వంట మనుషులు కావలెను

ABN , First Publish Date - 2021-04-10T05:45:06+05:30 IST

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వసతిగృహాల్లో వంట మనుషుల కొరత వేధిస్తోంది. వంట మనిషి(కుక్‌), కమాటీ పోస్టుల ఖాళీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకరి స్థానంలో మరొకరు ప్రైవేటుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

వంట మనుషులు కావలెను
భరణికోట వసతిగృహంలో వంట చేస్తున్న ప్రైవేటు వ్యక్తి

ఐటీడీఏ వసతిగృహాల్లో సిబ్బంది కొరత

159 కుక్‌, కమాటీ పోస్టులు ఖాళీ

ఒకరి స్థానంలో మరొకరు ‘ప్రైవేటు’గా విధులు

పట్టించుకోని అధికారులు 

(మెళియాపుట్టి)

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వసతిగృహాల్లో వంట మనుషుల కొరత వేధిస్తోంది. వంట మనిషి(కుక్‌), కమాటీ పోస్టుల ఖాళీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకరి స్థానంలో మరొకరు ప్రైవేటుగా విధులు నిర్వర్తిస్తున్నారు.  దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

- మెళియాపుట్టి మండలం పెద్దమడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 393 మంది విద్యార్థులకుగానూ కేవలం ఇద్దరు వంట మనుషులే ఉన్నారు. వార్డెన్‌ సొంతంగా మరో ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నారు. వారికి జీతాలు మాత్రం సకాలంలో చెల్లించడం లేదు. 

- నందిగాం మండలం జయపురం వసతి గృహంలో వంట మనిషి ఒక్కరు కూడా లేరు. దీంతో పెద్దమడి వాచ్‌మెన్‌ బహుద్‌ పదేళ్లుగా జయపురంలో డిప్యూటేషన్‌పై వంట చేస్తున్నారు. 

- టెక్కలి వసతిగృహంలో 154 మంది విద్యార్థులకుగానూ ముగ్గురు వంట మనుషులు ఉన్నారు. సవరలింగుపురంలోని కమాటీ బి.సురేంద్రను డిప్యూటేషన్‌పై నియమించారు. 

ఐటీడీఏ పరిధిలోని 46 వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పదేళ్లుగా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా... నాల్గో తరగతి ఉద్యోగుల నియామకం మాత్రం చేపట్టడం లేదు. సుమారు 159 మంది కుక్‌లు, కమాటీల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న కుక్‌లు, కమాటీలు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. వారి స్థానంలో స్థానికులను ఏర్పాటు చేసి వంటలు చేయిస్తున్నారు. కొంతమంది వార్డెన్‌లు రోజువారీ కూలి కింద రూ.200 చొప్పున చెల్లించి వారిని ఏర్పాటు చేశారు. అనుభవం లేనివారు వంటలు చేయడంతో అవి రుచికరంగా ఉండడం లేదంటూ విద్యార్థులు వాపోతున్నారు. బాలికల వసతి గృహాల్లో నైట్‌వాచ్‌మెన్‌లు ఉండాల్సి ఉండగా, ఎక్కడా కానరావడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి సమావేశంలోనూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయమై చర్చిస్తున్నా... పట్టించుకునే నాథుడే లేడని డీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు కోత ధర్మారావు తెలిపారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని విమర్శించారు. 


 భర్తీకి చర్యలు 

ఆశ్రమ వసతిగృహాల్లో కుక్‌లు, కమాటీలతో పాటు నైట్‌వాచ్‌మెన్ల కొరత ఉందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ వెలువడితే పోస్టులు భర్తీ చేస్తాం. రానున్న విద్యాసంవత్సరం నాటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. 

 - నాగలక్ష్మి, ఏటీడబ్ల్యూవో, పాతపట్నం 

Updated Date - 2021-04-10T05:45:06+05:30 IST