అలంకారప్రాయంగా కార్పొరేషన్లు

నిరుద్యోగుల ఎదురుచూపులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

‘అన్ని సామాజికవర్గాల అభివృద్ధే లక్ష్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా 80 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం’..అంటూ వైసీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున కార్యవర్గాలను నియమించింది. కానీ ఈ కార్పొరేషన్ల ఏర్పాటు కేవలం రాజకీయ నిరుద్యోగుల కోసమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటికి ఎటువంటి నిధుల కేటాయింపులు లేవు. దీంతో కార్పొరేషన్లు అలంకారప్రాయంగా మిగులుతున్నాయి. రుణాల కోసం నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

-కార్పొరేషన్ల ద్వారా మంజూరయ్యే రాయితీ రుణ పథకాలు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్తబ్ధత ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో 16 కార్పొరేషన్లు ఉండగా..వైసీపీ ప్రభుత్వం 80కి పెంచింది. సామాజికవర్గానికి ఒకటి చొప్పున కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ సామాజికవర్గాల సంక్షేమానికి..నిరుద్యోగ యువత  ఉపాధికి పథకాలు ప్రకటించడం లేదు. గతంలో సంక్షేమ శాఖలు ప్రకటించే వార్షిక ప్రణాళికల కోసం నిరుద్యోగ యువత ఎరుదుచూసేవారు. వెనుకబడిన తరగతుల వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కులాల వారీ ఏర్పాటు చేసుకునే సంఘాల (ఫెడరేషన్లు)కు 50 శాతం సబ్సిడీతో కూడిన గ్రూపు రుణాలను అందించేవారు. గరిష్టంగా రూ.30 లక్షల వరకూ మంజూరు చేసేవారు. ఏటా అన్ని కార్పొరేషన్ల పరంగా రాయితీతో కూడిన యూనిట్ల ఏర్పాటుకు సగటున రూ.150 కోట్లకుపైగా మంజూరయ్యేవి. 2017- 18 ఆర్థిక సంవత్సరం వరకూ రాయితీ రుణాల మంజూరు ప్రక్రియ సక్రమంగానే సాగింది. 2018-19కి సంబంధించి ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, తదితర కార్పొరేషన్ల పరంగా రూ.150 కోట్ల రుణ లక్ష్యంగా నిర్ణయించి 11 వేలకు పైగా యూనిట్ల ఏర్పాటు కోసం లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో రుణాలు మంజూరు ప్రక్రియను నిలిపివేశారు. ఎన్నికలు పూర్తయిన తరువాత ఆ రుణాల విషయమే మరిచిపోయారు. 

యూనిట్ల కోసం నిరీక్షణ 

 కార్పొరేషన్ల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. అగ్రకులాల్లో పేదలను ఆదుకునే క్రమంలో వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్ల ఏర్పాటు చేసింది. చేయూత, ఆసరా, కాపునేస్తం వంటి పథకాలు నేరుగా అందజేస్తోంది. ఈ నగదు తాత్కాలిక అవసరాలకే మినహా ఉపాధి కల్పనకు అక్కరకు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయితీ రుణాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించకపోవడంతో నిరుద్యోగ   యువతకు ఎదురుచూపులే మిగిలాయి. 

నేరుగా ఆర్థిక సాయం

 ప్రభుత్వం చేయూత, ఆసరా, కాపునేస్తం వంటి పథకాల ద్వారా అర్హులైన వారందరికీ ఏటా నగదు అందజేస్తుంది. వాటి ద్వారా వారంతా ఉపాధి పొందాలి. ప్రభుత్వం అందజేసిన నగదును సొంత అవసరాలకు కాకుండా ఉపాధి పొందేందుకు వినియోగిస్తే మంచిది. ప్రత్యేకంగా కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయడం లేదు. 

- జి.రాజారావు, ఏడీ, బీసీ కార్పొరేషన్‌, శ్రీకాకుళం. 




Updated Date - 2021-10-06T05:29:16+05:30 IST