సిబ్బంది లేక...సేవలందక

ABN , First Publish Date - 2022-01-20T05:53:09+05:30 IST

ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో సిబ్బంది లేకపోవడంతో రోగులకు సేవ లందని దుస్థితి నెలకొంది. ఇక్కడకు మునిసిపాలిటీలోపాటు చుట్టుపక్కల గల 21 పంచాయతీలు, ఒడిశాలోని పలుప్రాంతాల నుంచి రోగులు ఇక్కడే వైద్య సేవలు పొందుతుంటారు.

సిబ్బంది లేక...సేవలందక
వైద్యుడి కోసం ఎదురు చూస్తున్న రోగులు

ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో వైద్యుల కొరత 

ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు 

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో సిబ్బంది లేకపోవడంతో రోగులకు సేవ లందని దుస్థితి నెలకొంది. ఇక్కడకు మునిసిపాలిటీలోపాటు చుట్టుపక్కల గల 21 పంచాయతీలు, ఒడిశాలోని పలుప్రాంతాల నుంచి రోగులు ఇక్కడే  వైద్య సేవలు పొందుతుంటారు. రోగుల సౌకర్యార్థం మూడు కోట్ల నూతన భవనం కూడా నిర్మిం చారు. పూర్తిస్థాయిలో సేవలందించేందుకు ఆరుగురు వైద్యులు అవసరం, కాగా నలుగురు ఉండేవారు. ఇటీవల  వైద్యుడు పొట్టా శ్రీనివాసరావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదతమే. మరో వైద్యురాలు సుశీల మెటర్నటీ లీవ్‌లో ఉన్నారు. మరో ఇద్దరు వైద్యులు పాపినాయుడు, రవీంద్ర సెలవులో ఉన్నారు. దీంతో  ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దామోదర్‌ ప్రధాన్‌ ఒక్కరే అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో సేవలందకపోవడంతో ఇక్కడకు వచ్చే  రోగులు  ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సీహెచ్‌సీపై  ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రి కమిటీ సమావేశాలు కూడా నిర్వహించడంలేదు. గతంలో రోజుకు ఓపీ 200 నుంచి 300 వరకు ఉండేది. దీంతో పాటు ఇన్‌పేషెంట్లు 20 నుంచి 30 మంది వరకు ఉండేవారు. వైద్యులు కొరతతో ఓపీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఇన్‌పేషెంట్లు ఒక్కరూ కూడా లేదు. నిత్యం జ్వరాలు, మధుమేహం, బీపీ, ఽథైరాయిడ్‌ తదితర సమస్యలతో ఆస్ప త్రికి వందలాది మంది వస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు లేకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు. 


డీసీహెచ్‌ఎస్‌ దృష్టికి తీసుకువెళ్లా..

సీహెచ్‌సీలో వైద్యుల కొరతపై డీసీహెచ్‌ఎస్‌ బి.సూర్యారావు దృష్టికి తీసుకువెళ్లి నట్లు సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ దామోదర్‌ ప్రధాన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఎక్కువ మంది వైద్యులు ఉన్న ఆస్పత్రి నుంచి కొందరిని డిప్యూటేషన్‌పై ఇక్కడకు పంపిస్తే రోగులకు ఇబ్బంది ఉండదని చెప్పారు. ఉన్నతాధికారులు సీహెచ్‌సీపై దృష్టి సారిస్తే వైద్యుల కొరత సమస్య తీరుతుందని తెలిపారు.  


Updated Date - 2022-01-20T05:53:09+05:30 IST