స్టాంపులకు.. కొరత

ABN , First Publish Date - 2022-08-18T05:32:08+05:30 IST

జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్టాంపుల కొరత ఏర్పడింది. పల్నాడులోని పలు గ్రామాల నుంచి తనకా, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, తాకట్టుకు పలుగ్రామాల రైతులు, వ్యాపారులు రిజిస్టేషన్‌ కార్యకలాపాలు జరుపుకునేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్టాంపుల కోసం వస్తుంటారు.

స్టాంపులకు.. కొరత
గురజాల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

రిజిస్ట్రేషన్‌దారుల అవస్థలు

 

పిడుగురాళ్ల, ఆగస్టు 17: జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్టాంపుల కొరత ఏర్పడింది. పల్నాడులోని పలు గ్రామాల నుంచి తనకా, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, తాకట్టుకు పలుగ్రామాల రైతులు, వ్యాపారులు రిజిస్టేషన్‌ కార్యకలాపాలు జరుపుకునేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్టాంపుల కోసం వస్తుంటారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయాలో పరిధిలో ప్రతిరోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు  జరుగుతుంటాయి. ఇందుకు పెద్దఎత్తున స్టాంపులు అవసరమవుతాయి. ఈ స్టాంపుల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం వస్తుంది. అయినా స్టాంపుల కొరత వెంటాడుతుంది. ఒక్కోసారి రూ.100 స్టాంపులు మినహా మరే స్టాంపులు అందుబాటులో ఉండటం లేదు. మరోసారి రూ.50, రూ.20 స్టాంపులే అందుబాటులో ఉంటున్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తక్కువలో తక్కువ రూ.100 స్టాంపు పెట్టాలంటే రూ.వంద స్టాంపు అందుబాటులో ఉంటే ఒకటైతే సరిపోతుంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా  రూ.వంద స్టాంపుల కొరత వెంటాడుతుంది. రూ.వంద స్టాంపు అందుబాటులో లేకపోవటంతో రూ.20 స్టాంపులు ఐదు పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పేజీల సంఖ్య పెరుగుతుంది. దీంతోపాటు దస్తావేజులను స్కాన్‌ చేసే సమయంలో పేజీలు ఎక్కువగా ఉండటంతో సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. దస్తావేజులు వాపసు ఇచ్చే సమయం కూడా ఎక్కువ ఉంటుంది.  దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం పిడుగురాళ్ల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో కొందరి వద్దే స్టాంపులు అందుబాటులో ఉన్నాయి. ఒకరిద్దరి వద్ద ఉన్న స్టాంపులు కూడా ఒకటిరెండు రోజుల్లో అయిపోనున్నాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్న భయం స్టాంపు వెండర్లలో, కొనుగోలుదారుల్లో నెలకొంది.   ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో స్టాంపుల కొరత లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 

 

Updated Date - 2022-08-18T05:32:08+05:30 IST