కరకట్టల కథ.. అంతేనా..?

ABN , First Publish Date - 2021-10-12T04:19:21+05:30 IST

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. నదీ పరీవాహక ప్రాంత ప్రజల కష్టాలు తీరడం లేదు. తుఫాన్‌లు, వరదలు వస్తే చాలు.. అరచేతిలో ప్రాణాలు పట్టుకొని వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో నాగావళి, వంశధార నదీ పరీవాహక ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

కరకట్టల కథ.. అంతేనా..?
కలివరంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణాలు కొట్టుకుపోయిన దృశ్యం


- నిలిచిపోయిన పనులు

- తుఫాన్ల సమయంలో కోతకు గురవుతున్న నదీ తీర ప్రాంతాలు

- ఆందోళన చెందుతున్న ప్రజలు 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. నదీ పరీవాహక ప్రాంత ప్రజల కష్టాలు తీరడం లేదు. తుఫాన్‌లు, వరదలు వస్తే చాలు.. అరచేతిలో ప్రాణాలు పట్టుకొని వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో నాగావళి, వంశధార నదీ పరీవాహక ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. తుఫాన్‌ల సమయంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. కరకట్టలు లేక నదుల ఒడ్డున గట్లు కోతకు గురవుతున్నాయి. ఇళ్లు, ఇతర   నిర్మాణాలు ముంపు బారిన పడుతుండడంతో నదీ తీరప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల ఆమదాలవలస మండలం కలివరంలో నాగావళి నది ఒడ్డున నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రం గులాబ్‌ తుఫాన్‌ వరద ఉధృతికి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. నాగావళి నదీ పరీవాహక ప్రాంతంలో కలివరం, ఇసుకలపేట, ముద్దాడపేట, తొగరాం, దిబ్బలపేట, కొత్తవలస తదితర గామ్రాల ప్రజలకు తరచూ ముంపు భయం వెంటాడుతూనే ఉంది. 

- వంశధార నదిలో లక్ష క్యూసెక్కుల నీరు ప్రవహిస్తే నదీ పరీవాహక ప్రాంతాలు కోతకు గురవుతుంటాయి. పొలాలు నీట మునిగి అన్నదాతలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. హిరమండలం మండలం గులుమూరు నుంచి అక్కరాపల్లి వరకు 15 కిలోమీటర్ల వరకు కరకట్టల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. భగీరథపురం, పిండ్రువాడ, అక్కరాపల్లి నదీతీర ప్రాంతంలో ఎక్కడా కరకట్టల నిర్మాణాలు చేపట్టలేదు. 

- కొత్తూరు మండలం ఆకులతంపర వరకు కరకట్టల పనులను టీడీపీ ప్రభుత్వం గతంలో చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్మాణాలను నిలిపేసింది. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 

- పాలకొండ మండలం నాగావళి పరిధిలో అన్నవరం, అంపిలి, బూర్జ మండలం అల్లిన కరకట్టల పనులు కూడా మధ్యలో నిలిపేశారు. 

- భామిని మండలం వంశధార పరిధిలో బత్తిలి నుంచి కీసర-కోసలి గ్రామాల వరకు సుమారు 20 కిలోమీటర్ల వరకు కరకట్టల పనులు చేపట్టేందుకు ఏటా కొలతలు వేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు. నిధులు రాకపోవడంతో పనులు జరగడం లేదు. దీంతో బత్తిలి, కాట్రగడ్డ బి, నేరేడు బి, మిల్లమడ, లిగిరి, బాలేరు, కేసర, కోసలి గ్రామాలు కోతకు గురవుతున్నాయి.  


 ప్రతిపాదనలకే.. 

జిల్లాలో వంశధార నదీ పరీవాహక ప్రాంతమైన కరకవలస నుంచి కల్లిపేట వరకు సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో కరకట్టల నిర్మాణానికి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రూ.55 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపారు. అప్పట్లో కరకవలస నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 5 కిలోమీటర్ల నదీ పరీవాహక ప్రాంతంలో మాత్రమే కరకట్టల పనులు చేపట్టారు. మళ్లీ వరదలు రావడంతో ఈ పనులు నిలిచిపోయాయి. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కరకట్టల నిర్మాణం, నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించడం లేదు. 

- ప్రస్తుతం జలుమూరు మండలం నగిరికటకం, కొమనాపల్లి, కత్తిరివానిపేట, మాకివలస, పర్లాం, అందవరం, రామకృష్ణాపురం, ఉడకలపేట, యాతపేట గ్రామాల తీర ప్రాంతంలోని కరకట్టల నిర్మాణాల పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి కరకట్టల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని నదీ తీర ప్రాంతాల వాసులు కోరుతున్నారు. 




Updated Date - 2021-10-12T04:19:21+05:30 IST