Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రీడల్లో రాజకీయ జోక్యం తగదు!

బ్యాడ్మింటన్‌ అధ్యక్షుడిగా తప్పుకుంటా!

రాజకీయ పునరావాస కేంద్రాలుగా క్రీడా సంఘాలు

క్రీడారంగ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం

సబ్‌కమిటీ భేటీలో కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రాష్ట్రంలో నిస్తేజంగా మారిన క్రీడా రంగానికి కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీతో జోష్‌ వచ్చింది. గత రెండు సమావేశాల మాదిరిగా కాకుండా ఈసారి భేటీలో క్రీడారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలపై సబ్‌కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. మంగళవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో క్రీడామంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. తొలుత స్పోర్ట్స్‌ పాలసీ రూపకల్పన కోసం నియమించిన కన్సల్టెన్సీ, వారు రూపొందించిన ముసాయిదాలోని అంశాలను కమిటీకి వివరించారు. అనంతరం ఐటీ మంత్రి కేటీఆర్‌ గంటకు పైగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యార్ధులకు క్రీడలు అందుబాటులో ఉండాలన్నారు.


కేవలం పని, చదువు మీదే కాకుండా  ఆటలు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, ఫిజికల్‌ లిటరసీ అవసరమని అన్నారు. గ్రామ, పట్టణ, నగర స్థాయిలో ఆటల మీద అవగాహన, ఆసక్తి పెంచాలన్నారు. దీనికి ఆయా శాఖల ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రోత్సాహం అందించాలని సూచించారు. పాఠశాలల్లో క్రీడలను తప్పనిసరి చేయాల న్నారు. క్రీడా పరికరాలు, క్రీడా మైదానాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఆటల సదుపాయాలు, ఓపెన్‌ జిమ్స్‌, ఇతర అంశా లను సైతం భాగస్వామ్యం చేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశా మోడల్‌లో మనం కూడా ఒకట్రెండు టీమ్‌ గేమ్స్‌ను ఎంపిక చేసుకొని ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున నిధులు ఇవ్వడంతో పాటు ఆ క్రీడల పురోగతికి అన్ని విధాలా ప్రోత్సహిద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మైదానాలను, సుమారు 3వేల మంది వరకున్న పీఈటీల సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే విషయమై పాలసీలో ఒక విధానాన్ని పొందుపర్చాలి. ఇందుకోసం క్రీడా, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలి. స్పోర్ట్స్‌ కిట్లు, గ్రాంట్లు గ్రామీణ స్థాయి వరకు చేరాలి. రాష్ట్ర ఒలింపిక్‌, క్రీడా సంఘాల రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఈ సంఘాలు అసలేం చేస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఈ విధానం మారాలంటే క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. త్వరలోనే నేను బ్యాడ్మింటన్‌ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తా. క్రీడా సంఘాల నిర్వహణలో మాజీ క్రీడాకారులు, క్రీడారంగ నిపుణులకు అవకాశమివ్వాలి’ అని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.  


కేబినెట్‌ ముందుకు కోచ్‌ల ఫైల్‌:

నూతన స్పోర్ట్స్‌ పాలసీతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కోచ్‌ల రెగ్యులరైజేషన్‌ అంశాన్ని కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ముందు  జరగనున్న కేబినెట్‌ భేటీలో సీఎం ముందు ఉంచాల్సిందిగా సోమేష్‌ కుమార్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ను కేటీఆర్‌ కోరారు. తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా తయారు చేయాలంటే విప్లవాత్మక మార్పులు అవసరమని చెప్పారు. శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కోచింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒప్పంద కోచ్‌లకు అన్యాయం జరిగిందని.. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement