మెట్ల బావులు..చరిత్ర ఆనవాళ్లు

ABN , First Publish Date - 2022-05-10T05:23:19+05:30 IST

వీధులకు, చౌరస్తాలకు పేర్లున్నట్టుగానే అప్పట్లో బావులకు కూడా పేర్లు చెప్పుకునేటోళ్లు. దిక్కులకు, పొలాలకు ఇవి బండగుర్తుగా నిలిచేవి. పశువులు తప్పిపోయినా, అటువైపునకు వెళ్లాలన్నా చిరునామాగా నిలిచేవి. గ్రామ అవసరాలు, తాగునీటి అవసరాలను తీర్చే ఆధారంగా ఈ బావులు నిలిచేవి. దుబ్బాక పట్టణంలోని గంగమ్మ గుడి వద్ద, పెద్దచెరువు సమీపంలో దేవుని బావి ఉండేది.

మెట్ల బావులు..చరిత్ర ఆనవాళ్లు
శిథిలావస్థకు చేరిన చెల్లాపూర్‌ వేణుగోపాల స్వామి ఆలయ కోనేరు బావి

ఆలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద నిర్మాణం

ఉత్సవాలకు వేదికలుగా.. తాగునీటికి ఆధారంగా..

వేసవిలో ఈత సందడికి కేరాఫ్‌

కాలగర్భంలో కలుస్తున్న చెల్లాపూర్‌ కోనేరులు


గాజుల బావి..దేవుని బావి..రాట్నంబావి..దొరవారి బావి..గిరకల బావి.. మంచినీళ్లబావి..చింతలబావి..పుల్లకొండబావి..ఇలా పల్లెల్లో ప్రతీ బావికి ప్రత్యేకత ఉండేది. సాంకేతికత అందుబాటులోలేని సమయంలోనే అబ్బురపరిచే శైలిలో నిర్మితమైన ఈ బావులు వాస్తుశిల్పాలుగా నిలిచేవి. బోరుబావుల జోరుతో ప్రస్తుతం గడుల బావులు, మెట్ల బావులు కనుమరుగయ్యాయి. 


దుబ్బాక, మే 9: వీధులకు, చౌరస్తాలకు పేర్లున్నట్టుగానే అప్పట్లో బావులకు కూడా పేర్లు చెప్పుకునేటోళ్లు. దిక్కులకు, పొలాలకు ఇవి బండగుర్తుగా నిలిచేవి. పశువులు తప్పిపోయినా, అటువైపునకు వెళ్లాలన్నా చిరునామాగా నిలిచేవి. గ్రామ అవసరాలు, తాగునీటి అవసరాలను తీర్చే ఆధారంగా ఈ బావులు నిలిచేవి. దుబ్బాక పట్టణంలోని గంగమ్మ గుడి వద్ద, పెద్దచెరువు సమీపంలో దేవుని బావి ఉండేది. ఊళ్లో విద్యార్థులు పాఠశాలకు డుమ్మాకొట్టి దేవునిబావిలో ఈతకు వెళ్లేవారు. వేసవి సెలవులు వచ్చాయంటే ఊళ్లోని పిల్లలంతా దేవుని బావి వద్దకు చేరేవారు. సెలవులు పూర్తయ్యేలోగా ఈత నేర్చుకునేవాళ్లు. దుబ్బాకలోనే చదువుకున్న సీఎం కేసీఆర్‌ కూడా పాఠశాల రోజుల్లో ఈ బావిలో ఈత కొట్టినట్టు పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న దేవునిబావిని రహదారి వెడల్పు పేరిట పూడ్చేశారు. మిగిలిన స్థలం కబ్జాల పాలవుతున్నది.


పురాతన బావులు కనుమరుగు

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని పలు పురాతన బావులు కనుమరుగయ్యాయి. పట్టణం మొత్తానికి  తాగేనీరందించే మంచినీళ్ల బావి ప్రస్తుత దుంపలపల్లి రహదారి సమీపంలో ఉండేది. దీనినే గిరకల బావి అని పిలిచేవారు. బావి చుట్టూ నీళ్లను తోడేందుకు గిరకలు అమర్చి ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. సాయంత్రమైందంటే తాగునీటి కోసం తరలివచ్చే మహిళలతో బావి పరిసరాలు సందడిగా ఉండేవి. కొన్నేళ్లకు ఈ బావికే మోటారు బిగించి నల్లాల ద్వారా నీరు సరఫరా చేశారు. బోరుబావులు పెరగడంతో ఈ బావి ఎండిపోయి కాలక్రమంలో కనుమరుగైంది. ఇలాంటిదే మరో ప్రధాన బావి కానాల బావి. మోట ద్వారా నీళ్లను తోడేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాలతో కానాల బావిగా పేరొచ్చింది. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ బావి నిర్మాణ శైలి అబ్బురపరిచే విధంగా ఉండేది. ఈ బావి కింద 20 ఎకరాల భూమి సాగయ్యేది. ప్రస్తుతం కానాలబావి కనిపించడం లేదు. మహిళల చేతి గాజును పోలిన నిర్మాణంతో ఉన్న గాజులబావి 15 ఎకరాలకు నీరు పారించేది. సిమెంటు వాడుకలో లేని సమయంలో డంగుసున్నంతో కట్టిన ఈ బావి అప్పటి నిర్మాణ నైపుణ్యానికి తార్కాణంగా నిలిచేది. ప్రస్తుతం ఆ బావి జాడ లేకుండా పోయింది. మున్సిపాలిటీ పరిధిలోని దర్మాజీపేటలో ఉన్న దేవతల బావిలో స్వయంగా దేవతలే వచ్చి స్నానం చేస్తారని పేరుండేది. ప్రస్తుతం ఆ బావి పూర్తిగా ధ్వంసమైంది.  


కోనేరులకు పూర్వ వైభవం వచ్చేనా?

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో చారిత్రక ఆనవాళ్లుగా మిగిలిన చెల్లాపూర్‌ సోమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, దర్మాజీపేట శివాలయం కోనేరులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఐదారు శతాబ్దాల క్రితం నిర్మించిన కోనేరులు ఆదరణలేక ధ్వంసమవుతున్నాయి. ఈ కోనేరుల పవిత్రత, ప్రత్యేకతలపై అప్పటి తరం పెద్దలు ప్రత్యేంగా చెప్పుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఇటీవల చెరువులు, వాగులు పొంగిపొర్లుతుండటంతో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇప్పటి తరానికి ఈత రాకపోవడమే ప్రమాదాలకు కారణమవుతున్నది. రాష్ట్రంలో మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో పలుచోట్ల శిథిలమైన మెట్లబావులు, కోనేరులకు జీవం పోస్తున్నారు. హెచ్‌ఎండీఏ, ప్లీఛ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని పలు చారిత్రాత్మక బావులను పునరుద్ధరిస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం మిగిలిన ఐదు మెట్లబావులు, కోనేరులను పునరుద్ధరించి ముందుతరాలకు అందజేయాల్సిన అవసరం ఉన్నది. యువత ఈత నేర్చుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పవచ్చు.


దేవునిబావిలో గోతలు వేసేవాడిని

దేవుని బావిలో 12 అడుగుల ఎతు నుంచి గోత కొట్టేవాడిని. తలకిందికి పెట్టి ఎత్తు నుంచి దూకే ఈ విన్యాసాన్ని ‘ఫలంబర్‌’ అనేవాళ్లం. పక్కనే రోడ్డు నుంచి పరిగెత్తుకుంటూ బావిలో దూకే వాళ్లం. పోటీపడి ఈత కొట్టేవాళ్లం. ప్రసుతం ఈతకొట్టే బావులే లేకుండాపోయాయి.

-వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, దుబ్బాక 


చారిత్రాత్మక బావులను కాపాడాలి

దుబ్బాకలో చారిత్రక బావులు కనుమరుగవుతున్నాయి. ఉన్నవాటినైనా కాపాడుకోవాలి. చెల్లాపూర్‌లోని శతాబ్దాల చరిత్ర కలిగిన కోనేరులను పురావస్తుశాఖ ఆధ్వర్యంలో సంరక్షించాలి. మున్సిపల్‌శాఖ స్పందించి చరిత్రను కాపాడి ముందుతరాలకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలి.

- శ్రీరాం నరేందర్‌, కండక్టర్‌, దుబ్బాక 


Read more