నిలకడగా పొగాకు మార్కెట్‌

ABN , First Publish Date - 2022-05-17T06:43:20+05:30 IST

దక్షిణాది పొగాకు మార్కెట్‌ నిలకడగా సాగుతోంది. సాధారణంగా ఈసమయంలో మీడియం, లోగ్రేడ్‌లకు వ్యాపారులు సరైన ధరలు ఇవ్వక రైతులు ఆందోళనకు దిగుతుండేవారు.

నిలకడగా పొగాకు మార్కెట్‌

బ్రౌన్‌, పచ్చ రకాలకు  మంచి డిమాండ్‌

కిలో రూ.180 పలుకుతున్న వైనం

కొనుగోళ్లకు పోటీపడుతున్న వ్యాపారులు

జూన్‌ ఆఖరుకు వేలం పూర్తిపై బోర్డు దృష్టి

ఒంగోలు, మే 16 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌ నిలకడగా సాగుతోంది. సాధారణంగా ఈసమయంలో మీడియం, లోగ్రేడ్‌లకు వ్యాపారులు సరైన ధరలు ఇవ్వక రైతులు ఆందోళనకు దిగుతుండేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అందుకు భిన్నంగా ఆ రకాలకు మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రత్యేకించి లోగ్రేడ్‌లలో మెరుగైనవిగా  గుర్తింపు ఉండే బ్రౌన్‌ (ఎఫ్‌4), పచ్చ (ఎఫ్‌6, ఎఫ్‌7) రకాలకు వారం రోజులుగా మార్కెట్లో మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. మేలురకం గ్రేడ్‌ల గరిష్ఠ ధరలు కిలో రూ.186పైనే నిలకడగా సాగుతుండగా.. బ్రౌన్‌, పచ్చరకం గ్రేడ్‌ల ధరలు కిలో రూ.175నుంచి 180 వరకు పలుకుతున్నాయి. ఒకరకంగా మీడియం గ్రేడ్‌లు (ఎఫ్‌3, ఎంఎఫ్‌3)కు సమానంగా బ్రౌన్‌, పచ్చ ధరలు ఉంటున్నాయి. గత ఏడాది ఈ రకం పొగాకు కిలో గరిష్ఠంగా రూ.125నుంచి 135 లోపు మాత్రమే ఉంది. ఈసారి కిలోకు దాదాపు రూ.45నుంచి 50 వరకూ పెరుగుదల కనిపిస్తుండటంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. 


ఇప్పటి వరకు 53శాతానికి పైగా కొనుగోళ్లు

2021-22 పంట కాలానికి దక్షిణాదిలోని 11వేలం కేంద్రాల్లో 79.13 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతించగా సుమారు 69 మిలియన్‌ కిలోలు జరిగినట్లు అంచనా. మార్చి 14న వేలం ప్రారంభం కాగా  శనివారం నాటికి 37 మిలియన్‌ కిలోల  (53.62శాతం) పంట కొనుగోలు జరిగింది. సగటున కిలోకు రూ.171.32 ధర లభించింది. కనిగిరి, డీసీపల్లి, కలిగిరి లాంటి వేలం కేంద్రాలలో ఇప్పటికే 75నుంచి 80శాతం వేలం పూర్తి కాగా జూన్‌ ఆఖరులోపు మొత్తం ప్రక్రియ పూర్తిపై బోర్డు అధికారులు దృష్టి సారించారు. మరోవైపు వేసవిలో రంగు మారి, ధరలు తగ్గకుండా చూసుకొనేందుకు ఇటీవల కాలంలో చాలా మంది రైతులు మేలు రకం పొగాకు బేళ్లను కోల్డ్‌ స్టోరేజీల్లో పెడుతున్నారు. అలా ప్రస్తుతం దాదాపు ఐదు మిలియన్‌ కిలోలకుపైన ఉన్నట్లు తెలుస్తోంది. జూన్‌ ఆఖరు నుంచి వాటిని వేలంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 



Updated Date - 2022-05-17T06:43:20+05:30 IST