పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన

ABN , First Publish Date - 2021-10-22T05:03:00+05:30 IST

జిల్లాలో పత్తి పంట కొనుగోళ్లపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది. మొదట అక్టోబరు 20న కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు నిర్ణయించారు. కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఈ నెల 25 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తామని ప్రకటించినా అనుమానంగానే కనిపిస్తోంది.

పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన

 కొనుగోళ్లను నిలిపివేయాలని వ్యాపారుల వినతి

 ట్రేడర్స్‌, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ మధ్య వివాదం

 ఘటన్స్‌ రవాణా అద్దె చెల్లింపుల్లో భేదాభిప్రాయాలు

 అర్ధాంతరంగా ముగిసిన అదనపు కలెక్టర్‌ చర్చలు

 పంటను అమ్ముకునేందుకు రైతుల ఎదురు చూపులు

ఆదిలాబాద్‌, అక్టోబరు21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి పంట కొనుగోళ్లపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది. మొదట అక్టోబరు 20న కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు నిర్ణయించారు. కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఈ నెల 25 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తామని ప్రకటించినా అనుమానంగానే కనిపిస్తోంది. ఇప్పటికే పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లను ప్రారంభించక పోవడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. పంటను నిల్వ చేసుకునే అవకాశం లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందోనన్న భయం రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే కొనుగోళ్లు ఆలస్యం కావడంతో నిత్యం పంట నిల్వల వద్ద కాపల కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ యేడు జిల్లాలో 4లక్షల 34వేల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. అధిక వర్షాలతో పంట దిగుబడులు కొంత మెరకు తగ్గినా సుమారుగా 25లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వస్తాయని మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 27 జిన్నింగ్‌ ఫ్యాక్టరీలు ఉండగా ఈ సారి మాత్రం 14 జిన్నింగ్‌లు మాత్రమే పత్తిని కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భారీ పెట్టుబడులతో కూడుకున్న వ్యాపారం కావడంతో ఆర్థిక స్థోమత లేని ట్రేడర్స్‌ పత్తి కొనుగోళ్ల నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా పత్తి కొనుగోళ్లను నిలిపి వేయాలని వ్యాపారులు మార్కెటింగ్‌ అధికారులను కోరడంతో అయోమయ పరిస్థితులకు దారితీస్తోంది.

ఎవరి వాదన వారిదే..

గతంలో మాదిరిగా కాకుండా ఈ యేడు లారీ ఓనర్‌ అసోసియేషన్‌ రవాణా చార్జీల విషయంలో కొత్త విధానాన్ని తెరపైకి తేవడాన్ని ట్రేడర్స్‌ తీవ్రంగా విభేదిస్తున్నారు. పత్తి ఘటన్స్‌ను తరలించేందుకు ఫిక్స్‌డు రవాణా చార్జీలను నిర్ణయించాలని లారీ ఓనర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తుండగా వ్యాపారులు మాత్రం ఓపెన్‌ మార్కెట్‌ విధానం ద్వారానే పత్తి ఘటన్స్‌ను తరలించాలని పట్టుబడుతున్నారు. దీంతో లారీ అసోసియేషన్స్‌ ట్రేడర్స్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరక వివాదాస్పదంగా మారుతోంది. ఫిక్స్‌డు అద్దె రేట్లను నిర్ణయిస్తే తాము నష్టపోతామని వ్యాపారులు వాధిస్తుండగా పెరిగిన డీజిల్‌ ధరలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ఖచ్చితంగా అద్దె చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర, ముంబాయి, కృష్ణపట్నం లాంటి ప్రాంతాలకు పత్తి ఘటన్స్‌ను తరించాల్సి ఉంటుంది. దీంతో రవాణా భారం పెరిగి పోతుందని లారీ అసోసియేషన్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బలవంతంగా ఈ నెల 25న పత్తి కొనుగోళ్లను ప్రారంభించినా వారం రోజుల్లోనే సమస్య మళ్లీ మొదటికొస్తుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 

చర్చలు విఫలం..

పత్తి ఘటన్స్‌ రవాణా చార్జీల చెల్లింపుల్లో ట్రేడర్స్‌, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో అధికారులు రోజంతా చర్చించినా ఫలితం లేక పోవడంతో అర్ధాంతరంగానే నిలిపి వేశారు. బుధవారం ఆదిలాబాద్‌ మార్కెట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ నటరాజన్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డిభోజారెడ్డి, రవాణా శాఖ అధికారులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి 10.30గంటల వరకు చర్చించినా సమస్యకు పరిష్కారం చూపలేదు. ఈ నెల 25 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నా పంట కొనుగోళ్లలో పాల్గొనేది లేదని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే రవాణా చార్జీలు పెంచితేనే ఘటన్స్‌ తరలిస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వాదిస్తున్నారు. గతంలో ఏపీలోని గుంటూరుకు రవాణా చార్జీగా రూ.35వేలను చెల్లించగా ఈ సారి మాత్రం ఏకంగా రూ.43వేల వరకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే రైతులపైనే చివరకు భారం పడనుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఫిక్స్‌డు చార్జీలతో నష్టపోతాం..

ఫ చింతవార్‌ రాజు (పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు)

అధికారులు ఫిక్స్‌డు చార్జీలను నిర్ణయిస్తే నష్టపోవాల్సి  వస్తోంది. ఓపెన్‌ మార్కెట్‌ విధానం ద్వారానే పత్తి ఘటన్స్‌ తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. స్థానిక వాహనాల తర్వాతనే ఇతర ప్రాంతాల వాహనాలకు ప్రాధాన్యతనిస్తాం. గుంటూరుకు ఘటన్స్‌ తరలించేందుకు మహారాష్ట్ర వాహనాల ద్వారా రూ.34వేలు ఖర్చవుతుంది. అదే స్థానిక వాహనాలకు రూ.43వేలు చెల్లించాలని అనడం సరైంది కాదు. ఇంత భారీ తేడా రావడంతో రైతుల పైనే భారం పడుతోంది. అధికారులు సమస్యను పరిష్కరించేంత వరకు పత్తి కొనుగోళ్లలో పాల్గొనమని స్పష్టం చేయడం జరిగింది. 

చర్చలు జరుపుతున్నాం..

ఫ శ్రీనివాస్‌ (మార్కెటింగ్‌ జిల్లా అధికారి, ఆదిలాబాద్‌)

ట్రేడర్స్‌ పత్తి కొనుగోళ్లను నిలిపి వేయాలని కోరిన మాట వాస్తమే. దీంతో లారీ ఓనర్స్‌ అసోసియేషన్స్‌, వ్యాపారులతో చర్చలు జరపడం జరిగింది. ఇప్పటికే కొంత వరకు కొలిక్కి వచ్చింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇరువర్గాలు మార్కెటింగ్‌ అధికారులకు సహకరించాలి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తాం.

Updated Date - 2021-10-22T05:03:00+05:30 IST