కత్తిదూసిన ఉన్మాదం

ABN , First Publish Date - 2022-01-23T06:08:21+05:30 IST

భార్య వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని ఉన్మాదిగా మార్చింది. రెండు హత్యలకు పురిగొల్పింది.

కత్తిదూసిన ఉన్మాదం
గాయపడి చావుబతుకుల్లో ఉన్న కాశీకుమార్‌, నిందితుడు రబ్బానీ

నెల్లూరు జిల్లాలో తల్లీకొడుకు హత్య

ఆపై ఒంగోలులో యువకుడిపై హత్యాయత్నం

వివాహేతర సంబంధమే కారణం

పోలీసుల అదుపులో నిందితుడు

ఒంగోలు (క్రైం), జనవరి 22 : భార్య వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని ఉన్మాదిగా మార్చింది. రెండు హత్యలకు పురిగొల్పింది. మరో యువకుడిని చావుబతుకుల్లోకి నెట్టింది. నెల్లూరు జిల్లాలో ఉండే తన భార్య వదిన, ఆమె కుమారుడిని కత్తితో నరికి చంపిన అతను, ఒంగోలు వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న యువకుడిపైనా యత్నాయత్నం చేశాడు. అతను ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన రబ్బానీ బతుకుదెరువు కోసం ఏడాది క్రితం ఒంగోలు వచ్చి సత్యనారాయణపురంలో ఓ పిల్లల ఆసుపత్రి ఎదురుగా టీ దుకాణం ఏర్పాటు చేశాడు. సమీపంలో నివాసం ఉండే కాశీకుమార్‌ దుకాణంలో పనికి చేరాడు. కాశీకుమార్‌ అక్కడ పనిచేస్తూ యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈక్రమంలో గతేడాది జూలైలో కాశీకుమార్‌ ఆమెను తీసుకొని ఎటో వెళ్లిపోయాడు. దీనిపై కాశీరావు తల్లిదండ్రులు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిరువురినీ గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చి కాశీరావును వారి తల్లిదండ్రులకు, రబ్బానీ భార్యను పుట్టింటి వారికి అప్పగించారు. ఈ నేపథ్యంలో రబ్బానీ తన ఆరేళ్ల కుమారుడిని వెంట తీసుకొని స్వగ్రామం అయిన పోలంపాడు వెళ్లాడు. అతని భార్య మాత్రం నెల్లూరులోని అన్న వద్ద ఉంటోంది.


నెల్లూరు జిల్లాలో ఇరువురి హత్య

అప్పటి నుంచి రబ్బానీ తన భార్య దూరం కావడానికి కారణం కాశీరావు అని, అతనికి తన భార్య వదిన మీరమ్మ, ఆమె కుమారుడు ఆరిఫ్‌లు సహకరిస్తున్నాడని భావించాడు. వారిపై అనుమానం పెంచుకున్నాడు. శనివారం ఉదయం 9గంటలకు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతీ పరిధిలోని అంబటివారిపాలెం వెళ్లాడు. అక్కడ తల్లీకొడుకులు మీరమ్మ, ఆరిఫ్‌లను దారుణంగా నరికేశాడు. అక్కడ నుంచి నేరుగా ద్విచక్ర వాహనంపై ఒంగోలుకు చేరుకున్నాడు. తన పథకం ప్రకారం కాశీకుమార్‌ కదలికలను రబ్బానీ ముందే తెలుసుకున్నాడు. ప్రస్తుతం ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్న కాశీకుమార్‌ నిత్యం సిగరెట్టు తాగేందుకు రవిప్రియ మాల్‌ సమీపంలో బడ్డీకొట్టు వద్దకు వెళ్తాడని ముందుగానే గుర్తించిన రబ్బానీ అక్కడ కాపు కాశాడు. కాశీకుమార్‌ వచ్చిన వెంటనే తన భార్యను ఎక్కడ ఉంచావు.. అంటూ గొడవకు దిగాడు. నాకేమీ సంబంధం లేదంటూ కాశీకుమార్‌ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే రబ్బానీ తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి తర్వాత గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన కాశీకుమార్‌ను స్థానికులు ఆసుపత్రి తరలించారు.


బాధ్యతగా వ్యవహరించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

ఉత్తర బైపాస్‌లో ట్రాఫిక్‌ విఽధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ రవిప్రియ మాల్‌ సమీపంలో కత్తులతో పొడుచుకుంటున్నారని సమాచారం తెలియగానే స్పందించారు. వెంటనే సంఘటనా స్థలం వద్దకు చేరుకొని నిందితుడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తాలుకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రబ్బానీ నెల్లూరు జిల్లాలో రెండు హత్యలు చేసి ఇక్కడికి వచ్చాడన్న విషయం పోలీసులకు తెలిసింది. కానిస్టేబుల్‌ నుంచి హత్యాయ త్నం సమాచారం అందిన వెంటనే తాలుకా సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై దేవకుమార్‌లు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  



Updated Date - 2022-01-23T06:08:21+05:30 IST