CM KCRను స్టాలిన్ నమ్మట్లేదా.. కారణాలేంటో..!?

ABN , First Publish Date - 2021-12-16T14:25:18+05:30 IST

CM KCRను స్టాలిన్ నమ్మట్లేదా.. కారణాలేంటో..!?

CM KCRను స్టాలిన్ నమ్మట్లేదా.. కారణాలేంటో..!?

  • బీజేపీకి వ్యతిరేకంగా ‘సై’..
  • కాంగ్రెస్‌ రహితంగా ‘నై’
  • ఇదే డీఎంకే వైఖరి
  • ముగిసిన మూడు రోజుల కేసీఆర్‌ పర్యటన


చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల తమిళనాడు పర్యటన మరోమారు కొత్త పొత్తులపై చర్చకు దారి తీసింది. మూడేళ్ల క్రితం చెన్నై వచ్చిన కేసీఆర్‌.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ ఏర్పాటుపై నాడు ప్రతిపక్షంలో వున్న డీఎంకే నేత స్టాలిన్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ కొత్త కూటమి కోసం ఈ ఇద్దరు నేతలు చర్చించారంటూ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ఊహాగానా లను డీఎంకే వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కొత్త పొత్తులపై స్టాలిన్‌కు ఏమాత్రం ఆసక్తి లేదని, సమీప కాలంలో ఎన్నికలే లేనందున, ఇప్పుడు ఆ వ్యవహారంపై మాట్లాడ్డం వృధా అన్న భావనతో స్టాలిన్‌ వున్నారని డీఎంకేకు చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. 


సోనియా, రాహుల్‌తో స్టాలిన్‌కు స్నేహం!

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు డీఎంకే సిద్ధంగానే వుంది. కానీ కాంగ్రెస్‌ లేకుండా ఇతరపక్షాలను నమ్ముకుని పరుగులు పెట్టేందుకు ఏమాత్రం సుముఖంగా వున్నట్టు కనిపించడం లేదు. 2003లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏలో వున్న డీఎంకే.. ఆ తరువాత కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏతో జత కట్టింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ రెండు పార్టీల నడుమ సఖ్యత కొనసాగుతూనే వుంది. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం వ్యవహారంలో డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళి, ఆ పార్టీకి చెందిన సీనియర్‌ మంత్రి ఎ.రాజా జైలుపాలైనా ఆ పార్టీ కూటమిని వీడలేదు. పదేళ్లపాటు స్నేహంగా మసలుకున్నా తమ పట్ల కాస్తయినా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కరుణానిధి అప్పట్లో కాంగ్రెస్‌ వైఖరి పట్ల కాస్త మనస్తాపం చెందినా.. స్టాలిన్‌ మాత్రం ఈ వ్యవ హారంలో కాంగ్రెస్‌ను నిందించలేదు. 2014లో పార్ల మెంటు ఎన్నికల సమయంలో రెండు పార్టీల నేతల నడుమ విభేదాలు నెలకొన్నా.. స్టాలిన్‌ వాటిని అధిగ మించేందుకే ప్రయత్నించారు తప్ప, కాంగ్రెస్‌ను దూరం చేసుకునేందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌ గాంధీలతో స్టాలిన్‌ సన్నిహిత సంబంధాలుండడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.


జయ మరణానంతరం.. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కరుణానిధిని చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హఠాత్తుగా చెన్నై వచ్చారు. ఆ సమయంలో డీఎంకేను దరి చేర్చుకునేందుకు బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నించారు. కానీ ఇందుకు స్టాలిన్‌ సున్నితంగా తిరస్కరించినట్టు డీఎంకే వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ లేకుండా కూటమి ఏర్పాటు కోసం గతంలో కొంతమంది నేతలు ప్రతి పాదించినప్పటికీ మిన్నకుండిపోయారు. ఆయా నేతల మాటల్ని ఆలకించారే తప్ప, వారి ప్రతిపాదనను అంగీ కరించలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ లేకుండా జాతీయస్థాయిలో ఏర్పాటయ్యే కూటమిలో చేరితే.. రాష్ట్రంలో తమ పార్టీ నష్టపోవాల్సి వస్తుందని స్టాలిన్‌ యోచిస్తున్నారు. విశ్వాసపాత్రుడైన స్నేహితుణ్ని వదులుకుని, కొత్త మిత్రుల కోసం పాకులాడాల్సిన అవ సరం లేదని ఆయన గట్టిగా తలపోస్తున్నారని డీఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చలువతో బీజేపీ తమిళనాట ఊపిరిపోసుకుంది. ఇకమీదట ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించినా ఆ పార్టీ.. బలోపేతమవుతుందని స్టాలిన్‌ భావిస్తున్నారు.


మోదీ, అమిత్‌షా హయాంల వరకు అన్నాడీఎంకే-బీజేపీ కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వదలు కుంటే ఆ పార్టీ కమల్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం, దినకరన్‌ నేతృత్వంలోని ఏఎంఎంకే తదితర చిన్నాచితకా పార్టీలతో జతకడుతుంది. దీనివల్ల ఆ కూటమికి ఒనగూరేదేమీ లేకపోయినా, అన్నాడీఎంకే -బీజేపీ కూటమి వ్యతిరేక ఓట్లు చీలడం ఖాయం. ఈ వ్యవహారం అంతిమంగా నష్టం చేకూర్చేది డీఎంకేకే. అందువల్ల అలాంటి పొరపాటుకుతావివ్వరాదని స్టాలిన్‌ యోచిస్తున్నట్లు డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


కాంగ్రెస్‌ ‘ఒకటి పక్కన సున్నా’..

నిజానికి తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలలో ఏదో ఒకదాని పొత్తు లేకుండా కాంగ్రెస్‌ మనగలగటం కష్టమని గతంలో వెల్లడైన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ‘కాంగ్రెస్‌ సున్నానే. కానీ అది ఒకటి పక్కన వుంటే పదవుతుందన్న’ విషయం స్టాలిన్‌కు బాగా తెలుసు. తమిళనాట అధికారం సాధించే స్థితిలో కాంగ్రెస్‌ లేనప్పటికీ, కుగ్రామాల్లో సైతం ఆ పార్టీకి చెప్పుకోదగిన క్యాడర్‌ వుంది. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయ వంటి వారు వచ్చి కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేశారే గానీ, ఆ పార్టీ క్యాడర్‌ను దూరం చేయలేక పోయారు. అందుకే కాంగ్రెస్‌ ఎవరితో జత కడితే ఆ పార్టీకే లాభం. ఈ విషయం స్టాలిన్‌కు బాగా తెలుసు. అందుకే ఆయన కాంగ్రెస్‌ను దూరం చేసుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. కేంద్రంలో ఏదో వస్తుందని ఆశిస్తే, రాష్ట్రంలో అసలుకే ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్‌ను వదులుకునేందుకు ఏమాత్రం సుముఖంగా లేరని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అందునా వచ్చే ఏడాది రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లు, 152 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన డీఎంకే.. ఈ ఎన్నికల్లో వందశాతం ఫలితాలు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు కాంగ్రెస్‌ సహకారం ఎంతో అవసరమన్న విషయం ఆ పార్టీకి బాగా తెలుసు. 


కేసీఆర్‌ను నమ్మే స్థితిలో లేరు!

వ్యక్తిగతంగా కేసీఆర్‌ను అభిమానిస్తున్న స్టాలిన్‌కు.. ఆయన్ని నమ్మి తృతీయ కూటమివైపు మళ్లే యోచన లేదని డీఎంకే వర్గాలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో కేసీఆర్‌ బీజేపీకి లాభం చేకూర్చేలా వ్యవహరించడం, కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలకు కేసీఆర్‌ మద్దతు పలకడం పట్ల స్టాలిన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారని ఆ వర్గాలు గుర్తు చేశాయి. 2018లో ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పినదంతా ఆలకించడమే తప్ప, స్టాలిన్‌ వైపు నుంచి ఎలాంటి హామీ రాలేదని గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్‌.. నాలుగు రోజులు పోయాక మళ్లీ మనసు మార్చుకుంటే పరిస్థితి ఏంటని డీఎంకే వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే ఆయన్ని నమ్మి కొత్త కూటమి వైపు స్టాలిన్‌ మొగ్గు చూపకపోవచ్చని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


నరసింహన్‌కు కేసీఆర్‌ పరామర్శ

సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి కుటుంబ సమేతంగా తిరుచ్చి చేరుకున్న కేసీఆర్‌.. శ్రీరంగంలోని శ్రీరంగనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేరోజు సాయంత్రం చెన్నై వచ్చిన ఐటీసీ చోళా హోటల్లో బస చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఆళ్వారుపేటలోని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడ గంటపాటు స్టాలిన్‌ కుటుంబంతో భేటీ అయిన కేసీఆర్‌.. రాత్రికి మళ్లీ హోటల్లో బస చేశారు. బుధవారం ఉదయం స్థానిక ఆళ్వారుపేటలో వున్న కావేరీ ఆస్పత్రికెళ్లిన కేసీఆర్‌.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మాజీ గవర్నర్‌ నరసింహన్‌ను పరామర్శించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2021-12-16T14:25:18+05:30 IST